మత్స్యకారులకు మంచి జరగాలని..

రెండేళ్ల పాలన పూర్తికాకముందే.. వరుసగా మూడోసారి `వైయ‌స్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా` సాయం

1,19,875 మత్స్యకార కుటుంబాలకు రూ.119.87 కోట్ల సాయం

ఒక్కో లబ్ధిదారుడి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి

డీజిల్‌ సబ్సిడీ రూ.9కి పెంచి.. ఇప్పటి వరకు రూ.48 కోట్లు ఖర్చు చేశాం

ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీకి రూ.1,560 కోట్లు వెచ్చించాం

రూ. 50.30 కోట్లతో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటు

అంతర్జాతీయ ప్రమాణాలతో 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు 

రూ.1,510 కోట్లతో 4 హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభం

రూ.1,365 కోట్లతో మరో 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి చర్యలు

100పైగా ఆక్వాహబ్‌లు, వాటికి అనుసంధానంగా 120 రిటైల్‌ షాపులు 

ప.గో జిల్లాలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది శంకుస్థాపన

మత్స్యకార భరోసా పథకం అమలు కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘రెండేళ్ల పరిపాలన పూర్తికాకమునుపే.. వరుసగా మూడోసారి వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నందుకు సంతోషంగా ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా, తోడుగా ఉంటామన్న మాట నిలబెట్టుకున్నాం. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టాలకంటే.. పేదవాడికి, సామాన్యుడికి ఉన్న కష్టాలే ఎక్కువని భావించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలకూడదనే తపన, తాపత్రయంతో అక్షరాల 1,19,875 మత్స్యకార కుటుంబాలకు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి రూ.119.87 కోట్లు జమ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒకవైపున కోవిడ్, మరో వైపున వేట నిషేధ సమయం (ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు)లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరు. ఇటువంటి పరిస్థితుల్లో 1.20 లక్షల కుటుంబాలకు అందించే రూ.10 వేల చొప్పున సాయం ఎంతగానో ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నానని చెప్పారు.  

వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం అమలుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 1,19,875 మంది మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.119.87 కోట్లు జమ చేశారు. అంతకు ముందు మత్స్యకారులు, ఆక్వా రైతులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మత్స్యకార సోదరుడి కుటుంబంలో అన్నగా, తమ్ముడిగా తోడుగా ఉంటానని చెప్పిన మాటను నెరవేరుస్తూ 2019లో 1.02 లక్షల కుటుంబాలతో మొదలుపెట్టి.. ఈరోజు అక్షరాల 1.20 లక్షల కుటుంబాలకు మూడో ఏడాది మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.332 కోట్లు అందించామని సగర్వంగా అన్నగా, తమ్ముడిగా తెలియజేస్తున్నాను. 

పేదవాడికి మంచి జరగాలనే తపన, తాపత్రయంతో..
మనం అధికారంలోకి వచ్చిన తరువాత 23 నెలల పరిపాలన గమనిస్తే.. ప్రతి అడుగు, ప్రతి పథకం అక్కచెల్లెమ్మల కోసం, పేదవాడికి మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైయస్‌ఆర్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇలా ఏ పథకం చూసినా కూడా చివరకు గ్రామస్థాయి కూడా ఎక్కడా వివక్ష తావులేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి పథకాలు అందించే విధంగా వలంటీర్, గ్రామ వ్యవస్థలు తీసుకువచ్చి.. ప్రతి పథకంలోనూ పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమాలు 23 నెలల పాలనలో చేయడం గర్వంగా ఉందని మీ బిడ్డగా సంతోషంగా చెబుతున్నా.. 

గతంలో అరకొర సాయం..
గతాన్ని ఒక్కసారి గమనిస్తే.. మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇస్తామన్న భృతి పేరుకుమాత్రమే ఉండేది. అప్పట్లో రూ. 4 వేలు ఇస్తామని చెప్పి.. అది కూడా అరకొరగా ఇచ్చేవారు. ఎప్పుడిస్తారో కూడా తెలిసిది కాదు. వేట నిషేధ సమయంలో ఇస్తామని చెప్పారే కానీ, ఆ సమయంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఇచ్చే అరకొరసాయం కూడా కొంత మందికి ఇచ్చేసి చేతులుదులుపుకున్నారు. 

