నంద్యాల: వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల పట్ల అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద వచ్చింది. వరద ప్రాంతాలను సీఎం వైయస్ జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ స్కూల్‌లో వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఈ స్థాయి వర్షాలు అరుదు. పదేళ్ల కిందట ఇలాంటి వర్షాలు కురిశాయి. గతంలో లోటు వర్షపాతం ఉండేది. అయితే దేవుడు ఆకలి కేకలు ఉండకూడదని వర్షం పుష్కలంగా కురిపించారు. మంచి వర్షాలు కురవడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు తీరింది. కర్నూలులో 66 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు అయ్యింది. దాదాపు 17 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షం ఎక్కువగా పడటం వల్ల కాస్త నష్టంవాటిల్లిందన్నది వాస్తవమే. ఎక్కువ భాగం నష్టం రోడ్ల విషయంలో జరిగింది. రూ.426 కోట్లు ఆర్ అండ్ బీ రోడ్ల విషయంలో, పంచాయతీ రాజ్ శాఖలో మరో రూ300 కోట్ల నష్టం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. పంట నష్టం కూడా జరిగింది. 2 వేల హెక్టార్లలో హార్టికల్చర్ కూడా దెబ్బతినింది. అధికారులు నష్టంపై అంచనా మానవత్వంతో వ్యవహరించాలని సూచిస్తున్నాను. ఎక్కడా కూడా గట్టిగా పట్టుకోకుండా బాధితులకు న్యాయం చేసేలా అండగా నిలవండి. టెంపరరీగా ఏమేమి చేయాలని ప్రణాళిక రూపొందించాం. భవిష్యత్తులో ఈ మేరకు వర్షపాతం వస్తే మన ప్రాంతాలను సురక్షితంగా ఎలా రక్షించుకోవాలన్న అంశంపై ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నాను. కుందు నది ప్రవాహం వల్ల నష్టం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎప్పుడు వరద వచ్చినా కూడా కుందు పరివాహక ప్రాంతం ముంపునకు గురవుతుంది. శ్రీశైలం గేట్లు ఎత్తిన ప్రతిసారి నష్టం జరుగుతోంది. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన అవసరం ఉంది. కృష్ణ ఆయకట్టును బతికించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గోదావరి నుంచి కృష్ణానదిలోకి నీరు ఎలా తీసుకురావాలో ఆలోచన చేస్తున్నాం. రాయలసీమ డ్యామ్‌లు కెపాసిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. 40 రోజులు మంచి వాతావరణం ఉంటే చాలు రాయలసీమలోని ప్రాజెక్టులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా విస్తరణ పనులు చేపడుతున్నాం. ముంపు నుంచి గ్రామాలను రక్షించేందుకు చర్యలు యుద్ధప్రాతిపాదికన చేపడుతాం. శ్యామకాల్వకు ప్రోటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలి. వర్షాల కారణంగా నష్టపోయిన అందరికి మంచి చేస్తామని మాట ఇస్తున్నాను. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు పరిహారం ఇవ్వమని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం. బాధితులకు అన్యాయం జరిగితే కలెక్టరేట్‌లో ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. వెంటనే కలెక్టర్ కూడా స్పందిస్తారు.