అమరావతి: ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవ రూపంలో ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలన్నారు. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలని సూచించారు.ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....: ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవ రూపంలో ఉండాలి: సీఎం ప్రతి అంశంలోకూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చింది: అలాంటి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశాలు. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు ... వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి: ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో వివిధ విభాగాల తరపున గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. తాము అనుకుంటున్న లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకుని అందులోని సిబ్బందిని పూర్తి స్ధాయిలో భాగస్వాములు చేయాలి. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలి. సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు, ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది పరిశీలన చేయాలి. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. అవగాహన కల్పించగలుగుతారు. అంతేకాక ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది. లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో కూడా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అన్న విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయి. దేశంలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్‌షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ అధికారుల నియామకం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్‌షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది: ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్‌అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్‌అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి: పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి: పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలి: ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి: కళ్యాణమస్తుకోసం నిర్దేశించిన అర్హతలు బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపుకోసం తోడ్పాటు నందిస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదోతరగతిగా నిర్ణయించాం, అంతేకాదు పెళ్లికూతురు కనీస వయస్సు 18 ఏళ్లు, పెళ్లికొడుకు కనీస వయస్సు 21 సంవత్సరాలను పాటించాలని చెప్పాం: ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలి. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది : అధికారులకు సీఎం నిర్దేశం. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల మౌలికవసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.