తాడేపల్లి : అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి నేడు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్‌చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది.