హైదరాబాద్: ఆళ్లగడ్డ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడిందని, అవినీతిని అంతమొందించేందుకు, అవినీతిపరులను భరతం పట్టేందుకు టీడీపీ వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరినట్లు ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిన ఇరిగెల రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచక పాలనను భరించలేక..ఎలాంటి అభివృద్ధి లేనటువంటి టీడీపీని వీడామన్నారు. ప్రజల అభివృద్ధి కోసం..సమ సమాజ స్థాపనకు ఇవాళ వైయస్ జగన్ చేస్తున్న పోరాటంలో మేం కూడా భాగస్వాములమై..రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి..వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో ఒక సైనికుడిలాగా పని చేస్తామన్నారు. ఆళ్లగడ్డలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మంత్రిగా అఖిలప్రియకు అవకాశం ఇచ్చినా ఆమె విఫలమైందన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, తెలుగుగంగా కాల్వను అధునీకరించేందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం అందడం లేదన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగడం లేదన్నారు. అవినీతిని అంతమొందించేందుకు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరామన్నారు. పార్టీలో తమకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా శిరసావశిస్తూ వైయస్‌ఆర్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.