భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆస్తి విద్య

విద్యా దీపం కుటుంబం రూపురేఖల్ని మార్చేస్తుంది

ఆ దిశగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

ఆంధ్రా యూనివర్సిటీ మనకు గర్వకారణం

ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం వైయస్‌ జగన్‌

విశాఖపట్నం: భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి కేవలం మంచి చదువు మాత్రమే. ఒక దీపం గది మొత్తం వెలుగునిచ్చినట్లుగా చదువుల దీపం కుటుంబం రూపురేఖల్ని మార్చేస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభించి చదివే ప్రతి కోర్సు విద్యార్థికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏయూ వ్యవస్థాపక వీసీ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సీఎం మాట్లాడుతూ.. చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణమని, విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత విశ్వవిద్యాలయం దేశంలో 14వ స్థానంలో ఉండటం కాస్త అసంతృప్తిని కలిగిస్తోందన్నారు. వర్సిటీకి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం కరువైందని గుర్తించామన్నారు. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని వీసీ ప్రసాదరెడ్డి చెబుతున్నారని, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కితేనే ఏయూని దేశంలో మొదటి 5 విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా నిలబెట్టగలమన్నారు. సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే 77 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమైపోతున్నారు.

దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి స్థానానికి చేరుకున్నప్పుడే సాధ్యమని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ఇందుకు ఐఆర్‌ఎస్‌కి ఎంపికైన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉదాహరణ అన్నారు. ఆయన ఏడో తరగతి వరకూ తెలుగు మీడియంలో, తర్వాత ఇంగ్లీష్‌ మీడియంలో చదివారని, ఆ అడుగు వెయ్యకుంటే ఐఆర్‌ఎస్‌ సాధించలేకపోయేవారన్నారు. చదువుల పట్ల తపన ఉన్న సురేష్‌కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించామని వివరించారు.

పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు నాడు – నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డులు, మంచినీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని, నాడు–నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో రూ.3,600 కోట్లతో 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, మూడుదశల్లో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన అమలు చేస్తున్నామన్నారు. 2024 నాటికి మన పిల్లలంతా పదో తరగతి పరీక్షల్ని ఇంగ్లీష్‌ మీడియంలో రాస్తారన్నారు. వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయో విద్యావంతులు, పూర్వ విద్యార్థులు సలహాలు ఇవ్వాలని కోరారు.

Read Also: ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించేందుకు పవన్‌ దీక్ష

Back to Top