నాన్న బాటలో నాలుగడుగులు ముందుకు 

విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే నా త‌ప‌న‌

నా పాదయాత్రలో గోపాల్‌ అన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను

తల్లిదండ్రులు అప్పులపాలుకాకూడదనే ‘విద్యా దీవెన, వసతి దీవెన’కు శ్రీకారం

వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన అమలు

మన పిల్లలు అత్యున్నతస్థాయికి ఎదగాలి.. పేదల తలరాతలు మారాలి

రెండేళ్లలో విద్యారంగానికి రూ.26,677 కోట్లు వెచ్చించాం

విద్యా దీవెన కింద ఇప్పటి వరకు రూ.5,573 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ

నేడు 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తున్నాం

రెండో విడత జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘నా పాదయాత్రలో గోపాల్‌ అన్న దంపతులు చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి. ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి మార్చాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేశాం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకంతో నాన్నగారు ఒక అడుగు ముందుకువేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకువేశా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ దిశగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. మన పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, అప్పుడే ఆ పేద కుటుంబం తలరాతలు మారుతాయన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల భోజనం, వసతి కోసం వసతి దీవెన ద్వారా ఏటా రూ.20 వేలు అందిస్తున్నామన్నారు. 

జగనన్న వసతి దీవెన పథకం కింద రెండో విడత ద్వారా అక్షరాల 10.97 లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా 9,88,437 తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు కూడా బాగా చదవాలని, వాళ్లకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువే అని చాలా గట్టిన నమ్మిన వ్యక్తుల్లో తానూ ఒకరినని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత అమలు కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

"దేవుడి దయతో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇవాల్టికి చదువురాని వారు ఎంత మంది ఉన్నారని లెక్కలు చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం మంది. దేశం సగటున చూస్తే దేశం 27 శాతం. అంటే దేశం కంటే రాష్ట్రం తక్కువస్థానంలో ఉంది. అదే విధంగా 18 నుంచి 23 సంవత్సరాల వయస్సుల్లో ఉన్న పిల్లల్లో ఎంతమంది ఇంటర్మీడియట్‌ పూర్తయిన తరువాత కాలేజీల్లోకి చేరుతున్నారని లెక్కలు చేస్తే అవి ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలతో పోల్చుకుంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారని చూస్తే బ్రెజిల్‌లో దాదాపు 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం, ఇండియాలో మాత్రం కేవలం 27 శాతం మాత్రమే ఉన్న పరిస్థితి. మన దేశంలో దాదాపుగా 73 శాతం మంది పిల్లలు ఇంటర్మీడియట్‌ పూర్తయిన తరువాత కాలేజీల్లో చేరడం లేదు.

పిల్లలు పై చదువులు చదవకపోతే పేదరికం అన్నది ఎప్పుడూ నిర్మూలించలేం. పిల్లలు చదువగలిగినప్పుడే, పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రాగలిగినప్పుడే ఆ చదువుల కోసం ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పుపాలు కాకుండా ఉంటేనే అప్పుడే వాళ్ల తలరాతలు మారుతాయి. అప్పుడే పిల్లలకు పెద్ద ఉద్యోగ అవకాశాలు, పెద్ద జీతాలు, జీవితాలు మారే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిల్లో పూర్తిగా మార్పు తీసుకురావడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఒక అడుగు ముందుకువేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకువేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. 

పిల్లలకు వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. పూర్తిఫీజురీయింబర్స్‌మెంట్‌తో పాటు చదువుల కోసం వెళ్లి హాస్టళ్లలో ఉండేందుకు సంవత్సరానికి మళ్లీ రూ.20 వేలు తల్లిదండ్రులకు అప్పులు కాకూడదని వసతి దీవెన కింద అందజేస్తున్నాం. ఈ రెండు పథకాల వల్ల పూర్తిగా పిల్లల భవిష్యత్తు  మార్చాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. 

నా పాదయాత్ర చేసేటప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గోపాల్‌ అన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఫీజులు లక్ష రూపాయలు, ప్రభుత్వం తరఫు నుంచి అరకొరగా వస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సంవత్సరానికి రూ.70 వేల పైచిలుకు అప్పులు తీసుకువచ్చి నా కొడుకును చదివిస్తే తప్ప చదువుకోలేని పరిస్థితి. నా బాధ చూడలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని గోపాల్‌ అన్న చెప్పాడు. నా పాదయాత్ర జరిగేటప్పుడు గోపాల్‌ అన్న ఇంటికి తన కొడుకు ఫొటో పెట్టుకొని ఉన్నాడు. గోపాల్‌ అన్న దంపతులు ఇద్దరూ వచ్చి నాతో చెప్పిన మాటలివి. ఆ రోజు నా మనసు ఎంత కలచివేసిందంటే.. ఈ రోజుకూ మరిచిపోలేను.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి మార్చాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేస్తున్నాం. 

