తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో నెల్లూరు చేరుకోనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్.. మరికాసేపట్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన `అమ్మఒడి` పథకం ప్రారంభోత్సవ సభా ప్రాంగణానికి బయల్దేరుతారు. `జగనన్న అమ్మఒడి` రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ‘అమ్మఒడి’ పథకాన్ని రూపొందించారు. వరుసగా రెండవ ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండవ ఏడాది అమ్మఒడి పథకం కోసం ప్రభుత్వం రూ.6,673 కోట్లను ఖర్చు చేస్తోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్‌లో రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ ఏడాది 44,48,865 మంది తల్లులకు అమ్మఒడి సాయాన్ని సీఎం వైయస్ జగన్ అందించనున్నారు.