తాడేపల్లి: ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఇందుకోసం రైతులను అన్నిరకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకువేశాం. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాల్లోని ఒక కుటుంబానికి రైతు భరోసా సాయం కింద ఏటా రూ.13,500 పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ రూతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఈ ఏడాది రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.. సీఎం ఏం మాట్లాడారంటే.. అరకోటికి పైగా రైతులకు దాదాపుగా రూ.6800 కోట్లు సాయంగా అందిస్తున్న ఈ పథకం వైయస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం. కొన్ని పథకాలు అమలు చేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఇద్దరు, ముగ్గురు కాదు. 50 లక్షల పైచిలుకు మంది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే అందులో 50 లక్షల పైచిలుకు ఇళ్లకు మేలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపుగా ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటికి మేలు జరుగుతుంది. ఈ మేరకు పెట్టుబడి సాయం రైతులకు అందించగలుగుతున్నామంటే.. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అరకోటి మందికి రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాల్లోని ఒక కుటుంబానికి రైతు భరోసా సాయం కింద ఏటా రూ.13,500 పంట పెట్టుబడి సాయం కింద అందిస్తున్నాం. విడతల వారీగా ఇస్తున్న ఈ సొమ్మును ఇప్పుడు రెండో విడత ఈ రోజు విడుదల చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత గతేడాది చూస్తే వైయస్‌ఆర్ రైతు భరోసా ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లతో ఆర్థికసాయం అందించగలిగాం. ఈ ఏడాది రైతుభరోసా సాయం 50.50 లక్షల కుటుంబాలకు పెరిగింది. 49.45 లక్షల రైతు కుటుంబాలతో పాటు 1.02 లక్షల మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పరిధిలోని కుటుంబాలకు కూడా ఈ ఏడాది సాయం అందిస్తున్నాం. రైతు భరోసాగా మే నెలలోపే దాదాపుగా రూ.3,713 కోట్లు ఇవ్వడం జరిగింది. మే నెలలోపే రూ.7,500, అక్టోబర్ నెలలోపే రూ.4000, మళ్లీ జనవరిలో సంక్రాంతి పండగలోపే రూ.2000 ఇలా మూడు దఫాలుగా ఈ పథకాన్ని అందిస్తున్నాం. మే నెలలోపే అక్షరాల రూ.7500 ఇవ్వడం జరిగింది. దాదాపుగా 49 లక్షల భూయజమానులతో పాటు 41 వేల మంది ధ్రువీకరించిన అటవీ భూముల సాగుదారులకు కూడా అందించడం జరిగింది. ఆగస్టులో రూ.980 కోట్లు, ఇప్పుడు రూ.1,114 కోట్ల సాయం అందిస్తున్నాం. వ్యవసాయలోకి మార్పు ఏ స్థాయిలోకి తీసుకురాగలిగామంటే.. ఈ రోజు రైతుకు, లబ్ధిదారుడికి మంచి జరిగించాలంటే.. ఆ మంచి ఎక్కడా వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, చివరకు పార్టీలు కూడా చూడకుండా చెప్పిన మాటను తూచా తప్పకుండా ప్రతి అర్హుడికి మేలు జరిగే విధంగా నేరుగా రైతు భరోసా సొమ్మును అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసి.. అది కూడా పాతబకాయిలకు జమ చేసుకోలేని విధంగా సాయం చేసే వ్యవస్థను తీసుకురాగలిగామని గర్వంగా చెబుతున్నా. అత్యధికంగా రూ.13,500 రైతులకు అందిస్తున్న పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఇందుకోసం రైతులను అన్నిరకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకువేశాం. ఇందులో భాగంగానే రూ.13,500 రైతులకే కాకుండా.. కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న గిరిజనులకు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు అందరికీ వర్తింపజేస్తున్నాం. ప్రతి రైతన్నకు రూ.12,500 పెట్టుబడి సాయం 4 సంవత్సరాల పాటు రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశాం. కానీ, ఈ రోజు గర్వంగా చెబుతున్నాను.. చెప్పినదానికంటే ఎక్కువగా.. 5 సంవత్సరాలకు పెంచి రూ.12,500 సాయం రూ.13,500 పెంచి రూ.67,500 ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వగలుగుతున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు కేవలం అర హెక్టార్ (1.25 ఎకరాల) లోపు ఉన్నవారే. ఇదే సంఖ్య ఒక హెక్టార్ వరకు తీసుకుంటే (2.5 ఎకరాల) లోపు తీసుకుంటే దాదాపు 70 శాతం మంది ఉన్నారు. రూ.13,500 ఇవ్వగలిగితే.. కేవలం అర హెక్టార్‌లోపు ఉన్న రైతులకు దాదాపుగా 80 శాతం పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. రైతుభరోసా సాయంతో పెట్టుబడి ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం మెరుగు అవుతుందని నమ్ముతున్నాం. రైతు భరోసా రెండో విడత సొమ్ముతో పాటు ఈ ఏడాది ఈ సీజన్‌లో అకాల వర్షాలు, వరదల వల్ల (జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో) పంటలు దెబ్బతిని నష్టపోయిన 1.66 లక్షల రైతులకు రూ. 135.73 కోట్ల పంటనష్ట పరిహారం కూడా ఈరోజే వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మొట్టమొదటి సారిగా ఇలా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పంటనష్ట పరిహారం ఇవ్వడం ఇంత వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రైతు నష్టపోకుండా తన కాళ్లమీద తను నిలబడాలని ఆలోచన చేసి మొట్టమొదటి సారిగా రైతుకు వెంటనే పంట నష్టపరిహారం అందిస్తున్నాం. ఈ అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు సంబంధించిన అంచనాలు తయారవుతున్నాయి. లెక్కలు పూర్తిచేసి నవంబర్ నెలలోపే నష్టపరిహారం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం. ఒక్కసారి గతాన్ని గమనించాలని కోరుతున్నా.. 