న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గళమెత్తింది. ఐదు నెలల కూటమి ప్రభుత్వ పాలనా కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న 77 అకృతాలు, అఘాయిత్యాలపై జాతీయ మహిళా కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాలపై వైయస్ఆర్ సీపీ ఎంపీలు గుమ్మా తనూజా, గురుమూర్తి, ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగాధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ ఎంపీలు జి మాధవి, చింతా అనురాధలు జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు పూర్తి నివేదికను అందజేశారు. అనంతరం ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలపై మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీలు జోక్యం చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు పాలనలో కామ నరకాసరుల వధ జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఇసుక, మద్యంలో కమిషన్లు, వాటాలు పేరుతో సొమ్ము చేసుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారని మండిపడ్డారు. ముచ్చుమర్రి ఘటనలో హత్యకు గురైన మూడు నెలల కావస్తున్నా బాలిక మృతదేహాన్ని ఈరోజుకు కనిపెట్టలేకపోవడం సిగ్గు చేటన్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నివాసం ఉన్న గుంటూరు జిల్లాలో టీడీపీ చెందిన నవీన్.. సహన అనే యవతిపై దాడి చేయడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందగా, బద్వేల్ లో బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని, హోమ్ మంత్రి పొరుగు నియోజకవర్గం రాంబిల్లిలో యువతిని కత్తితో పొడచి చంపగా, ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ సొంత నియోజకవర్గంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగినా కనీస చర్యలు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మదనపల్లెలో పేపర్లు తగలబెడితే డీజీపీని హెలికాప్టర్ లో పంపిన చంద్రబాబు, ఆడపిల్లలకు అఘాయిత్యాలు జరిగితే చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాలిన చిత్తు కాగితాలకు ఉన్న విలువ, మహిళల మాణ ప్రాణాలకు లేవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు టీవీ షోలలోనూ, సినిమా షూటింగ్‌లతోనూ పక్క రాష్ట్రంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. అయితే బాధ్యత గల ప్రజానేతగా ఆయా సంఘటనల్లో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డంతో పాటు మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పరిహారం కూడా అందించారని ఆమె తెలిపారు. వైయస్.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మహిళల రక్షణకు పెద్ద పీట వేసారని, తెలంగాణలో యువతిపై దారుణ అత్యాచారం జరిగితే అటువంటి ఘటనలు జరగకూడదని, దిశ చట్టాన్ని, దిశ యాప్ ను, జీరో ఎఫ్ ఐ ఆర్ ను, సచివాలయాల్లో మహిళా పోలీసును అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేసారు. దిశ యాప్ ద్వారా 31, 600 మంది మహిళలు రక్షింపబడ్డారని, జాతీయ స్థాయిలో 19 అవార్డులు తీసుకుందని, కామాంధులకు కఠిన చర్యలకు దిశ చట్టాన్ని తెచ్చి కేంద్రానికి పంపితే పెండింగ్ లో పెట్టారని వరుదు కల్యాణి వివరించారు. అలాంటి దిశ యాప్‌ను, దిశ పోలీస్ స్టేషన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారని ఆగ్రహించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన వాటిని రద్దు చేస్తే, కామాంధులకు భయం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కమిషన్ అన్ని విషయాలపై ఆరా తీసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరిపాలనపై పట్టు లేకుండా మహిళలపై అత్యాచారాలను నియంత్రించక లిక్కర్, ఇసుక దోపిడీ, కక్ష సాధింపులే ప్రభుత్వానికి ప్రాధాన్యతలుగా మారాయని మండిపడ్డారు. ఈ అఘాయిత్యలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, ఈ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.