ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి

ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలి

ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని వైద్య అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు సిఫార్సు చేశారు. నిమజ్జన, ఊరేగింపులు వద్దని వైద్య అధికారలు సిఫార్సు ద్వారా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వైద్య అధికారుల సిఫార్సుల మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తప్పవని సీఎం తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకారదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

తాజా వీడియోలు

Back to Top