చంద్రబాబు కొత్తగా రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదం

డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్

 

తాడేపల్లి: చంద్రబాబు కొత్తగా రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉంద‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్‌కే పోయిందని, అయినా సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పిన ఏ మాటను వెనక్కి తీసుకోకుండా  అమలు చేస్తున్నారని కొనియాడారు. 

 రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 65 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను తన పాలనలో ఎంతో నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఇవాళ రైతుల కోసం అంటూ నిరసనకు దిగడం హాస్యాస్పదంగా ఉంది. మేనిఫెస్టోలో ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత దేన్నీ అమలు చేయలేదు.

మాట తప్పారు:
    రైతు రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి ఇంటికే తెచ్చి ఇస్తామన్నారు. వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ని«ధి ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. 
    ఇంకా వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవాతో పాటు, పోలవరం ప్రాజెక్టును కూడా 2018 నాటికే పూర్తి చేసి సాగు నీరిస్తామన్నారు. కానీ అవేవీ చేయని నాటి ముఖ్యమంత్రి, ఇవాళ్టి ప్రతిపక్ష నేత ఇప్పుడు రైతు కోసం అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం చాలా విడ్డూరంగా ఉంది.
    ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, భయంతో రైతు కోసం అంటూ కార్యక్రమాలు చేపడుతున్నాడు. చంద్రబాబుకు ఇప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగీ ఈ కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

గాలి మాటలు:
    ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అని, ఇప్పుడేమై రైతుల కోసం కార్యక్రమాలు చేపడుతున్నాడు. దీన్ని విజ్ఞత కలిగిన ప్రజలంతా గమనించాలి. రెయిన్‌ గన్‌లతో కరువును జయిస్తానని, తుపానులు, సముద్రాలను కూడా నియంత్రిస్తానని, అమరావతిలో ఉష్ణోగ్రత తగ్గిస్తానని.. ఇలాంటి మాటలు చంద్రబాబు చాలా చెప్పారు. అవన్నీ జరిగితే ఎంతో సంతోషం. కానీ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. 

వ్యవసాయమే ప్రాధాన్యం:
    రైతులు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారిని నమ్మారు. అందుకే అఖండ మెజారిటీతో గెలిపించారు. ప్రజలంతా కలిసి 175 స్థానాలలో 151 చోట్ల గెలిపించారు. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలుంటాయి. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు వ్యవసాయం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో అత్యథిక మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సంకల్పించారు. 
    ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు చూసి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే రైతు కోసం అంటూ కార్యక్రమం మొదలు పెట్టారు.

మహానేత వారసుడిగా:
    రైతులకు ఏం కావాలన్నది గుర్తించిన మహానేత వైయస్సార్‌ ఆనాడు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. జలయజ్ఞంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం పెట్టారు. ఆ విధంగా రైతులకు ఆయన ఆత్మస్థైర్యం కలిగించారు.
ఆయన వారసుడిగా శ్రీ వైయస్‌ జగన్‌గారు కూడా అదే బాటలో నడుస్తూ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.

కోవిడ్‌ కష్టకాలంలోనూ:
    27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్‌తోనే గడిచిపోయింది. సంపన్న దేశాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నాయి. దేశంలోని సంపన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాయి. 
    కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారు, చెప్పిన ఏ ఒక్క విషయాన్ని కూడా వెనక్కు తీసుకోకుండా, కోవిడ్‌ కష్టకాలంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక మంది ఆధారపడిన వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
    కోవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా ప్రజలకు చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం ఆపలేదు. ఆదాయం రావడం, రాకపోవడం అని చూడకుండా, అప్పులు చేసైనా సరే ప్రజల కష్టాలు తీర్చాలని, రైతులను ఆదుకోవాలని చూశారు. రైతులు, పేద వర్గాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారు.  

ధృఢ సంకల్పం:
    జగన్‌మోహన్‌రెడ్డిగారు వయసులో చిన్నవాడు. ఆయనకు పాలనలో అనుభవం లేదని టీడీపీ నాయకులు చెబుతుంటారు. అయితే ఒక పని చేయడానికి సమర్థత, ఆలోచన, «ధృఢమైన సంకల్పం ప్రధానం కానీ, వయసు కాదని గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. 
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల కింద చాలా మందికి లబ్ధి కలిగింది. 

