తాడేపల్లి: రానున్న 24 గంటలు అధికార యంత్రాంగమంతా హైఅలర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని సూచించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ, పరిస్థితిని సమీక్షించేందుకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. సహాయక చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే 24 గంటలు హై అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సూచించారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకొని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు పడకుండా చూడాలన్నారు. అవసరమైతే ఇసుక బస్తాలు తదితర సామగ్రి సిద్ధం చేయాలని, గండ్లకు ఆస్కారం ఉన్న చోట వీలైనన్ని ఇసుక బస్తాలు ఉండాలని ఆదేశించారు. ముంపు మండలాలపైన ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సూచించారు. బియ్యం, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని అధికారులను ఆదేశించారు. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థికసాయం అందించాలని సూచించారు.