అన్ని ప్రాజెక్టులు నింపడమే లక్ష్యం

బ్రహ్మంసాగర్‌ చివరి ఆయకట్టుకు నీరందిస్తాం

ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని ఇస్తాం

తెలుగు గంగ  ఆయకట్టు స్థిరీకరణ

గత ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోలేదు

కర్నూలు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో కరువుకు శాశ్వత పరిష్కారం

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతాం

ప్రాజెక్టుల రూపురేఖలు మార్చే ప్రణాళిక రూపొందిస్తాం

 అన్ని ప్రాజెక్టులు నిండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

వైయస్ఆర్‌ జిల్లా : రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో మూడు ప్రాజెక్టులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..సీఎం మాటల్లోనే..

కడప, కర్నూలు జిల్లాలోని కుందు బేసిన్‌లోని లక్ష 25 వేల ఎకరాలు, సగిలేరు, బ్రహ్మసాగరం కింద ఒకటిన్నర లక్షల ఎకరాలు, కేసీ కెనాల్‌ కింది భూములకు ఇప్పటికీ అరకొరగా నీరు వస్తోంది. బ్రహ్మంసాగరం పూర్తి అయి ఆ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు నిల్వ ఉంచాల్సిన ప్రాజెక్టులో కేవలం వైయస్‌ఆర్‌ హయాంలో మాత్రమే 13 టీఎంసీ నీళ్లు నిల్వ పెట్టారు. ఈ ఐదేళ్ల తరువాత మనం ఎలా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకువస్తాయి. డ్యామ్‌లు నిండలేదు. మన ప్రభుత్వం వచ్చాక ప్రయత్నాలు ముమ్మరం చేశాం. కేసీ ఆయకట్టును స్థిరీకరించేందుకు, బ్రహ్మం సాగర్‌ నుంచి సాగునీటి అవసరాలను తీర్చేందుకు మూడు రకాల పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. ఈ ప్రాంతానికి మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలుపెడుతున్నాం. బ్రహ్మంసాగర్‌ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు జొన్నవరం వద్ద కుందు నదిపై లిప్ట్‌ పెట్టి 8 టీఎంసీల నీటిని ఎస్‌ఆర్‌ వన్‌ ద్వారా బ్రహ్మం సాగర్‌ నింపడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నాం. ఇందుకోసం  అక్షరాల రూ.564 కోట్లు కేటాయిస్తున్నామని ఈ వేదిక నుంచి సగర్వంగా చెబుతున్నాను. దువ్వూరు, మైదుకూరు, కాజీ పేట, బద్వేల్‌, బీ.మట్టం, కలశపాడు, బీ.కోడూరు, కాశీనాయన, గోకవరం, అట్లూరి మండల రైతులకు మంచి జరుగుతుందని ఈ ప్రాజెక్టులు మొదలుపెడుతున్నాం. బ్రహ్మంసాగర్‌ కింద 90 వేల ఎకరాలను స్థిరీకరిస్తున్నాం. 72 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల కింద 35 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించబోతున్నాం. బద్వేల్‌, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయబోతున్నాం. మరోవైపు జిల్లాలోనే ప్రధాన పరిశ్రమ అయిన ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని దీనివల్ల పుష్కలంగా ఇవ్వగలం. మహానేత వైయస్‌ఆర్‌ పరిపాలనలో యాధృచ్చికంగా ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్‌ ఈ జీవో ఇచ్చారు. 23.12.2008లో నాన్నగారు జీవో 244 ఇచ్చారు. ఈ జీవో ద్వారా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి దివంగత నేత, ప్రియతమ నేత వైయస్‌ఆర్‌ ఇచ్చి ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆ తరువాత మనగురించి ఏ ఒక్కరూ ఆలోచన చేయలేదు. ఇవాళ దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోనే ఇవాళ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నానని గర్వంగా చెబుతున్నాను. కుందు నదిపై రాజోలి వద్ద 2.95 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రూ.1350 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాజోలి ఎగువభాగాన కర్నూలు జిల్లా కోయిలకుంట్ల వద్ద జోళదరాసి ప్రాంతంలో మరో 0.8 టీఎంసీల నీటి సామర్ధ్యంతో మరో రిజర్వాయర్‌ కట్టబోతున్నాం. దీని కోసం మరో రూ.1200 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కుందు నది వరదలు నివారించడమే కాకుండా నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు తరలించనున్నాం. ఈ మూడు ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఉయ్యలవాడ, కడప జిల్లాలోని పొద్దుటూరు, దువ్వూరు, చాపాడు మండలాలకు దీనివల్ల మేలు జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. 91 వేల ఎకరాలు స్థిరీకరించడమే కాకుండా కర్నూలు, వైయస్ఆర్‌ కడప జిల్లాల్లో సాగునీరు, తాగునీటికి వినియోగించుకునే అవకాశం మెరుగవుతుంది. ఈ రోజు రూ.2390 కోట్లతో శంకుస్థాపన పనులు ప్రారంభిస్తున్నాను. మైదుకూరు నియోజకవర్గంలో గ్రామ సచివాలయ నిర్మాణాల కోసం మరో రూ.17.5 కోట్లు, ఒపెన్‌ డ్రైనేజీ, సిమెంట్‌ పలకల మూత కోసం మరో రూ.30 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.  ఇదే నెలటూరు గ్రామానికి మంచి చేసేందుకు గ్రామ సచివాలయ నిర్మాణానికి రూ.30 లక్షలు, సీసీ రోడ్లకు రూ.27 లక్షలు, ఒపెన్‌ డ్రైనేజీ పనులకు రూ.2 కోట్లు, రోడ్ల కోసం మరో రూ.2 కోట్ల పనులకు శంకుస్థాపన చేయబోతున్నాం.  అక్షరాల ఈ రోజు ఇక్కడ రూ.2300 కోట్లతో శంకుస్థాపన చేసి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికిందని సవినయంగా చెబుతున్నాను.