రైతుల మేలు కోసం:
    జూన్‌ 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు చూస్తే.. వైయస్సార్‌ రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం చేస్తూ, ఇప్పటి వరకు ఈ పథకంలో మొత్తం రూ.17,030 కోట్ల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గతంలో ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల ముందు పనులు చేసిన ముఖ్యమంత్రులను మాత్రమే మనం చూశాం. కానీ ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, చెప్పిన దాని కంటే ఎక్కువగా రైతులను ఆదుకుంటున్నారు.
    వ్యవసాయానికి పగటి పూటే ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం కోసం తగిన చర్యలు చేపట్టారు. మొత్తం 18.70 లక్షల కనెక్షన్లు ఉండగా, వాటికి విద్యుత్‌ సరఫరా కోసం 8,358 విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఆధునీకరించారు. అలాగే కెపాసిటర్ల సామర్థ్యం పెంచారు. వీటన్నింటి కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
    ఇంకా గత ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.20 వేల కోట్లు బకాయి పెట్టి పోతే వాటన్నింటినీ ఈ ప్రభుత్వం చెల్లించింది. అందులో 7 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కింద రూ.8,750 కోట్లు, అంటే 15 నెలల వాడకానికి బిల్లు చెల్లించలేదు. అంటే 5 ఏళ్లలో కేవలం మూడున్నర ఏళ్లకు మాత్రమే ఆ ప్రభుత్వం బిల్లు చెల్లించింది.
    ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చంద్రబాబు అన్నారు. ఆయన ఒకసారి అలా ఆరేసి చూస్తే, కరెంటు ఉందా లేదా అన్నది తెలిసి వచ్చేది.
    రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకంలో 2019–20కి సంబంధించి 46.79 లక్షల రైతులకు రూ.6,534 కోట్లు, 2020–21కి సంబంధించి 51.59 లక్షల రైతులకు రూ.6,567 కోట్లు, 2021–22 కి సంబంధించి తొలి విడత కింద 52.38 లక్షల రైతులకు రూ.3,929 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ విధంగా కేవలం ఒక్క ఏడాదిలోనే రైతులకు మొత్తం రూ.13,151 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
    ఒక్క రూపాయికే ఉచితంగా పంటల బీమా అమలు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి ఏర్పాటు చేయడంతో పాటు, పశువులు, మేకలు, గొర్రెలకు ఉచిత బీమా సదుపాయం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 458 రైతు కుటుంబాలకు కూడా మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

కళ్లుండి కబోదిలా:
    ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి కూడా, కళ్లుండి కూడా కబోదిలా నటిస్తూ, ఇవాళ రైతు కోసం అంటే నిరసన కార్యక్రమాలను దిగుతుంటే, ప్రజలంతా నవ్వుకుంటున్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ, ఏం చేసినా విమర్శించడమే తప్ప, మంచి పాలనను అభినందించలేక పోతున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల కోసం నిరసన కార్యక్రమం చేపడుతుంటే అంతా నవ్వుకుంటున్నారు. 
    గత ప్రభుత్వం ఏ రకంగా కూడా రైతులను పట్టించుకోకుండా, ఎక్కడా ఆదుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ప్రతిపక్షంగా రైతులు గుర్తుకు వచ్చారేమో.. రైతు కోసం అంటూ కార్యక్రమం మొదలు పెట్టారు. మీరు ఏనాడూ రైతుల కోసం ఆలోచించలేదు. వారి బాధలు అస్సలు పట్టించుకోలేదు. కనీసం వాటిపై ఆలోచన కూడా చేయలేదు.

నేడు అడుగడుగునా అండ:
    ఇవాళ విత్తనం మొదలు పంట అమ్మకాల వరకు అడుగడుగునా రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు ఎంతో సేవలందిస్తున్నాయి. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని సీఎంగారు నమ్ముతున్నారు. వారికి ఎంత చేసినా ఇంకా తక్కువే అన్న భావనతో ఆయన ఉన్నారు. అందుకే రైతులకు అడుగడుగునా ఆయన అండగా ఉంటున్నారు. వారికి ఇంకా ఎంతో మంచి చేయాలని ఆయన తపిస్తున్నారు. వ్యవసాయం ఒక పండగ అన్న వాతావరణం తీసుకురావాలని ఆయన ఆరాటపడుతున్నారు. 
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని సీఎంగారు కృషి చేస్తున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నన్ను డిప్యూటీ సీఎంను చేశారు. కానీ మీరు ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేశారా.
    ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానండి. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. గతంలో  మీరు చేయని అనేక కార్యక్రమాలు, పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. తమకు అన్నింటా అండగా ముఖ్యమంత్రి ఉండడం అదృష్టంగా రాష్ట్ర రైతులు భావిస్తున్నారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్న సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 
    రాష్ట్రానికి సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. గతంలో వారు అనేక తప్పిదాలు చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఏదీ మిస్‌ కాకూడదన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రతి ఒక్క నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందాలి. అదే ప్రభుత్వ లక్ష్యం.. అంటూ డిప్యూటీ సీఎం ప్రెస్‌మీట్‌ ముగించారు.

తాజా వీడియోలు

Back to Top