వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చాం

పంట ఇన్సూరెన్స్‌కు రైతు రూపాయి కడితే చాలు 

మిగిలిన సొమ్మంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది

రైతు భరోసా కేంద్రాల ద్వారా తోడుగా నిలిచాం

అన్నదాతలకు ఇబ్బంది రాకూడదనే 2018 బీమా సొమ్ము చెల్లిస్తున్నాం

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.596 కోట్లు చెల్లించి 5.94 లక్షల మందికి మేలు చేస్తున్నాం

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతున్నా

పంట బీమా చెల్లింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేలా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని, రైతులందరికీ ఉచితంగా వైయస్‌ఆర్‌ పంట బీమా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పంట వేసే సమయం నుంచి కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతకు అండగా ఉంటాయన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 2018–19కి సంబంధించిన రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్ల చెల్లించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా 5.94 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుందన్నారు. 

2018కి సంబంధించిన రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని కలెక్టరేట్‌లో ఉన్న రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

మామూలుగా అయితే ఇన్సూరెన్స్‌ సొమ్ము రైతు చెల్లించిన తరువాత మిగిలిన ప్రీమియం స్టేట్, సెంట్రల్‌ గవర్నమెంట్‌ సగంగా చెల్లించాలి. పంటల సీజన్‌ ప్రారంభమయ్యే నెలన్నర సమయానికి అయినా చెల్లిస్తేనే రైతుకు ఇన్సూరెన్స్‌ కరెక్టుగా అందుతుంది. 2018–19కి సంబంధించిన ఇన్సూరెన్స్‌ కేంద్రం తన వాటా చెల్లించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చెల్లించే ప్రీమియం రూ.126 కోట్లు గత ప్రభుత్వం కట్టలేదు. దీంతో రైతులకు ఇన్సూరెన్స్‌ అందని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మార్చుతూ.. రైతులకు జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉందని, సాయం అందించాలని ఇన్సూరెన్స్‌ కంపెనీలతో చర్చలు జరిపాం. రూ.126 కోట్లు చెల్లించాం.

ఆ పరిస్థితి మళ్లీ రాకూడదనే..
2018–19కి సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్ము 5.94 లక్షల మంది రైతులకు రూ.596 కోట్లు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వ హయాంలో రైతుల నష్టపోయినట్లుగా మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకువచ్చాం.  

ఒక్క రూపాయి కడితే చాలు..
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాపింగ్‌ చేయిస్తున్నాం. రైతు భరోసా కేంద్రంలో ఉన్న వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్, గ్రామ సచివాలయంలోని రెవెన్యూ అసిస్టెంట్‌ ముగ్గురు కలిసి రైతు వేసే పంటలకు ఈ–క్రాపింగ్‌ నమోదు చేస్తారు. ఈ –క్రాపింగ్‌ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేస్తారు. రైతు మీద భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్‌ కోసం రైతు కేవలం ఒక్క రూపాయి కడితే చాలు మిగిలిన భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 

ఆర్బీకేలు అన్ని విధాలుగా తోడుగా ఉంటాయి
పంట పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ–క్రాపింగ్‌ చేయించడం, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ జరిగించడం, పంట రుణాలను అందించడం, రైతులకు క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రైతుకు ఏ పంట వేయాలని సూచన చేయడమే కాకుండా, చివరకు పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఆర్బీకేలు, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 

దేవుడి దయ, మీ అందరి దీవెనలతో చేయగలిగాను..
రైతు మేలు జరిగే విధంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చామని సగర్వంగా మీ బిడ్డగా చెప్పగలుగుతున్నాను. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఈ పంట బీమా సొమ్ము కూడా బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా కలెక్టర్లు, అధికారులు బ్యాంకర్లతో మాట్లాడాలి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. 
 

Back to Top