స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్కిల్‌డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించనున్న 30 స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీల భవనాల నమూనాలను అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు చూపించారు. 

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలుండాలని,  సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు పరిగణలోకి తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. కాలేజీల నిర్మాణం పూర్తయిన తరువాత ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలని ఆదేశించారు. 

30 స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీల్లో 20 రంగాలకు చెందిన అంశాలపై నైపుణ్యాభివృద్ధి, 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక, భారీ, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్‌ మహేంద్రా, హెచ్‌సీఎల్, హ్యూందాయ్, వోల్వో, బాష్‌ కంపెనీల భాగస్వామ్యం చేయనున్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో శిక్షణ, 30 కాలేజీల నిర్మాణానికి రూ.1210 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 
 

Back to Top