అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా అనుకుంటున్నారు

నరసాపురం సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ.3,300 కోట్ల‌తో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాపనలు

టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు

దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చేశారు

ఎన్టీఆర్‌ కూడా బాబు గురించి ఇదేం ఖర్మరా బాబు అనుకుంటారేమో?

చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లోమీడియాను ఎవరూ నమ్మొద్దు

నరసాపురం: గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లోనూ మన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైయస్‌ఆర్‌సీపీనే గెలిపించారు. టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. అందుకే బాబు ఇదేం ఖర్మరా అనుకుంటున్నారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతి మాటలో భయం, నిరాశ, నిస్పృహ కనిపిస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ.3,300 కోట్ల‌తో పలు అభివృద్ధి పనులకు సోమవారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 

దేవుడి దయతో ఈ రోజు నరసాపురంలో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.  కార్తీక మాస పవిత్ర సోమవారం– రూ.3300 కోట్ల పనులకు శ్రీకారం...
దేవుడి దయతో నరసాపురంలో ఈరోజు మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. కార్తీకమాసం పవిత్రమైన చివరి సోమవారం నాడు... ఒకే రోజున రూ.3300 కోట్ల ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు ఇక్కడే, ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం. 

ఒకే రోజు ఇన్ని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అన్నది బహుశా నరసాపురం చరిత్రలోనే మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం పట్టణం, ఈ నియోజకవర్గం రూపురేఖలు అన్నీ మార్చేందుకు మన ప్రభుత్వం ఏయే పథకాలకు ప్రారంభోత్సవం, ఏయే పథకాలకు శంకుస్ధాపనలు చేస్తున్నామన్నది క్లుప్తంగా మీ అందరికీ తెలియజేస్తాను.

ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీష్‌ విశ్వవిద్యాలయం...
ఇది ఇక్కడ ప్రాంత ప్రజల రూపురేఖలు మార్చే కార్యక్రమం. ఈ  ప్రాంతంలో ఆక్వా కల్చర్‌ అన్నది ప్రధానమైనది. మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్, మెరైన్‌ ప్రొడక్షన్‌లో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌ స్ధానంలో ఉంది. అయినప్పటికీ ఆక్వాకల్చర్‌కు సంబంధించి ఇటువంటి స్కిల్స్‌.. ఇటువంటి పరిజ్ఞానం మన పిల్లలకు  అందుబాటులోకి వస్తే.. ఫిషరీస్‌కు సంబంధించిన ఈ స్కిల్స్‌ ద్వారా మన పిల్లలకు ఇంకా మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. మెరుగైన జీతాలు వస్తాయి. దేశంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా, ప్రపంచంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మన వాళ్లకు ఆ చదువులు అందుబాటులో ఉండే గొప్ప ప్రక్రియకు ఈ రోజు నాంది పలుకుతున్నాం. 
ఆక్వా కల్చర్‌ సుస్ధిర అభివృద్ధి కోసం ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా హోల్డర్లు, బ్యాచిలర్‌  ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ డిగ్రీ విద్యార్దులు, మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ (పీజీ డీగ్రీ హోల్డర్లు).. ఇలా ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు డిప్లొమో నుంచి పీహెచ్‌డీ వరకు విద్య కోసం మన ప్రభుత్వం నరసాపురంలో ప్రత్యేకంగా ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 

దేశంలో కూడా కేవలం రెండే యూనివర్సిటీలు ఉన్నాయి. ఒకటి తమిళనాడు, రెండోది కేరళలో ఉంది. మూడో యూనివర్సిటీ మన రాష్ట్రంలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి టెండర్లు పూర్తయి... ఇవాళతో పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

రూ.430 కోట్లతో బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్భర్‌.. 
రాష్ట్రంలో మత్స్యకార సోదరుల బాగుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా నరసాపురంలో ఉన్న 6 వేల మత్స్యకార కుటుంబాలకు మేలు చేసేలా.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్భర్‌కు కూడా శంకుస్ధాపన చేసాం. దీనికోసం రూ.430 కోట్లు వ్యయం చేయబోతున్నాం.

