తాడేపల్లి: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు, టీచర్ల భద్రత విషయంలో రాజీపడమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో భౌతికదూరం పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించే విధంగా ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో పరిస్థితులకు.. ఏపీలో పరిస్థితులకు తేడా ఉందని, కరోనా నియంత్రణలో దేశంలోనే ఆదర్శంగా ఉన్నామన్నారు. కరోనా నేపథ్యంలో 11 పేపర్లుగా ఉన్న పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించి.. ప్రతి పేపర్ 100 మార్కులు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.