అమరావతి: కరోనాపై అవగాహన పెంచాలని, అపోహలను తొలగించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వస్తే మరణమేనన్న భయం వద్దని సీఎం ధైర్యానిచ్చారు. రాష్ట్రంలో మూడే పాజిటివ్ కేసులు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఆందోళనకు గురిచేస్తే కఠినచర్యలు హెచ్చరించారు. కరోనా సాకుచూపి నిత్యావసరాల ధరలు పెంచితే తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ప్రతిరోజూ పర్యవేక్షణ తప్పనిసరన్నారు. ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తల కోసమే స్కూళ్లకు సెలవులు, పార్క్‌లు, థియేటర్లు, మాల్స్, ఆలయాల మూసివేశామని వైయస్ జగన్ తెలిపారు. ‘‘కరోనా ఎదుర్కోవడంలో వలంటీర్ల సేవలు భేష్. స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాప్రతినిధులు కూడా ఉండేవాళ్లు. కరోనా నివారణా చర్యల్లో భాగస్వాములయ్యేవాళ్లు. కాని దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కరోనా కారణంగా ఇళ్లపట్టాల పంపిణీ ఏప్రిల్ 14కు వాయిదా వేశాం. దాదాపు 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కేసులు వేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనుషులే కాదనిపిస్తోంది’’ అని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు.