తాడేపల్లి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. టూరిజం అంటే ఏపీ వైపే చూడాలని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు రూపొందించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని సూచించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్తాయి పెరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతుందని సీఎం చెప్పారు. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక్కో ప్రాజెక్టుపై కనీసంగా రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు, దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1564 గదులు అందుబాటులోకి వస్తాయి. రానున్న ఐదేళ్లలో వీటిని పూర్తి చేస్తామని కంపెనీలు పేర్కొన్నాయి. – విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్ ఆధ్వర్యంలో రిసార్టులు – ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు – విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ – తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్ – విశాఖపట్నంలో టన్నెల్ ఆక్వేరియం, స్కైటవర్ నిర్మాణం – విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్ ఏర్పాటు – అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, జీఏడీ స్పెషల్ సీఎస్ కె ప్రవీణ్ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మీ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.