రూ.3,500 కోట్లతో 9 ఫిషింగ్‌ హార్భర్లు....
ఇవాళ రాష్ట్రంలో కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. మన మత్స్యకారులు ఎక్కడో గుజరాత్‌కో మరోచోటకో వెళ్లి అక్కడ బ్రతకాల్సిన అవసరం రాకుండా... మన రాష్ట్రంలోనే మత్స్యకారులందరూ తలెత్తుకుని జీవించాలని చెప్పి.. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా 9 ఫిషింగ్‌ హార్భర్లు మన రాష్ట్రంలో రానున్నాయి. వీటికోసం దాదాపుగా రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

640 మీటర్ల బెర్త్, 2400 మీటర్ల బ్రేక్‌ వాటర్‌ నిడివి ఉండే ఈ బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్భర్లో.... ఫ్లాట్‌ ఫాంలు, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్‌ యార్డులు, బోట్‌ పార్కింగ్‌ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి రూములు, కోల్డ్‌ స్టోరేజి వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

23,458 మంది గంగపుత్రులకు రూ.108 కోట్ల పరిహారం...
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇదే రోజున ముమ్మడివరంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇదే రోజున ఇక్కడ నుంచే బటన్‌ నొక్కి రూ.108 కోట్లు వాళ్లకు విడుదల చేశాం. 
కాకినాడ, కోనసీమ జిల్లాలలో ఓఎన్‌జీసీ కార్యక్రమాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు మంచి చేయాలని, వాళ్ల కోసం ఇంత ఆలోచన చేసి, ధ్యాసపెట్టి, ఇంత కచ్చితంగా వాళ్లకు రావాల్సిన పరిహారం ఇప్పించే కార్యక్రమం గతంలో ఏ రోజూ జరగలేదు. 
మత్స్య కారులకు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వం పట్టించుకుంటుందా, పట్టించుకోదో, ఎప్పుడు వస్తుందో, రాదో అని భయపడే పరిస్థితులు గతంలో ఉండేవి. 
అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు.  ఇప్పుడు ఇది మీ ప్రభుత్వం. మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాం. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీ,అగ్ర కులాల్లోని పేద వర్గాలు అందరూ కూడా జగనన్న ప్రభుత్వం అంటే అది మన ప్రభుత్వం.. మా ప్రభుత్వం అనుకునేలా ప్రతి అడుగు పడుతోంది. 

నరసాపురంలో వివిధ అభివృద్ధి పనులు...
నరసాపురానికి సంబంధించి ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఏ కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశామన్నది చూస్తే... అగ్రికల్చర్‌ కంపెనీ భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇవాళ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 
1921లో బ్రిటీష్‌ ప్రభుత్వం దర్బరేవులో 1754 ఎకరాల భూమిని నర్సాపురం అగ్రికల్చర్‌ కంపెనీకి 99  ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఆనాటి నుంచి 1623 మంది రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి మీద వారికి ఎలాంటి హక్కూ లేకపోవడం వల్ల వారికి అందాల్సిన ప్రయోజనాలు..అందని పరిస్థితి. ఆ రోజు ఎన్నికలప్పుడు నేను ఉన్నాను...నేను విన్నాను అని ఏదైతే చెప్పానో.... ఈ రోజు ఆ హామీని నెరవేర్చుతూ 1623 రైతులకు మంచి జరిగేలా... వారందరికీ రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వబోతున్నాం. 
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైతులు స్వాధీనంలో ఉన్న ఆ భూమిని మనందరి ప్రభుత్వం వారి పేరుమీదనే రిజిస్ట్రేషన్‌ చేసి, దస్తావేజు పత్రాలను కూడా వారికివ్వడం జరుగుతుంది.
ఇందుకోసం రైతన్నలు ఎకరాకి కేవలం వంద రూపాయలు ధర  చెల్లిస్తే చాలు.. ఈ 1623 మంది రైతన్నల కుటుంబాలకు వారి పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి వారికి అన్ని రకాల హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఇదే నరసాపురంలోనే ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ నిర్మాణం కోసం ఎప్పటినుంచో ఈ ప్రాంత  ప్రజలు అడుగుతున్నారు. వారి కోరిక తీరుస్తూ ఆ రెగ్యులేటర్‌ నిర్మాణానికి కూడా ఇవాళ శంకుస్ధాపన చేశాం.
సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి రాకుండా..మంచినీరు రైతులుకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడే విధంగా.. కొల్లేరులో 5వ కాంటూరు వరకు మంచినీరు నిలువ ఉండేలా ఉప్పటేరు నదిమీద మూలపర్రు సమీపంలో రూ.188 కోట్లతో రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి కమ్‌ లాక్‌ నిర్మాణానికి ఇవాళ శంకుస్ధాపన చేశాం.

