నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

జీవనోపాధి శిక్షణ సెంటర్లు, ఉపాధి మార్గాలు ఏర్పాటు చేస్తాం

రాష్ట్ర ప్రభుత్వ తరఫున కూడా నిర్వాసితులకు అదనపు సహాయం

తాడువాయిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీవాసులతో సీఎం వైయస్‌ జగన్‌

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా వారి జీవనోపాధి శిక్షణ, ఉపాధికి సంబంధించిన మార్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాడువాయిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీవాసులతో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. తాడువాయిలో దాదాపు 3,905 ఇళ్ల నిర్మాణం చకచకా జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. నిర్వాసితులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటానన్నారు. జీవనోపాధి శిక్షణ, ఉపాధికి సంబంధించి ఏదైనా అవకాశాలు చూడాలని వినతులు వస్తున్నాయన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి షెకావత్‌తో ప్రస్తావించానని, వారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా జీవనోపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఉపాధి మార్గాలు చూపిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. నిర్వాసితులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.  

కేంద్రం అందించే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తరఫున కూడా నిర్వాసితులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చానని, ఆ హామీని కచ్చితంగా నెరవేరుస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6.80లక్షలను రూ.10 లక్షలు చేస్తామన్న మాట బాగా గుర్తిందన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో రూ.1.5 లక్షలకే భూములు ఇచ్చిన రైతులకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పానని, మిగిలిన రూ.3.5 లక్షలు కూడా త్వరలో ఇస్తామన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తామన్నారు. మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top