జీసీసీ ఆస్తుల వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

అసెంబ్లీ: ఆంధ్రరాష్ట్రంలో గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌) ఆస్తుల వివరాలను డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి వెల్లడించారు. అసెంబ్లీలో సభ్యురాలు అడిగిన ప్రశ్న మేరకు ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. ‘జీసీసీకి సంబంధించి ఆస్తులు. జీసీసీకి రాష్ట్రవ్యాప్తంగా 3,28,212 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 540 డీఆర్‌ డిపోలు ఉన్నాయి. 2,62,270 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన 134 గోదాములు ఉన్నాయి. 12 ఎల్‌పీజీ స్టోరేజీ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక్కోపాయింట్‌లో 660 సిలిండర్లు నిల్వ చేసే అవకాశం ఉంది. జీసీసీకి చెందిన 5.31 ఎకరాల భూముల్లో 16 పెట్రోల్‌ బంకులు నిర్మించి జీసీసీ ద్వారా నిర్వహిస్తున్నాం. 89,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో 26 ప్రాంతాల్లో కార్యాలయ భవనాలు, సిబ్బంది నివాస గృహాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా 12,430 చదరపు గజాల్లో సీతంపేట, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, పాడేరు, అరకు, రాజేంద్రపాలెం, కేడీపేట, రంపచోడవరం, అడ్డతీగల, కేఆర్‌పురం, చింతూర్లలో 12 సూపర్‌ బజార్లను నిర్మించడం జరిగింది. 10,812 చదరపు గజాల్లో నిర్మించిన 6 పరిశ్రమలు, ఇదికాకుండా 3495 చదరపు గజాల ఖాళీ స్థలాలు కూడా జీసీసీకి ఉన్నాయి. జీసీసీకి 35,723 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 134  గోదాములు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ గోదాములు అన్నీ జీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలియజేశారు.

 

Back to Top