అలాగే ఇదే నరసాపురంలో రూ.13 కోట్లతో ఏరియా ఆసుపత్రి కోసం కొత్త భవనం నిర్మించాం. దాన్ని ఇవాళ జాతికి అంకితం చేస్తూ ప్రారంభోత్సవం చేశాం. ఈ ఆసుపత్రిని 100 పడకల స్దాయికి పెంచడంతో పాటు మరో రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలను కూడా ఆసుపత్రికి అందించాం. ఆక్సిజన్‌ ప్లాంట్, జనరేటర్‌ వంటి సౌకర్యాలు ఆసుపత్రిలో ఇవాళఅందుబాటులోకి వచ్చాయి.

నరసాపురం పట్టణంలో మంచినీటి ఎద్దడి నివారణకు, ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్‌ ప్లాంట్, సర్వీసు రిజర్వాయరు, వాటర్‌ సఫ్లై పైపు లైను పనులకు ఇవాళ శంకుస్ధాపన చేశాం. రూ.62 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరాప్రాజెక్టు కోసం ఈ శంకుస్ధాపన చేశాం.

రూ. 4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్‌ మోడరనైజేషన్, కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం పూర్తి చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేశాం. అలాగే ఏనాడో బ్రిటిషర్ల కాలంలో నిర్మించిగా.. శిథిలావస్ధకు చేరిన ట్రెజరీ అకౌంట్‌ ఆఫీసు నూతన భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్ధాపన చేశాం. 

అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న నరసాపురం, పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు, ఆక్వారంగానికి మెరుగైన విద్యుత్‌ ఇవ్వడం కోసం ఇక్కడ 220/132/33 కేవీ రుస్తుంబాద విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి రూ.132 కోట్లు మంజూరు చేసి దానికి కూడా శంకుస్దాపన చేశాం. దీని నిర్మాణం పూర్తయితే నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి మండలాల్లో మరింత నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుంది.

తీరప్రాంత తాగునీటి ఎద్దడి నివారణకూ....
నా పాదయాత్రలో నేను చూశాను. ఈ జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి. తీరప్రాంతమంతా కూడా త్రాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి. గోదావరి పక్కనే ఉంటుంది. కానీ త్రాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉంది. బోర్లు వేస్తే ఉప్పునీరు. ఆక్వా కల్చర్‌ సాగుతో ఉపరితల నీరు కలుషితమవుతున్న పరిస్థితుల్లో... ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు తాగునీరు లేకపోతే ఎలా బ్రతకాలి అని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆక్వాకల్చర్‌తో తీరప్రాంతాల్లో ఉప్పునీటి సాంద్రత, తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యకు పరిష్కారంగా రూ.1400 కోట్ల వ్యయంతో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశాం.
విజ్జేశ్వరం జలాశయం నుంచి గోదావరి నీటిని రాపిడ్‌ శాండ్‌ పిల్టర్ల ద్వారా అక్కడే నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలైన పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని నిడదోవలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లి గూడెం శాససనభ నియోజకవర్గాల ప్రజలకు మరియు కృష్ణా జిల్లాలోని కృతివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాలో ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తంగా 26 మండలాల్లో 1178 గ్రామాలకు సంబంధించి దాదాపు 18.50 లక్షల మంది జనాభాకు మంచి జరిగించే కార్యక్రమం ఇది. 

