ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపించుకుందాం

మొట్ట‌మొద‌టి గిరిజన మహిళా అభ్య‌ర్థికి వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మ‌ద్ద‌తు

వైయస్‌ఆర్‌ సీపీ నిర్ణయాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బలపర్చాలి

సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదటి ప్రభుత్వం మనది

ఏ ఒక్క ఓటు మిస్‌ అవ్వకుండా ఓటింగ్‌కు ముందే మాక్‌పోలింగ్‌

ఎంపీల వైపు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేల వైపు మంత్రులు, విప్‌లు బాధ్యత తీసుకోవాలి

వైయస్‌ఆర్‌ సీపీ నుంచి ఒక్క ఓటు కూడా మిస్‌ కాకూడదు

వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గుంటూరు: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొదటి ప్రభుత్వం మనదేనని, అందులో భాగంగా మరో అడుగు ముందుకువేస్తూ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌ హాల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ పార్టీ ప్రజాప్రతినిధులను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి పరిచయం చేశారు. 

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు,  ఎంపీలు అందరూ పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. ఈనెల 18 తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఓటు వేయడానికి తీసుకువచ్చే బాధ్యత విప్‌లు తీసుకోవాలన్నారు. 18వ తేదీన ఉదయం మాక్‌ పోలింగ్‌ చేసిన తరువాత ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. 

చిన్న చిన్న తప్పులు, పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోతుందని, కాబట్టి కరెక్ట్‌గా, ఏ పద్ధతిలో ఓటు వేయాలనే అంశంపై అసెంబ్లీలోని మన పార్టీ కార్యాలయంలో మాక్‌పోలింగ్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తరువాత ఓటింగ్‌కు వెళ్లాలని సూచించారు. ప్రతి ఓటు కౌంట్‌ అవుతుంది కాబట్టి.. ఎంపీల వైపు నుంచి విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నారు. అదే విధంగా మంత్రులంతా వారి వారి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కౌంటింగ్‌లో పాల్గొనేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఏ ఒక్కరు మిస్‌ అయినా ఓటు తగ్గించినవారం అవుతాం. గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడినందుకు మనవైపు నుంచి ఏ ఒక్క పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. 
 

Back to Top