బంకులో డీజిల్‌ పట్టే సమయంలోనే సబ్సిడీ..
ఆ రోజుల్లో బోట్లకు లీటర్‌ డీజిల్‌ మీద రూ.6 సబ్సిడీ అని చెప్పారే కానీ, అరకొరగానే ఇచ్చేవారు. అప్పట్లో కేవలం 5 వేల బోట్లలోపే డీజిల్‌ మీద సబ్సిడీ వర్తింపజేసేవారు. ఈ రోజు చూస్తే 26,823 బోట్ల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరికీ డీజిల్‌ సబ్సిడీ అందేలా 100 పెట్రోల్‌ బంకులను కేటాయించి.. డీజిల్‌ పట్టేటప్పుడే ఆ సబ్సిడీ వచ్చేలా చేసి రూ.6 కూడా మరో 50 శాతం పెంచి రూ.9 లీటర్‌ డీజిల్‌కు సబ్సిడీ అందిస్తున్నాం. అది కూడా డీజిల్‌ పోయించుకునేటప్పుడే నేరుగా సబ్సిడీ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందు కోసం మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 

ప్రమాదవశాత్తు చనిపోయిన వెంటనే పరిహారం..
ఇంతకు ముందు సముద్రంలో వేటకు వెళ్లి జరగరాని ఘటన ఏదైనా జరిగితే.. ఆ మనిషి మళ్లీ ఇంటికి రాలేకపోతే.. ఆ ఇంటి పరిస్థితి ఏంటీ అని తెలిసి కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అలాంటిది ఈ రోజు ఎవరు ఎక్కడ ప్రమాదవశాత్తు చనిపోయినా వెంటనే వారిని గుర్తించి పరిహారం అందిస్తున్నాం. ఇప్పటికే వేటకు వెళ్లి చనిపోయిన దాదాపుగా 67 మంది మత్స్యకార కుటుంబాలకు అక్షరాల రూ.10 లక్షల చొప్పున రూ.6.7 కోట్లు బాధిత కుటుంబాలకు అందించాం. ఇంతకు ముందు చెప్పిన సమయాన్ని కూడా తగ్గించి వారికి మేలు జరిగేలా అడుగులు ముందుకువేశాం. 

ఆక్వా రైతులకూ తోడుగా నిలుస్తున్నాం..
ప్రతి అడుగులో వేటకు వెళ్లే మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమమే కాకుండా.. చివరకు ఆక్వా సాగుతో (చేపల ఉత్పత్తి) జీవనోపాధి పొందుతున్న రైతులకు కూడా తోడుగా నిలబడ్డాం. దాదాపుగా 53,550 మంది ఆక్వా రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ యూనిట్‌ రేట్‌ రూ.1.5కు తగ్గించేసి.. వీరికి మేలు చేయడం వల్ల సంవత్సరానికి రూ.780 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నా.. ఈ రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం. 

నాణ్యమైన సీడ్, ఇన్‌పుట్స్, ఫీడ్, మందులు సరఫరా..
ఆక్వా సాగు మాత్రమే కాకుండా.. ఆక్వా సాగులో ఏ రైతుకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో క్వాలిటీ సమస్యలు వచ్చినప్పుడు ఆ రైతు మోసపోకూడదనే దృక్పథంతో ఏకంగా 35 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. ఇందు కోసం అక్షరాల రూ.50.30 కోట్లు వెచ్చించాం. ఆక్వాసాగు జరిగే నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు తీసుకొచ్చాం. ఆర్బీకేలతో కూడా వాటిని అనుసంధానం చేసి ప్రతి రైతుకు నాణ్యతతో కూడిన సీడ్, ఇన్‌పుట్స్, ఫీడ్, మందులు సరఫరా చేస్తున్నాం. 

అంతర్జాతీయ ప్రమాణాలతో హార్బర్ల నిర్మాణం..