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ..
నరసాపురంలో మరో ముఖ్యమైన కార్యక్రమం రూ.87 కోట్ల ఖర్చుతో ఫేజ్‌ –1 కింద అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశాం. మరో రూ. 26 కోట్లతో వశిష్ట వారధి–బుడ్డిగవాని రేవు ఏటిగట్టు పటిష్టం చేసే పనులకు ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నాం. 
రూ.7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టెయిల్‌ డ్యాం నిర్మాణం, సీసీ లైనింగ్‌ చేసే పనులు కూడా ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. మరో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో మొగల్తూరు పంట కాలువ నిర్మాణపనులను కూడా ప్రారంభిస్తున్నాం.
దీనివల్ల మొగల్తూరుతో పాటు పేరుపాలెం పరిధిలో 2245 ఎకరాల బంజరు భూమికి సాగునీటి సరఫరాతో పాటు ఆ పరి«ధిలోని గ్రామాల తాగునీటి సరఫరాకు ఈ పనులు చేపడుతున్నాం.
చివరిగా కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం, మడుగుతూము ఈ నాలుగు స్లూయిస్‌లకు కాలం చెల్లిపోయిన నేపధ్యంలో...వీటి పునర్నిర్మాణం కోసం మరో రూ.9 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్ధాపన చేశాం. 
ఒక్క నరసాపురం గురించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పడానికి... నాకే ఇంత సేపు పట్టిందంటే  ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 
ఇక్కడ నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అడుగులు వేగంగా పడుతున్నాయి. కోర్టుల్లో వేసిన కేసులను పూర్తిగా పరిష్కరించాం. కేంద్రాన్ని ఒప్పించాం. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి జనవరిలో టెండర్లు పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
 
ఇంటింటికీ అభివృద్ధి...
ఇంటి ఇంటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ, నిరుపేద ఓసీల అభివృద్ధికి కట్టుబడిన మన ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.
ఒక్క బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలో ఎటువంటి లంచాలు, వివక్షకు తావులేకుండా కేవలం డీబీటీ ద్వారా ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలోనే రూ.1,76,516 కోట్ల రూపాయలు జమ చేశాం. 

ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం...
ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో గ్రామాలు మొదలుకుని రైతులకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం.
మేనిఫెస్టోలో చెప్పినదాన్ని ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా అందులో చెప్పిన 98 శాతం పనులను ప్రభుత్వం పూర్తి చేసింది, చేస్తా ఉంది. 
మేనిఫెస్టోలో చెప్పని అనేక పనులను కూడా ఈరోజు చేస్తున్నాం.  వైద్య, ఆరోగ్యపరంగా, ఇళ్ల స్ధలాలు విషయంలోనూ, ఇళ్ల నిర్మాణంలోనూ, విద్య, వ్యవసాయపరంగానూ, సామాజిక న్యాయం పరంగా, మహిళా సాధికారిత పరంగా, పారదర్శక పాలన, వికేంద్రీకరణ ఇలా ఏరంగంలో చూసినా, గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా, గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయ వలన ఈవర్గాలన్నింటికీ అండగా, తోడుగా మీ బిడ్డ నిలబడగలిగాడు.

కానీ....
తన పాలనలో(బాబు పాలనలో) కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని బాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి మేమిది చేశామని చెప్పుకోలేక, తాము చెప్పుకోదగినది ఏదీ చేయలేదని తెలుసు కనుక.. తమ నోటికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పని చెప్తున్నారు.

టీడీపీ– తెలుగు బూతులు పార్టీ...
టీడీపీ అంటే తెలుగు బూతులు పార్టీగా మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీసేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మరా బాబూ అనుకోబట్టే... 2019లో దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని అన్ని చోట్లా ఓడగొట్టి బైబై చెప్పారు. మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు ఓటు వేసి, జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ, ప్రతి ఒక్క స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్ధతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు. 
చివరికి కుప్పంలో కూడా మున్సిపల్‌ ఎన్నికలు తీసుకున్నా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌ ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బై బై బాబూ అని చెప్పారు.