మన ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది. ఆరు నెలల్లోనే ఆశ్చర్యకరమైన విషయాలు చూశాం. శ్రీశైలం గేట్లు 8 సార్లు ఎత్తారు. మన కళ్లేదుటే ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఇన్ని రోజులు నీళ్లు ప్రవహించినా కూడా మన ఖర్మ ఏంటంటే రాయలసీమ ప్రాజెక్టులు నిండకపోవడమే.  గండికోట పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు ఉంటే, కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. నా నియోజకవర్గంలోని చిత్రావతి ప్రాజెక్టు 10 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. ఇంతగా నీళ్లు వచ్చినా కూడా కేవలం 6 టీఎంసీలు మాత్రమే నింపిన పరిస్థితి చూశాం. బ్రహ్మంసాగర్‌ 17 టీఎంసీల కేపాసిటీలో కేవలం 8 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. రిజర్వాయర్లు ఉన్నా నింపుకోలేని పరిస్థితి. దీనికి గల కారణాలపై అధికారులను గట్టిగా ప్రశ్నించాం. గత ఐదేళ్ల ప్రభుత్వ అలసత్వం కారణంగా కాల్వల ద్వారా నీళ్లను తరలించడానికి ఇంత దయనీయ పరిస్థితి ఉంది. ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి సర్వేలు, తదితర కార్యక్రమాలు చేయాలంటే 8 నెలల వ్యవధి పడుతుంది. ఇవన్నీ గతంలో చేసి ఉంటే, మన కాల్వల పరిస్థితి మెరుగు పరిచి ఉంటే రాయలసీమలోని ప్రాజెక్టులు నిండు కుండలా ఉండేవి. అందుకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టుల రూపురేఖల మార్పుపై ప్రణాళికలు రూపొందించాం. వరద వస్తే సీమలోని  ప్రాజెక్టులన్నీ కూడా నిండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.  రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ 40 రోజుల్లోనే నిండేలా ప్రణాళికలు తయారు చేయిస్తున్నాం. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులు తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తెలుగు గంగ కాల్వ 11,500 నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. కేసీ కెనాల్‌, నిప్పులవాగులో 12,500 నుంచి 35 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ 21,700 నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. హంద్రీనీవా కాల్వ ప్రస్తుతం 2,200 క్యూసెక్కులు ఇవ్వని పరిస్థితి. ఈ కాల్వను 6 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం.  అవును నుంచి గండికోటకు 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. గండికోట నుంచి వెళ్లే కాల్వను 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. చిత్రావతికి 4 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు, గండికోట నుంచి పైడిపాలెం వెళ్లే కాల్వను వెయ్యి నుంచి 1500 క్యూసెక్కులకు పెంచబోతున్నాం. వరద వచ్చే సమయం కేవలం 40 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే ఉన్న అన్ని ప్రాజెక్టులు ఎలా నింపాలని అడుగులు వేస్తున్నాం. ఇందుకు రూ.23 వేల కోట్లు అవసరం అవుతాయని చెబితే..వెంటనే టెండర్లకు సన్నద్ధం కండని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రూపురేఖలు మార్చేందుకు, నీల్లు లేని పరిస్థితి నుంచి సస్యశ్యామలంగా చేసేందుకు గోదావరి నదిని పెన్నా బేసిన్‌కు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. గొళ్లపల్లిలో రిజర్వాయర్‌ కట్టి అక్కడి నుంచి బానకచెర్లకు నీటిని తీసుకువచ్చేందుకు రూ.60 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. కృష్ణానది దయనీయమైన పరిస్థితిలో ఉంది. కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు వచ్చాయని గత 47 సంవత్సరాల సీడబ్ల్యూసీ  రికార్డులు చూస్తే..1200 టీఎంసీలు అని లెక్కలు చెబుతున్నాయి. అదే సీడబ్ల్యూసీ రికార్డుల్లో గత పదేళ్లుగా చూస్తే కేవలం 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో కృష్ణానది నుంచి శ్రీశైలానికి 400 టీఎంసీలకు పడిపోయింది. ఇంతటి దారుణమైన పరిస్థితిలో రైతుల వ్యవసాయం జరుగుతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. మరోవైపు గోదావరి నదిలో 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఆ నీరు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టాం.  బొల్లేపల్లిలో రిజర్వాయర్‌ కట్టబోతున్నాం. ఇందుకోసం రూ.60 వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నాం. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. మీరంతా కూడా దేవున్ని గట్టిగా మొక్కాలని, మీ చల్లని దీవెనలు మీ బిడ్డపై ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా..

 

Back to Top