కష్టాలన్నీ తీర్చేందుకు మీ బిడ్డగా నేనున్నా..

రాయచోటి అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

వివాదంలో ఉన్న 4 ఎకరాల స్థలాన్ని వక్ఫ్‌బోర్డుకు కేటాయిస్తాం

ప్రాజెక్టులు నిండాలి.. రైతు సుభిక్షంగా ఉండాలన్నదే లక్ష్యం 

బొల్లేపల్లి, మడకశిరకు గోదావరి నీళ్లు తెచ్చేందుకు రూ.60 వేల కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన

గండికోట దిగువన రూ.23 వేల కోట్లతో మరో రిజర్వాయర్‌ తెస్తా

ప్రాజెక్టులు, కాల్వల సామర్థ్యాన్ని పెంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా 

రాయచోటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: పాదయాత్రలో ప్రజలు పడిన బాధలు విన్నాను.. మీ కష్టాలను కళ్లారా చూశాను.. మీ అందరికీ నేనున్నానని మాటిచ్చాను.. ఇచ్చిన మాట మేరకు మీ కష్టాలను తీర్చడానికి మీ బిడ్డగా నేనున్నానని, అందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అడక్కపోయినా అభివృద్ధి చేస్తానని, ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. రాయచోటి అభివృద్ధికి అక్షరాల రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులు నిండాలి.. రైతు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. సీఎం ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 

రాయచోటి నియోజకవర్గం గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. తాగునీరు, సాగునీరు కోసం అల్లాడుతున్న నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంది. రాయలసీమే వెనుకబడిన ప్రాంతం అయితే ఆ వెనుకబడిన రాయలసీమలో అత్యంత వెనుకబాటుకు గురైన ప్రాంతం రాయచోటి అని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రజలకు మాత్రం.. ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు నాన్నగారిని అత్యంతం ప్రేమించే ప్రాంతం ఇదే రాయచోటి అని గర్వంగా చెబుతున్నాను. నాన్నను ప్రేమించారు. మీ బిడ్డగా నన్ను దీవించారు. ఎల్లప్పుడూ మీ ఆప్యాయతలకు రుణపడి ఉంటాను. నాన్న గారి హయాంలో ఈ ప్రాంతంలో తాగడానికి నీరు లేని దుస్థితిని చూసి వెళగల్లు రిజర్వాయర్‌ కట్టారు. రాయచోటిలో ఇవాళ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉందంటే.. అది కట్టించిన వ్యక్తి దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారే.. ఆయన చనిపోయిన తరువాత కథ మొదటికి వచ్చింది. రాయచోటి గురించి పట్టించుకోవాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఒక్కరూ కనిపించని పరిస్థితి పదేళ్లలో చూశాం. 

రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం మున్సిపల్‌ చైర్మన్‌ గత ప్రభుత్వాన్ని డబ్బు అడిగితే నువ్వు పార్టీ జెండా మార్చితే రూ. 3 కోట్లు ఇస్తామని చెప్పిన పరిస్థితులు చెబుతున్నాడు. ఆ రోజు రూ.3 కోట్లు ఇస్తామన్నారు.. ఈ రోజు అడగకపోయినా ఆరు నెలలు కూడా తిరగక మునుపే ఇదే నియోజకవర్గ అభివృద్ధికి అక్షరాల రూ. 2 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వ హయాంలో గొంతు తడుపుకోవడానికి, మామిడి తోటలు కాపాడుకోవడానికి నాన్నా అగచాట్లు పడ్డాం. కానీ మీ అందరి ఆశీర్వాదం, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మీరు పడిన బాధలు నేను చూశాను. మీ కష్టాన్ని నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. మీ అందరికీ మాట ఇస్తున్నాను.. నేను ఉన్నానని మాట ఇచ్చానని మీ అందరికీ గుర్తు చేస్తున్నా.. ఇచ్చిన మాట మేరకు మీ కష్టాలను తీర్చడానికి మీ బిడ్డ చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. జీఎన్‌ఎస్‌ఎస్‌ గాలేరు నగరి సృజల స్రవంతి 56వ కిలోమీటర్‌ వద్ద వేంపల్లి మండలం పాములూరులో 2 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేసి కాలేటి వాగు రిజర్వాయర్‌కు తీసుకెళ్తున్నాం. ఆ కాలేటి వాగు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పాయింట్‌ 22 టీఎంసీ నుంచి 1.2 టీఎంసీలకు పెంచబోతున్నాం. ఆ కాలేటి వాగు రిజర్వాయర్‌ నుంచి రెండు బ్రాంచ్‌ కాల్వల ద్వారా నీటిని ఒక పాయలో 450 క్యూసెక్కులతో చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలకు వెళ్తుంది. రెండో పాయ ద్వారా 1550 క్యూసెక్కుల నీరు ఎన్‌పీకుంట, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 473 కిలోమీటర్‌ దగ్గర కలుపుతాం. ఆ నీటిని 485 కిలోమీటర్‌ వద్ద వెళగల్లు రిజర్వాయర్‌కు ఇస్తాం. ఆ తరువాత హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి రాయచోటిలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు నీరు తీసుకెళ్తాం. ఆ తరువాత నీటిని చిత్తూరు జిల్లాలోని అడవిపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలకు అందిస్తాం. దీని వల్ల రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలకు మేలు జరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 

జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హంద్రీనీవా కాల్వలు కలపడడం వల్ల హంద్రీనీవా నుంచి తీసుకుపోవాల్సిన నీరు ఆ మేరకు తగ్గుతాయి కాబట్టి చిత్తూరు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. కారణం సగం లోడు హంద్రీనీవా మీద తగ్గుంది కాబట్టి.. అక్షరాల ఈ ప్రాజెక్టు కోసం రూ. 1272 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇదే వెళగల్లు రిజర్వాయర్‌కు ఇన్ని వరదలు, ఇన్ని నీళ్లున్నా కూడా వెళగల్లుకు నీరు రాని పరిస్థితి మన కళ్ల ఎదుటే కనిపిస్తుంది. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చాలని ఖర్చు చేస్తున్నాం. 

వెళగల్లు రిజర్వాయర్‌ ద్వారా పాయింట్‌ 4 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఒక లిఫ్ట్‌ నిర్మిస్తున్నాం. దీని ద్వారా గాలివీడు, రాయచోటి మండలాల్లో చెరువులను నింపుతాం. దీని కోసం అక్షరాల రూ.86.05 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియచేస్తున్నాను. 

సంబేపల్లి మండలంలో చెరువుముందరపల్లిలో పెద్ద చెరువుకు జరికోన నుంచి నీటిని ఎత్తిపోయడానికి అక్షరాల రూ.40 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నాను. ఇదే జరికోన ప్రాజెక్టు కోసం గతంలో పాదయాత్రలు చేసినా పట్టించుకోని పరిస్థితి రాయచోటిలో చూశాం. రాయచోటి పట్టణ అభివృద్ధి కోసం, తాగునీటి పైపులైన్‌ వ్యవస్థ కోసం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం అక్షరాల రూ. 340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నా.. గతంలో చంద్రబాబు మన మున్సిపల్‌ చైర్మన్‌ను లాక్కోవడానికి నువ్వు వచ్చేసేయ్‌ రూ.3 కోట్లు ఇస్తానని ∙ఆఫర్‌ ఇచ్చాడు. కానీ, ఈ రోజు అడక్కపోయినా ఇదే రాయచోటికి తాగునీటి పైపులైన్, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి కోసం రూ.340 కోట్లు మీ బిడ్డ ఇవ్వబోతున్నాడు. 

