తాడేపల్లి: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున (జూలై 8) క్లీన్ ఆంధ్రప్రదేశ్.. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు సీఎం చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైయస్‌ఆర్ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్–జేజేఎం), వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ అన్నది చాలా ముఖ్యం. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదు. ముఖ్యంగా మురికి వాడల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అన్నది చూడండి. ఆ మురుగునీటిని ఎక్కడ పడితే అక్కడికి తరలించొద్దు. ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో వేయాలి. అలాగే సాలిడ్ వేస్ట్‌ను కూడా కాల్చి వదిలేయకుండా, ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేయండి. ఎస్‌ఓపీ రూపొందించండి. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్.. అన్నీ అదనంగా ఇవ్వండి. అవసరం మేరకు అన్నీ సమకూర్చండి. పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చాలి. గ్రామాల్లో చెత్త సేకరణకు కానీ, ఇంకా దేనికైనా రుసుము వసూలు చేస్తే, సేవల్లో ఎక్కడా లోపం ఉండకూడదు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలి. చెత్త సేకరణ కోసం సేకరించే ఈ–వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్) నిర్వహణ భారం కాకుండా చూసుకోండి. గ్రామాల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, వీధి దీపాలు.. ఈ మూడింటిపైనే ఎక్కువ వ్యయం చేయాలి. వాటికే అత్యధిక ప్రాధాన్యం. క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాలలో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలి. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకోవాలి ఏ కార్యక్రమం అయినా కమిటెడ్‌గా పనిచేస్తేనే క్వాలిటీగా రిజల్ట్ వస్తుంది వచ్చే కొద్ది రోజుల్లో ప్రతీ గ్రామంలోనూ మీ మార్క్ పనితీరు కనిపించాలి. మే 1నుంచి 100 రోజుల పాటు గ్రామాల్లో శానిటేషన్‌పై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. వైయస్‌ఆర్ జలకళ.. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంపు సెట్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీని ద్వారా 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగు నీరు అందుతుందని లెక్క. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. అందు కోసం ఎస్‌ఓపీ ఖరారు చేయండి. ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, పంప్‌సెట్ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్‌సెట్‌లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. అలాగే, బోర్ల లోతుపై ఉన్న నిబంధనలు సడలించి, జియాలజిస్టులు పరీక్ష చేసి, ఎంత లోతు వరకు బోరు వేయచ్చు అంటే, అంత వరకు వెళ్లండి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. అది మీ టార్గెట్. గ్రామీణ తాగు నీటి సరఫరా.. జగనన్న కాలనీలు కూడా మనకు ముఖ్యం. కాబట్టి ఈ కార్యక్రమంలో వాటిని కూడా చేర్చాలి. నీటి వనరు (సోర్సు), సరఫరా రెండూ ముఖ్యమే. అందువల్ల నీటి సోర్సు, స్టోరేజీ, సరఫరా ఈ మూడింటిపై దృష్టి పెట్టి పనులు చేయాలి. జగనన్న కాలనీల్లో జల్‌జీవన్ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు (పీరియాడికల్‌గా) శుభ్రం చేయాలి. ఆ మేరకు ఏటా ఎప్పుడెప్పుడు, ఏయే ట్యాంకుల్ క్లీన్ చేయాలన్న దానిపై ఒక ప్రొటోకాల్ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేయాలి. ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు).. వీధి దీపాలు ఎల్‌ఈడీ వాడకం వల్ల ఏటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల లైట్లు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు.. ఏపీ రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ) – ఈఏపీ. 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది` అని సీఎం వైయస్ జగన్ చెప్పారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మితో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.