తాడేపల్లి: వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖ, వైయస్సార్ ఉచిత విద్యుత్‌పై సోమవారం సమీక్షించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. రైతులకు అవగాహన కల్పించాలి: ⇒ వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలి. ⇒ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుంది. ⇒ దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ⇒ ఆ విద్యుత్ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ⇒ ఆ తర్వాత రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కమ్‌లకు చెల్లిస్తారు. ⇒ మొత్తం ఈ ప్రక్రియలో రైతులపై ఏ మాత్రం భారం పడదు. వారికి ఇంకా నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ⇒ ఇదే విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి. ⇒ ఆ మేరకు అన్ని గ్రామ సచివాలయాల్లో పోస్టర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలి. ⇒ నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు, నిరంతరాయం సరఫరా చేయడం కోసమే మీటర్ల ఏర్పాటు అన్న విషయంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ⇒ ఆ ప్రక్రియలో భాగంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ⇒ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మెసేజ్ క్లియర్‌గా ఉండాలి. ఎక్కడా అపోహలకు అవకాశం ఇవ్వకూడదు. నాణ్యత – ఐఎస్‌ఐ ప్రమాణాలు: ⇒ ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యంఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్‌ఎల్)తో మాట్లాడండి. ⇒ రైతులు ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన మోటర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ⇒ అదే విధంగా కెపాసిటర్లు కూడా ఐఎస్‌ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి. శిక్షణనిచ్చాం: కాగా, మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్‌మెన్లకు శిక్షణ ఇచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి కూడా నవంబరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. సౌర విద్యుత్: మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొనగా, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.