2014లో ఖరీఫ్ పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకు పంట నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రకంగా చూసుకుంటే 2015లో ఖరీఫ్ పంట నష్టం జరిగితే 2016 నవంబర్‌లో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2017 జూన్‌లో, 2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో, 2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే అది పూర్తిగా ఎగ్గొట్టారు. ఇవి గతంలో పరిస్థితులు. ఈ రోజు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్ అయిపోకముందే వెంటనే ఆ రైతులకు పంటనష్టపరిహారం అందిస్తున్నాం. తద్వారా రైతులకు పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి అమలు చేస్తున్నాం. విత్తనం విత్తే సమయం నుంచి పంట అమ్మే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 10,641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏకంగా రైతుకు నాణ్యమైన విత్తనం, ఎరువులు, పురుగుమందులు అందించడంతో పాటు సూచనలు, సలహాలు అందిస్తున్నాం. చివరకు పండించిన పంటలను అమ్మకోని పరిస్థితి ఉత్పన్నమైతే ఆ పంటలను ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతుకు తోడుగా ఉండే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టామని సగర్వంగా చెప్పగలుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు ప్రతి నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా ‘వైయస్‌ఆర్ జళకల’ కార్యక్రమం ద్వారా బోర్లు వేయడమే కాకుండా.. మోటార్లు కూడా ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మనది. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్‌కు సంబంధించిన రూ.8,655 కోట్ల బకాయిలు పెట్టింది. ∙మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 14 నెలల ఉచిత విద్యుత్ బకాయిలు ఉన్నాయి. రైతన్నల కోసం చిరునవ్వుతో రూ.8,655 కోట్ల బకాయిలు చెల్లించాం. ధాన్యం సేకరణలోనూ రూ.960 కోట్ల బకాయిలు చంద్రబాబు పెట్టిపోయారు. వాటిని కూడా చిరునవ్వుతో తీర్చాం. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వం రూ.384 కోట్ల బకాయిలు పెట్టిపోతే.. వాటిని కూడా చిరునవ్వుతో రైతుల కోసం తీర్చాం. రైతులకు వడ్డీలేని రుణాల కింత 2014 నుంచి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి చెల్లించాల్సిన రూ.1046 కోట్లు మన ప్రభుత్వమే రైతులపై ప్రేమతో చెల్లిస్తోంది. 9 గంటల పాటు రైతులకు ఉచితంగా పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సమీక్ష చేస్తే.. పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫీడర్లు ఆ కెపాసిటీలో లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీలో ఉన్నాయని అధికారులు చెప్పారు. మరో రూ.1700 కోట్లు వెచ్చించి ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచాం. ఈ రోజుకు 90 శాతం ఫీడర్లను రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితుల్లోకి తీసుకువచ్చాం. మిగిలిన ఫీడర్ల కెపాసిటీ పెంచి రబీ నాటికి తీసుకువస్తాం. వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా రూ.1లక్ష వరకు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి వారికి వడ్డీని పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేవలం రైతు ఒక్క రూపాయి కడితే చాలు పంట ఇన్సూరెన్స్ ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ కోసం రైతు ఒక్క రూపాయి చెల్లించగా.. రైతులందరి తరుఫున రూ.506 కోట్ల ప్రీమియంతో పాటు, ప్రభుత్వం వాటాగా మరో రూ.524 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. మొత్తంగా రూ.1030 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా మన ప్రభుత్వమే చెల్లిస్తోంది. 13 జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గంలో 147 ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల నాణ్యత పరీక్షలను ముందుగానే నిర్వహించి వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది. 2019–20లో దాదాపుగా రూ.15 వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు వంటి పంటలను సైతం దాదాపుగా రూ.3200 కోట్లతో కొనుగోలు చేశాం. పత్తి కొనుగోలుకు అదనంగా మరో రూ.666 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. రైతులకు తోడుగా నిలబడుతూ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ఈ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి.. ఈ సీజన్‌లోనే పరిహారం ఇస్తూ వ్యవస్థలో మార్పు తీసుకువస్తూ రైతులకు అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజే జరుగుతుందని తెలిసి.. ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్షాలు 16వ తేదీ ఆగిపోతే ఈరోజు ట్రాక్టర్‌లకు పూలు కట్టుకొని వెళ్లి వాళ్లేదో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మభ్యపెట్టాలని ప్రతిపక్షం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మంచి పనులు చేసేవాళ్ల మీదనే రాళ్లు పడతాయనే దానికి ఉదాహరణ ప్రతిపక్షం చేసే పనులే. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగినదానికి బాధగా ఉన్నప్పటికీ.. దేవుడి దయ వల్ల ఈ ఏడాది కూడా మంచి వర్షాలకు కురిసి డ్యాములు, చెరువులు నిండాయి. ఇది రైతుకు, రాష్ట్రానికి శుభసూచికం. ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా సాయం, పంట నష్టపరిహారం పూర్తిగా రైతులకు ఉపయోగపడి ఇంకా గొప్పగా పంటలు పండి.. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.