రాష్ట్రాభివృద్ధి, ప్రజల బాగు కోసమే శ్రీలక్ష్మీ మహాయజ్ఞం

డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ: రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన మరింత బలోపేతం కావడం కోసం చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం, దేవాదాయ  మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యే శ్రీ‌ల‌క్ష్మీ మ‌హాయ‌జ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటార‌ని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈనెల 12వ తేదీన మొదలై 17వ తేదీన మహాపూర్ణహుతితో కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలనేది శ్రీలక్ష్మీమహాయజ్ఞం ముఖ్యఉద్దేశమన్నారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టి, భావితరాలకు హిందూధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఈ యజ్ఞాన్ని తలపెట్టామని వివరించారు. 
 

Back to Top