ప్రతి కుటుంబం బాగుండాలనే..

దశలవారీగా మద్య నిషేధం

మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించాం

ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్టుషాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం

ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయాలు

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

తిరుపతి: గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం దశలవారి మద్యపాన నిషేధం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. నిరుపేద కుటుంబాలు బాగుపడాలి. పేదవాడి నుంచి మద్యాన్ని దూరం చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధం పథకాన్ని తీసుకువచ్చారన్నారు. తిరుపతిలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘ గతంలో మద్యం దుకాణాలు ప్రైవేట్‌ యాజమాన్యాలకు ఇవ్వడం ద్వారా వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి బెల్టు షాపులను ప్రోత్సహించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 43 వేల బెల్టుషాపులను తీసివేయించారు. మద్యాన్ని దశలవారీగా నిషేధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 

రాష్ట్రంలో 4380 మద్యం షాపులు ఇంతకుముందు రన్‌ అయ్యేవి. ప్రస్తుతం 20 శాతం తగ్గించడం వల్ల వాటి సంఖ్య 3500కు చేరింది. ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయి. కొత్త విధానాన్ని కూడా తీసుకువచ్చాం. మద్యాన్ని పేదవాడి దగ్గర నుంచి ఎంత దూరం చేస్తే అంత మంచిది. అదే ప్రక్రియలో ఒక్కసారిగా మద్యాన్ని నిషేధిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు, మేధావుల సలహాల మేరకు దశలవారీగా మద్య నిషేధం కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే మద్యం దుకాణాలను 20 శాతం పూర్తిగా తగ్గించాం. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరిగేవి. కానీ కొత్త విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. ఇది ప్రభుత్వ పరంగా నడిపిస్తున్నాం. ఎమ్మార్పీ రేట్లు, బెల్టుషాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపాం. మద్యపానాన్ని దశలవారీగా నిషేధించే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలయింది. ప్రతి షాపులో డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. మద్యం ధర ఎంత అనేది దానిలో ఉంటుంది. ఈ విధంగా మద్యం ధర పెంచితే పేదవారు అలవాటు మానుకుంటారని ప్రభుత్వ అభిప్రాయం. దశలవారీగా మద్య నిషేధం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ప్రజలకు మంచి జరగాలి. ప్రతి కుటుంబం బాగుపడాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి నారాయణ స్వామి వివరించారు. 
 

Back to Top