వెంకన్న పేరుతోనూ టీడీపీ దుష్ట రాజకీయం! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 
 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపై అభాండాలు వేయడానికి, దుష్ట రాజకీయం చేయడానికి తెలుగుదేశం సాక్షాత్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరును సైతం వాడుకోవడం మానలేదు. కుల మతాలకు అతీతంగా తెలుగువారు సహా ప్రజలందరికీ దర్శనమిచ్చే కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామి. ఏడుకొండలవాడిపై భక్తిప్రపత్తులు ఉన్న ఎవరైనా కోనేటి రాయుడి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడిపై భక్తిశ్రద్ధలకే గాని సాంప్రదాయాలకు పెద్ద పీట వేయరు. తెలుగునాట గత 40 మాసాలుగా ప్రతిపక్షంగా కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, ఆయన బృందం ఇప్పుడు మరోసారి ఏడుకొండల దేవుడి పేరుతో దుర్మార్గ రాజకీయం మొదలుబెట్టారు. వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ గారు స్వయంగా ఎప్పటిలా సమర్పించారు. సప్తగిరి దైవం దీవెనలు అందుకున్నారు. ఇది గిట్టని ఎమ్మెల్సీ లోకేష్‌ బాబు సహా టీడీపీ నేతలు– ‘ఏ సీఎం అయినా సతీసమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి ఇవ్వాలనే’ కొత్త పాట అందుకున్నారు. జగన్‌ గారి తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారు అవకాశం వచ్చినప్పుడల్లా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు. ఏనాడూ ఈ జననేత ఆలయ ప్రోటొకాల్‌ సౌకర్యాలను వాడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆయన దైవదర్శనం చేసుకునేవారు. పట్టువస్త్రాలు సమర్పించాల్సివచ్చినప్పుడు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి హోదాలో మహాద్వారంలోంచి వెంకన్న స్వామిని దర్శించుకునేవారు. వెంకటేశ్వరస్వామిపై అపార భక్తిశ్రద్ధలు, విశ్వాసం ఉన్న కుటుంబం వారిది. వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి తాత వెంకటరెడ్డి గారి ఇష్టదైవం వెంకటేశ్వరస్వామి. తిరుమల ఆలయ ప్రవేశంలో ప్రోటొకాల్స్, కాలం చెల్లిన సాంప్రదాయాలకు మించిన భక్తిప్రపత్తులు ఉన్న కుటుంబానికి చెందిన నేత వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిపై ప్రస్తుత పవిత్ర సందర్భంలో సైతం అభాండాలు వేయడం తెలుగుదేశం పార్టీకి కీడుచేసే అంశమేగాని ‘రాజకీయ లబ్ధి’ చేకూర్చే విషయం కాదు. 2019 మే నెల నుంచి వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు గారి పార్టీ ఇక నుంచైనా మతం, కులం, సాంప్రదాయం పేరుతో చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కూడా పవిత్ర గ్రంథమే అనే విషయం టీడీపీ అధినేత గుర్తించాలి.
 

Back to Top