షెడ్యూల్‌ ప్రకారం ‘నాడు–నేడు’ పనులు పూర్తికావాలి

ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం

జగనన్న విద్యాకానుక, ‘నాడు–నేడు’ రెండో విడత ఆగస్టులోనే..

నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలి

ఒక్క స్కూల్‌ మూసివేయకూడదు, ఒక్క టీచర్‌ను తొలగించకూడదు

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

నాడు–నేడు, జగనన్న విద్యా కానుకపై సీఎం సమీక్ష

తాడేపల్లి: నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడి మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా నూతన విద్యావిధానం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నూతన విద్యావిధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. సబ్జెక్టుమీద గట్టిపట్టు ఉన్న ఉపాధ్యాయుల సేవలను సమర్థవంతగా వినియోగించుకోవాలని, వీరి సేవలను మంచి చదువులకోసం వాడుకోవాలన్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఒక్క స్కూలునూ మూసేయకూడదు, ఒక్క టీచర్‌నూ తొలగించకూడదన్నారు. ప్రతి స్కూలు కూడా నడవాలన్నారు.

విద్యాశాఖలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుకలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. నాడు–నేడు షెడ్యూలు ప్రకారం పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. నిధుల విడుదల దగ్గర నుంచి పనుల వరకూ కూడా నిర్ణీత సమయంలోగా అన్నీ జరగాలన్నారు. దీనివల్ల ఫలితాలు త్వరగా పిల్లలకు అందుతాయని చెప్పారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనల ప్రకారం అంగన్‌వాడీ సెంటర్లను మ్యాపింగ్‌ చేసిన అధికారులు.. వాటి వివరాలను సీఎంకు వివరించారు. 

నూతన విద్యావిధానం కోసం కొత్త తరగతి గదుల నిర్మాణం వల్ల రెండోదశ నాడు – నేడుకు ఎలాంటి భంగంరాకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నాడు – నేడు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. కనీసంగా 21,654 తరగతి గదులు నిర్మించాల్సి ఉంటుందని, మొదటి విడత నాడు– నేడు, రెండో విడత నాడు–నేడు ఖర్చుకు ఇది అదనం అని అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

రెండో విడత నాడు –నేడు
నాడు –నేడు రెండో విడత పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. ఆగస్టులో రెండో విడత నాడు – నేడు పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. ఆగస్టు నెలలోనే నాడు–నేడు తొలి దశలో పనులు పూర్తిచేసుకున్న పాఠశాలలను సీఎం వైయస్‌ జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు.   

ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభం
ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈలోగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్కబుక్‌ యాక్టివిటీస్‌ వర్క్‌బుక్స్‌ ద్వారా పిల్లలకు బోధన చేపట్టాలని, ఆ వర్క్‌ బుక్స్‌ను కరెక్ట్‌ చేసి, పిల్లలకు తగిన సూచనలను ఉపాధ్యాయులు అందులోనే పొందుపర్చనున్నారు. 

విద్యా కానుకపై సమీక్ష
ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ టు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీని ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేయనుంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ఇస్తున్న డిక్షనరీని సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు. విద్యాకానుకలో భాగంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, నోట్‌బుక్స్, షూ, బెల్టు అన్నీ సిద్దం అయ్యాయా? లేదా? అన్నది సమీక్షించుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆగస్టు నెలలో జగనన్న విద్యాకానుక అందించాలని, ఆ మేరకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

ఇంటర్‌ మార్కుల విధానం ఖరారు
ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం మార్కుల అసెస్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నారు.  టెన్త్‌లో టాప్‌–3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్‌  ఫస్టియర్‌లో సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70 శాతం మార్కులు, ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తైనందున వాటి ఫలితాలు ఆధారంగా ఇంటర్‌ విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామన్నారు. 

నూతన విద్యా విధానం–సీఎంకు అధికారుల ప్రజెంటేషన్‌
విద్యారంగంలో ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర శిక్షా బడ్జెట్‌ ఆమోద సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను విద్యాశాఖ అధికారులు వివరించారు. నూతన విద్యావిధానంపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యామని తెలిపారు. ఈ సమావేశానికి 34 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. క్షేత్రస్దాయిలో సైతం పర్యటించి ప్రధాన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించామన్నారు. 

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షాఅభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రి సెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top