ఇదేం ఖర్మరా బాబూ.... 
అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబూ అని తన తలపట్టుకుని తాను కూర్చుంటే... ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు కూడా.. ఈ బాబూతో ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్‌ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, పార్టీలో, కేబినెట్‌లో స్ధానమిచ్చినందుకు తాను కూడా ఇదేం ఖర్మరా బాబూ అని తానూ అనుకునే ఉంటారు. 

ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండటం ఇదేం ఖర్మరాబాబూ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అనుకుంటున్నారు. 

ప్రజలనూ బెదిరిస్తున్న బాబు...
ఈ మధ్య కాలంలోనే చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ.. తాను రాజకీయాలలో ఉండాలంటే.. అసెంబ్లీకి తాను వెళ్లాలంటే.. వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపిస్తే సరేసరి, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని బాబు ప్రజలను బెదిరిస్తున్నాడు.

బాబు– అధికార భగ్న ప్రేమికుడు... 
చివరికి... తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహ తన ప్రతి మాటలోనూ కనిపిస్తోంది. తాను చేసే ప్రతి చేష్టలోనూ ఇదే కనిపిస్తోంది. అప్పుడప్పుడూ చంద్రబాబునాయుడు లాంటి ఇలాంటి మనుషులను చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్న తీరుని చూసినప్పుడు... కొంత మంది కనిపిస్తూ ఉంటారు.
సెల్‌ఫోన్‌ టవర్‌ మీద నుంచి దూకేస్తామంటారు. రైలు కింద తలపెట్టేస్తామంటారు. పురుగుల మందు తాగేస్తామంటారు. ఇదే టైప్‌లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు.

ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ మంచీ చేయని తనకూ, ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ, ఎందుకు ఓటు వేయాలన్నది కానీ... ఈ బాబు, ఈ దత్తపుత్రుడు చెప్పరు. ఎందుంటే చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి. 
ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్ధానం ఉండదు.
కానీ ఇలాంటి రాజకీయనాయకులు రాజకీయాలు ఎలా చేస్తారంటే... కేవలం వాళ్లకు సంబంధించిన నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు. ఒక ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇలాంటి వాళ్లందరితోనూ దోచుకో, పంచుకో, తినుకో అనే ఒక ఒప్పందం చేసుకుంటారు. 
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, అలా దోచుకున్నది వీళ్లందరితోనూ పంచుకుని తినడం.. చేస్తాడు కాబట్టే వీళ్లందరూ కూడా ఆ పెద్దమనిషి చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. 
చివరకు ప్రశ్నిస్తానని చెప్పే కొందరు...ప్రశ్నించను కూడా ప్రశ్నించరు.
ఇలాంటి వాళ్లందరినీ చూసినప్పుడే ఇదేం ఖర్మరా బాబూ ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయనిపిస్తుంది.

ఒక్కటే కొలమానం....
 కానీ మీ అందరికీ ఒక్కటైతే నేను చెబుతున్నాను. 
ఒకే ఒక్కటి కొలమానంగా తీసుకొండి. మీ ప్రతి కుటుంబంలోనూ, మీ ప్రతి ఇంటిలోనూ మంచి జరిగిందా ?లేదా ?అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి.
మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా నిలబడండి. మీ తమ్ముడికి అండగా నిలబడండి. మీ బిడ్డకు తోడుగా నిలబడండి. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. దత్తపుత్రుడు, బాబునూ నమ్మొద్దండి...
ఈనాడుని నమ్మొద్దండి, ఆంధ్రజ్యోతిని నమ్మొద్దండి, టీవీ5ని, ఈ దత్తపుత్రుడిని, చంద్రబాబునాయుడిని నమ్మొద్దండి. 

మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకొండి. ఇది ఒక్కటే నేను మీ అందరితో వేడుకుంటున్నాను.
 
దేవుడి దయతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని, ఇంకా మీ అందరికీ మంచి జరగాలని, దేవుడి చల్లని దీవెనలు, ప్రజలందరి చల్లని ఆశీస్సులు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top