ఎన్‌ఆర్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం

నాడు-నేడుతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం

మే మాసం కల్లా ఆస్పత్రిలో స్టాఫ్‌ను రిక్రూట్‌ చేస్తాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటీజన్‌ (ఎన్‌ఆర్‌సీ)కి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్‌ బాషా తనతో చర్చించిన తరువాత ఎన్‌ఆర్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా రిమ్స్‌ ఆస్పత్రి వద్ద ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభలో మాట్లాడుతూ.. రిమ్స్‌ ఆస్పత్రికి సంబంధించి పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్, నర్సులు, డాక్టర్లు తక్కువగా ఉన్నారనే సమస్య వినిపిస్తుందని, జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ రిలీజ్‌ చేసి మే మాసం కల్లా ఆస్పత్రిలో స్టాఫ్‌ను రిక్రూట్‌ చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రులను నాడు - నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. ఈ రోజు ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. అభివృద్ధి చేసిన తరువాత ఎలా ఉన్నాయనేది ఫొటోలు చూపిస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని, డిసెంబర్, జనవరి, మార్చి మూడు దఫాలుగా టెండర్లు పిలుస్తున్నామని, మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చి ఫొటోలు చూపిస్తామన్నారు. మీ అందరి ప్రేమానురాగాలు సదా మీ బిడ్డపై ఉంచాలని, ఇంకా గొప్పగా పరిపాలన అందించేలా మీ అందరి దీవెనలు కావాలని, దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో గొప్పగా మంచి జరుగుతుందన్నారు.  

 

Back to Top