ఇదే రాయచోటి పట్టణంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఉంది. 50 పడకల ఆస్పత్రిని అడక్కపోయినా కూడా 100 పడకల ఆస్పత్రిని చేయబోతున్నాం. దీని కోసం అక్షరాల రూ.23 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల కోసం రూ. 11.55 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. నియోజకవర్గంలో సీసీ రోడ్ల కోసం రూ.15.52 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో మురుగు కాల్వలు ఓపెన్‌గా లేకుండా వాటిని సిమెంట్‌ పలకలతో మూసివేసే కార్యక్రమానికి అక్షరాల రూ.31 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. 

ఇది కాకుండా ఇదే రాయచోటికి సంబంధించి జిల్లాలో పోలీస్‌ కార్యాలయం నిర్మించేందుకు రూ. 20 కోట్లతో శంకుస్థాపన జరిగింది. రాయచోటిలో డీఎస్పీ ఆఫీస్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేశా. మైనార్టీ వెల్ఫేర్‌కు సంబంధించి రాయచోటిలో రెండు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నామని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఇదే నియోజకవర్గంలో ఎన్నికల వేళ ఒక మాట ఇచ్చాను.. ఆ మాటను నెరవేరుస్తూ.. వక్ఫ్‌బోర్డు, ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్ల మధ్య వివాదంలో ఉన్న నాలుగు ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్‌బోర్డుకు ఇవ్వడం జరుగుతుంది. రేపటి కల్లా ఆ కార్యక్రమం పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నానను. ఇదే రాయచోటిలో పక్కన జూనియర్‌ కాలేజీ, హైస్కూల్‌ రెండూ కలిపి వాడుకుంటున్న హైస్కూల్‌ గ్రౌండ్‌ కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. అతి ఆధునిక ప్లే గ్రౌండ్‌గా మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నాను. 

ఇదే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది శ్రీశైలంలో వరదలు వచ్చాయి. 8 సార్లు గేట్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దాదాపు 8 వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఇన్ని రోజులు కృష్ణానది నిండుగా ప్రవహించినా సరే.. రాయలసీమలోని ప్రాజెక్టులు నిండని పరిస్థితి కనిపిస్తుంది. గండికోట పూర్తి సామర్థ్యం 27టీఎంసీలు అయితే.. ఇంతగా వర్షాలుపడినా నింపగలిగింది కేవలం 12 టీఎంసీలు మాత్రమే. చిత్రావతి కెపాసిటి 10 టీఎంసీలు అయితే కేవలం 6 టీఎంసీలు నింపగలిగాం. బ్రహ్మంసాగర్‌ 17.3 టీఎంసీల కెపాసిటి నింపగలిగింది కేవలం 8 టీఎంసీలు మాత్రమే నింపగలిగే అధ్వాన్నమైన పరిస్థితి. æఇలా రిజర్వాయర్లు ఉన్నా.. నింపుకోలేని పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఇవాళ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టుల పరిస్థితి. కాల్వలు సరిగ్గా లేకపోవడం, కెనాల్స్, కాల్వల్లో నీరు తీసుకుపోయే కెపాసిటి లేకపోవడం, ఆర్‌ అండ్‌ ఆర్‌ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు నీరు ఉన్నా డ్యాములు నింపుకోలేని పరిస్థితుల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కనిపిస్తున్నాయి. ఇదే ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద తరలించాలంటే.. మన ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు అయ్యింది. తరలించాలంటే సర్వేలు జరగాలి, ఎస్టిమేట్స్‌ తయారు కావాలి, హౌస్‌ సైట్స్‌ అలాట్‌మెంట్‌ జరగాలి ఇవన్నీ జరగాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు పడుతుంది. ఈ పనులు గతంలో చేసి ఉంటే ఈపాటికి రాయలసీమలోని ప్రాజెక్టులకు కొంతైనా డబ్బులు కేటాయిస్తే ఈపాటికి నిండుకుండల్లా రాయలసీమలోని ప్రాజెక్టులు కనిపించేవి. ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి ఆ కాల్వల సామర్థ్యం పెంచి ఉంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టుల దిశ, దిశా రెండూ మారిపోయి కనిపించేవి.. అలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చబోతున్నాం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కృష్ణానది వరద వచ్చేది 40 నుంచి 50 రోజులకు మించని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆ 40–50 రోజుల్లో ఆ వరద వచ్చినప్పుడు రాయలసీమలోని ప్రతి డ్యామ్‌ నిండాలి.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రతి ప్రాజెక్టు నిండాలని ఆలోచన చేశాం. దీనికి ముందడుగులు వేస్తూ.. వరద జలాలు వచ్చే రోజుల్లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తున్నాం. తెలుగుగంగ 11500 క్యూసెక్కుల నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. కేసీ కెనాల్‌ నిప్పుల వాగు ప్రస్తుతం ఉన్న 12500 క్యూసెక్కుల నుంచి 35 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. హెచ్‌ఆర్‌బీసీ, గాలేరు నగరి సృజల స్రవంతి 21,700 క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నామని సగర్వంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. హంద్రీనీవా కెపాసిటీ 2200 క్యూసెక్కులు నీరు కూడా పోని పరిస్థితి.. దాన్ని అక్షరాల 6 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. అవుకు నుంచి గండికోటకు 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంబోతున్నామని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. గండికోట నుంచి వెళ్లే కాల్వల సామర్థ్యాన్ని 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. గండికోట నుంచి చిత్రావతికి పంపే నీరు 2 నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు వెళ్లే నీరు వెయ్యి నుంచి 15 వందల క్యూసెక్కుల మధ్యలో పెంచబోతున్నాం. మధ్యలో గండికోట దిగువన మరో 20 టీఎంసీల రిజర్వాయర్‌ ప్రతిపాదన తయారు చేయాలని చెప్పడం జరిగింది. ఈ పనులన్నింటి కోసం అక్షరాల రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఒక్కటే చెప్పాను.. ప్రాజెక్టులు నిండాలి.. రైతుల కోసం ఎంత చేసినా తక్కువే.. యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయండి అని ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైతే మంచి మనస్సు ఉంటుందో.. అక్కడ దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఉంటాయి. మీ అందరి దీవెనలు, దేవుడి దయతో ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. 

