కర్నూలు: కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకు గ్రామంలోని చల్లా స్వగృహానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్..అక్కడ ఏర్పాటు చేసిన రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చల్లా మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం తెలుపుతూ..కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి.
కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.