మూడేళ్ల‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ పూర్తి చేస్తాం

- రాయ‌ల‌సీమ బిడ్డ‌గా ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్య‌త‌

- నీరు, ఉద్యోగాలు, ప‌రిశ్ర‌మ‌ల‌తో రాయ‌ల‌సీమ ముఖచిత్రాన్ని మార్చేస్తా

- ఎవ‌రు స‌హ‌క‌రించినా స‌హ‌క‌రించ‌క‌పోయినా ఉక్కు ప‌రిశ్ర‌మ ఆగ‌దు 

- క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఏపీహెచ్ ఎస్ ఎల్ ప‌రిశ్ర‌మ‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

 

క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తున్నఈ రోజును నా జీవితంలో మ‌రిచిపోలేను.  క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాపించాల‌నేది ఎన్నో ఏళ్ల నాటి క‌ల‌. దివంగ‌త నేత వైఎస్సార్ చ‌ల‌వ‌తో ముంద‌డుగు ప‌డింది. కానీ గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా కేవ‌లం శంకుస్థాప‌న ద‌గ్గ‌రే ఆగిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే ప్ర‌త్యేక హోదాతోపాటు ఇక్క‌డ ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌న్న అవ‌స‌రాన్ని గుర్తించ‌డం జ‌రిగింది. కానీ గ‌త ప్ర‌భుత్వం అయిదేళ్లూ కాల‌క్షేపం చేసి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ రాయ‌ల‌సీమ ప్రాంతానికి ప్ర‌త్యేకించి క‌డ‌ప ప్రాంతానికి న్యాయం జ‌రిగే రోజులొచ్చాయి. 

చిత్త‌శుద్ధి, మోసం మ‌ధ్య తేడా గమ‌నించాలి
ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు చంద్ర‌బాబు ఉక్కు ప‌రిశ్ర‌మ పేరుతో టెంకాయ కొట్టారు. నిర్మాణాన్ని మాత్రం గాలికొదిలేశారు. మీ బిడ్డ అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే ప‌రిశ్ర‌మ ప్రారంభోత్స‌వానికి టెంకాయ కొడితే చిత్త‌శుద్ధి అంటారు. ఈ రెండింటికీ ప్ర‌జ‌లు తేడా గ‌మ‌నించాలి. 1960లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉక్కు ప‌రిశ్ర‌మ రావాలని ముగ్గురు విద్యార్థులు, ఆరుగురు ఉద్యోగులు బ‌ల‌య్యారు. ఇప్పుడు మ‌న‌కి అలాంటి ప‌రిస్థితులు రాన‌వ‌స‌రం లేదు. రాయ‌ల‌సీమ‌కు ఏది అవ‌స‌ర‌మో చేయ‌డానికి మీ బిడ్డ‌గా నేనున్నాను. రాష్ట్రంలో వెనుక‌బ‌డి ఉన్న రాయ‌ల‌సీమ ముఖచిత్రం మారాలంటే నీరు, ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగాలు కావాలి. అదే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నా. క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మతోపాటు అనుబంధంగా ఇత‌ర చిన్న ప‌రిశ్ర‌మ‌లొస్తాయి. అనంత‌పురంలో కియా కార్ల ప‌రిశ్ర‌మ ఉంది. 

మ‌న బాధ్య‌త కాకపోయినా..

ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న అనేది నిజానికి రాష్ట్రానికి సంబంధించిన బాధ్య‌త కాదు. ఇలాంటి భారీ ప‌రిశ్ర‌మ‌ల నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప‌ని. కానీ విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీ అయిదేళ్లుగా నెర‌వేర‌లేదు. అన్నిరంగాల్లో వెనుక‌బ‌డి ఉన్న రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాయ‌లసీమ బిడ్డ‌గా నాపై ఉన్న‌ది. ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై ఒక‌వైపు చ‌ర్చ‌లు జరుగుతున్నా.. ప‌నులు ప్రారంభిస్తున్నాం. ఏం జ‌రిగినా..  ఎవ‌రు క‌లిసొచ్చినా.. రాక‌పోయినా అనుకున్న స‌మ‌యానికి ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతాం. దేవుడు ఆశీర్వాదాలు, ప్ర‌జ‌లంద‌రి అండ‌దండ‌ల‌తో రాయ‌ల‌సీమ‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్తాం. 

మూడేళ్ల‌లో పూర్తి చేసి తీరుతాం
ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రారంభించిన నేటి నుంచి మూడేళ్ల‌లో పూర్తి చేసి తీరాల‌ని ఉక్కు సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నాం. 2018 నాటికి దేశంలో ఉక్కు ఉత్ప‌త్తి  1.6 కోట్ల ట‌న్నులు. కాగా నేష‌న‌ల్ పాల‌సీ ఆన్ స్టీల్ లెక్క‌ల ప్ర‌కారం 2030 నాటికి దేశ అవ‌స‌రాలు తీరాలంటే క‌నీసం 3 కోట్ల టన్నులు అవ‌స‌రం అని లెక్క‌లు క‌ట్టారు. దేశ అవ‌స‌రాల కోసం కేవ‌లం క‌డ‌ప నుంచే 30 ల‌క్ష‌ల ట‌న్నులు ఉత్ప‌త్తి చేయ‌బోతున్నాం. ఏటా 30 ల‌క్ష‌ల ట‌న్నుల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంతో 15వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతోంది. ఈ ఉక్కు ప‌రిశ్ర‌మ ద్వారా 25 వేల మందికి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించ‌బోతున్నాం. ముడి స‌రుకు పంపిణీకి ఎన్ ఎండీసీతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా.

Back to Top