ప్రతినెలా తనిఖీలు చేపట్టాలి

అనుమతులు ఇచ్చి చేతులు దులిపేస్తే కుదరదు

కంట్రోల్‌ రూమ్‌ ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు

అధికారుల తీరుపై సీఎం వైయస్‌ జగన్‌ సీరియస్‌

లాంచీ ప్రమాదంపై రాజమండ్రి సబ్‌కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష

దేవీపట్నం: లాంచీ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. గల్లంతైన వారి వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సమయంలో వారు చెబుతున్న మాటలు విని చాలా బాధ కలిగిందన్నారు. లాంచీ ప్రమాదంపై రాజమండ్రి సబ్‌ కలెక్డర్‌ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఎంత మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి సహాయ బందాలను రప్పించాలా అని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

లాంచీలకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్‌ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. బోట్ల పరిస్థితి ఏంటీ..? ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారా అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్‌ రూమ్స్‌ ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు. వారం రోజుల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటులో పోలీసు, ఇరిగేషన్, టూరిజం విభాగాలను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశించారు. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్‌ అధికారులు గుర్తించాలని సూచించారు. ప్రతి నెలా ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక బోట్ల స్థితిగతులపై సమీక్ష జరపాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని లాంచీల అనుమతులు రద్దు చేశారు. ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయిన తరువాతే అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top