ఈ రోజు ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న అందరు విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన అందిస్తున్నాం. రెండో సంవత్సరం కూడా అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా సకాలంలోనే బకాయిలు ఏవీ లేకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రతి త్రైమాసికంలో నేరుగా పిల్లల తల్లుక ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం వల్ల వారే కాలేజీలకు వెళ్లి ఆ ఫీజులు నేరుగా కట్టే పరిస్థితి క్రియేట్‌ చేస్తున్నాం. దీని వల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం అప్పటి వరకు బకాయిలు పెట్టిపోయిన రూ.1800 కోట్లు తీర్చడంతో పాటు రూ.4,207 కోట్లతో పూర్తి ఫీజురీయింబర్స్‌ పథకం కోసం ఖర్చు చేశాం. ఈ ఏడాది ఏ బకాయిలు లేకుండా ఏప్రిల్‌ నెలలో మొదటి విడత కింద రూ.671 కోట్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కింద రూ.694 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న వసతి దీవెన కింద నేరుగా అందించిన మొత్తం రూ.5,573 కోట్లు ఇంత వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం కోసం ఖర్చు చేశామని అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా తెలియజేస్తున్నాను. 

మొదటి విడతగా ఏప్రిల్‌లో చెల్లించాం. రెండవ విడతగా నేడు చెల్లిస్తున్నాం. మూడో విడత డిసెంబర్‌లో, నాల్గవ విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. నాలుగు విడతలుగా తల్లుల చేతికే డబ్బు ఇచ్చి.. వారే వెళ్లి ఫీజులు కట్టే పరిస్థితి క్రియేట్‌ చేశాం. వసతులు బాగాలేకపోతే కాలేజీ యాజమాన్యాన్ని తల్లులు నిలదీయవచ్చు. దీని వల్ల విద్యా వ్యవస్థలో మార్పులు కూడా వస్తాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాలేజీ యాజమాన్యంలో మార్పులు రాకపోతే 1902 నంబర్‌కు కాల్‌ చేస్తే ప్రభుత్వమే జోక్యం చేసుకొని సదుపాయాల లోపం ఉంటే వెంటనే సవరిస్తుంది. 

విద్యారంగంపై ఇప్పటి వరకు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంతని చూస్తే జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.13,022 కోట్లు జమ చేశాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 18,80,934 మంది పిల్లలకు రూ.5,573 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది పిల్లలకు రూ.2,270 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది పిల్లలకు మేలు జరిగేలా రూ.1600 కోట్లు, జగనన్న విద్యాకానుక ద్వారా 45 లక్షల మంది పిల్లలకు మేలు జరిగిస్తూ రూ.650 కోట్లు ఇవ్వడం జరిగింది. మనబడి నాడు–నేడు ద్వారా మొదటి విడత కింద 15,205 స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు రూ.3,564 కోట్లు ఖర్చు చేశాం. అక్షరాల రూ.26,677 కోట్లు విద్యారంగం మీదే ఖర్చుచేశాం. 

ఇది కాకుండా అంగన్‌వాడీల్లో పీపీ–1, పీపీ–2 తీసుకువచ్చాం. గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని రూ.1800 కోట్లు వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కింద ఖర్చు చేస్తున్నాం. చదువు అనే అంశానికి అత్యంత పెద్దపీట వేసిన ప్రభుత్వం మనది. మన పిల్లలు బాగా చదవాలని అంగన్‌వాడీల్లో పీపీ–1 నుంచి ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చి సీబీఎస్‌ఈ తెచ్చి.. పీపీ–1 నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నం చేయగలుగుతున్నాం. 

వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్‌ ఇచ్చాం. రెండో విడత డిసెంబర్‌లో ఇవ్వనున్నాం. వసతి దీవెన కింద ప్రతి ఏటా పిల్లలకు భోజనం, హాస్టల్‌ ఖర్చులకు రెండు విడతలుగా ఇచ్చే ఈ సొమ్ము ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నికల్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదివే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాం. 

విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. మన పిల్లలు మంచి జరగాలని, వారికి మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు రావాలి. గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లుగా, ఉన్నత స్థానాల్లో ఎదగాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top