తాడేపల్లి: అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుందని, రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నిర్దేశించిన గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదన్నారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని, ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిర్దేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశించారు. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని, జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. స్మృతివనంలో కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కన్వెన్షన్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని, నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్నారు. నడక దారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. పనులు నిర్దేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలని, ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని, అంబేద్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు, విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉందన్నారు. కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. పార్క్, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని, పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు తెలిపారు.