దేశంలో ఎక్కడా ఇంతకుముందు జరగని విధంగా వేటకు వెళ్లే మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు..? గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు..? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఎందుకు చిక్కుకుంటున్నారు.. ఎందుకీ పరిస్థితీ అని ఎవరూ ఆలోచన చేయలేదు. కానీ, మనం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వెళ్లి.. సరిహద్దుల్లో చిక్కుకుపోవాల్సిన అవసరం రాకూడదని చెప్పి.. మన రాష్ట్రంలోనే 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి అడుగులు వేశాం. ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి రూ.1510 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హార్బర్ల నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేశాం.. పనులు కూడా జరుగుతున్నాయి. 

హార్బర్ల నిర్మాణంతో 80 వేల మందికి ఉపాధి..
శ్రీకాకుళం జిల్లాలో బూడబుట్లపాలెంలో, విశాఖపట్నం పూడిమడకలో, పశ్చిమగోదావరిలోని బియ్యపుతిప్పలో, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మరో రూ.1365 కోట్లతో త్వరలో మరో 4 ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లను పిలిచి.. వాటిని కూడా ఈ సంవత్సరంలో ప్రారంభించేలా చేస్తామని తెలియజేస్తున్నాను. రూ.2775 కోట్లు వెచ్చించి 8 ఫిషింగ్‌ హార్బర్లను కూడా తీసుకువచ్చి.. దాదాపుగా వీటితో 80 వేల మంది మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు వేగంగా అడుగులు ముందుకువేస్తున్నాం. 

ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం..
చేపలు, రొయ్యలు పండిస్తున్న ఆక్వారైతులు, వేటకు వెళ్లి చేపలు పట్టుకునే మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోకూడదు. పండించిన ఆక్వా పంటకు, వేటకు వెళ్లి తెచ్చిన చేపలకు సరైన గిట్టుబాటు ధరలు ఎల్లవేళలా అందుబాటులోకి రావాలని ఏకంగా 100కు పైగా ఆక్వా హబ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించేందుకు కార్యాచరణ చేశాం. ఒక్కో హబ్‌ కింద 120 రిటైల్‌ షాపులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 100 ఆక్వాహబ్‌లు, 12 వేల రిటైల్‌ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా రానున్నాయి. వీటి వల్ల ఆక్వా పంట, వేటకు వెళ్లి తీసుకువచ్చిన చేపలు మంచి రేటుకు అమ్ముకునే వెసులుబాటు కల్పించే కార్యక్రమానికి ఈ సంవత్సరం శ్రీకారం చుడుతున్నాం. 

ఈ ఏడాదే ఫిషింగ్‌ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నాం. దానికి కూడా ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి.. పనులు మొదలుపెట్టబోతున్నాం. ఎక్కడైనా ఫిషింగ్‌కు సంబంధించి విశ్వవిద్యాలయం వల్ల టెక్నికల్‌ నాలెడ్జ్‌ నేర్పించగలుగుతాం. ఈ ప్రాంతంలో ఉన్నవారికి మంచి ఉద్యోగాలు, మెరుగైన జీతాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. 

ఓఎన్‌జీసీ బాధితులకు అండగా నిలిచాం..
దేవుడి దయతో మత్స్యకార సోదరులకు మంచి కార్యక్రమం అమలు చేసే అవకాశం వచ్చింది. 2012లో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వాళ్లు ఓఎన్‌జీసీ తవ్వకాల వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో జీవనోపాధి కోల్పోయిన దాదాపుగా 14,927 మత్స్యకార కుటుంబాలకు అప్పట్లో రూ.47,250 ఇస్తామని చెప్పి.. ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోతే.. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదు. పాదయాత్రలో చెప్పాను.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబాలకు తోడుగా ఉంటానని మాటిచ్చా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మడివరంలోనే మీటింగ్‌ పెట్టి ఓఎన్‌జీసీ నుంచి డబ్బులు రావడం ఆలస్యమైనప్పటికీ రూ.75 కోట్లు మనమే భరించి.. ఆ కుటుంబాలకు అండగా నిలిచామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఓఎన్‌జీసీ నుంచి పూర్తిగా డబ్బు రాలేదు. పేదవాడికి ఇబ్బందులు రాకూడదని ప్రతి అడుగూ ముందుకు వేశాం. మత్స్యకార భరోసా పథకం ద్వారా 1,19,875 కుటుంబాలకు మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

తాజా వీడియోలు

Back to Top