11న పొదిలికి వైయ‌స్‌ జగన్‌

ప్ర‌కాశం జిల్లా: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.  పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌ స్థలాన్ని వైయ‌స్ఆర్‌సీపీ  ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.

అనంతరం శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైయ‌స్‌ జగన్‌ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారన్నారు. వైయ‌స్‌ జగన్‌ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.

అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్‌ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. 

Back to Top