రాయలసీమకు నీరు రాని పరిస్థితి చూస్తున్నాం. శ్రీశైలంకు నీరు వచ్చే పరిస్థితి ఏదైతో ఉంటుందో.. 47 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులు తిరగేస్తే.. శ్రీశైలంకు నీరు వచ్చే కృష్ణానది ఎంతంటే.. కేవలం 12 వందల టీఎంసీలు మాత్రమే. అదే రికార్డు 10 సంవత్సరాలకే లెక్కగడితే 12 వందల నుంచి 6 వందల టీఎంసీలకు పడిపోయింది. అదే సీడబ్ల్యూసీ రికార్డులు కృష్ణానది నీరు శ్రీశైలంకు ఎన్ని వస్తున్నాయని ఐదు సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు తిరగేస్తే.. 6 వందలు కూడా 4 వందలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మరో వైపు గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిని రాయలసీమకు తీసుకువచ్చే కార్యక్రమం, మధ్యలో బొల్లేపల్లి ప్రాజెక్టును తీసుకువచ్చి గుంటూరును సస్యశ్యామలం చేసే కార్యక్రమం చేస్తున్నాం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకు కరువు ఎప్పుడూ రాకుండా చేయడం కోసం గోదావరి నీళ్లను బొల్లేపల్లి నుంచి బనకచర్లకు తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.. ఇందుకు అక్షరాల రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు. దాని కోసం ప్రణాళికలు తయారు చేసి అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడుతున్నాడు మీ బిడ్డ. మీ అందరినీ కోరేది ఒక్కటే.. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి మీ బిడ్డ నడుం బిగించాడు. మీ బిడ్డకు మీ దీవెనలు కావాలి.. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇవన్నీ గొప్పగా చేసి మళ్లీ మీ దగ్గరకు వచ్చి అమ్మా ఇవన్నీ చేశాను.. ఇక మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఎల్లప్పుడూ నాపై ఉంచండి అని అడిగే పరిస్థితి దేవుడు నాకు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top