తాడేపల్లి: రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. విత్తనం మొదలు పంట విక్రయం వరకు అన్నదాతకు తోడుగా నిలుస్తున్నారు. చెప్పిన దాని కన్నా ముందుగా.. మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతాంగానికి వైయస్‌ఆర్ రైతు భరోసా సాయాన్ని సీఎం వైయస్ జగన్ అందిస్తున్నారు. వైయస్‌ఆర్ రైతు భరోసా కింద వరుసగా రెండో ఏడాది.. మూడో విడత సాయం కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేయనున్నారు. 51.59 లక్షల మంది రైతులకు మూడో విడత సాయంగా రూ.1,120 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పొంది సాగు చేస్తున్న రైతులకూ ఈ సాయం అందనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అదే విధంగా నివర్ తుపాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని సీఎం వైయస్ జగన్ కాసేపట్లో విడుదల చేయనున్నారు. తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పంట నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల పరిహారాన్ని బాధిత రైతుల ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ మరికొద్దిసేపట్లో జమ చేయనున్నారు.