దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖకు వస్తోంది

విశాఖ ఐటీ పార్క్‌ నిర్మాణ పనులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ శంకుస్థాపన

విశాఖ‌:  దేశంలోనే అతిపెద్ద డేటా సెంట‌ర్ విశాఖ‌ప‌ట్నంకు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. విశాఖ ఐటీ పార్క్‌ నిర్మాణ పనులకు బుధ‌వారం సీఎం వైయ‌స్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అదానీ గ్రూప్ చైర్మ‌న్‌తో క‌లిసి  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ డేటా సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. విశాఖకు డేటా సెంటర్‌ రావడం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంద‌న్నారు. డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖకు వస్తోంద‌ని పేర్కొన్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్‌ దేశంలో ఎక్కడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. డేటా సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కృతజ్ఞతలు తెలిపారు. డేటా సెంటర్‌లో విశాఖ ఏ1 సిటీగా మారనుందని చెప్పారు. డేటా సెంటర్‌తో ఇంటర్‌నెట్‌ డౌన్‌ లోడ్‌ స్పీడ్‌ పెరుగుతుంద‌ని, విశాఖ వాసులకు డేటా సెంటర్‌ గొప్ప వరంగా మార‌బోతుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు.  


ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

ఆదానీ గ్రూపు ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ఐటీ నిపుణులకు, ఆహుతులకు అభినందనలు.

విశాఖపట్నంలో  300 మెగావాట్ల సామర్ధ్యమున్న ఇంటిగ్రేడెట్‌ డేటా సెంటర్‌ పార్కు ఏర్పాటుకు శంకుస్ధాపన చేయడం చరిత్రాత్మక ఘట్టం. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వినియోగం, ఇంటర్నెట్‌ స్పీడ్‌ గణనీయంగా పెరుగుతుంది. డేటా డౌన్లోడ్, అప్‌లోడ్‌ శరవేగంగా జరుగుతాయి. ఇది విశాఖ అభివృద్ధిని మరింత పెంచుతుంది.
ఈ తరహా ఆధునిక సదుపాయాలవల్ల విశాఖ నగరం మహానగరంగా ఎదగడానికి దోహదపడుతుంది. ఈ డేటా సెంటర్‌ వల్ల సుమారు 40 వేల మందికి ఉపాధి కలుగుతుంది. దాదాపు రూ. 21,844 కోట్ల పెట్టుబడి విశాఖకు వస్తుంది. సహజనవనరుల ద్వారా లభించే విద్యుత్తునే ఈ డేటా సెంటర్‌కు వినియోగిస్తారు. ఇది చాలా ప్రాధాన్యమైన అంశం.

ఈ డేటా సెంటర్‌ కోసం ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కేటాయించాం. డేటా సెంటర్‌తో పాటు , ఐటీ సెంటర్‌ పార్కు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సదుపాయం, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటవుతుంది. దీంతో పాటు బిజినెస్‌ పార్కు కూడా ఏర్పాటవుతుంది. దీనివల్ల క్లౌడ్‌ సర్వీసులు కూడా మెరుగుపడతాయి. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డౌన్లోడ్‌ స్పీడ్‌ కూడా పెరుగుతుంది. తద్వారా ఐటీ కార్యకలాపాలను వేగంగా ఊపందుకుంటాయి. ఇవన్నీ విశాఖపట్నంలో ఐటీ రంగానికి మరింత ఊతమిస్తాయి. డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన అదానీ గ్రూపునకు నా ధన్యవాదాలు. విశాఖలో ఏర్పాటు కానున్న 300 మెగావాట్ల డేటా సెంటర్‌ దేశంలోనే అతిపెద్దది. ఇదంతా మరో ఏడు సంవత్సరాలలో దశల వారీగా జరుగుతుంది. 
వీటన్నింటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరోక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.
 

Back to Top