అధైర్య పడద్దు... అండగా ఉంటా...

బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్

 తక్షణ సహాయ చెక్కులను బాధితుల ఇంటి వద్దే అందించిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు.

విజ‌య‌వాడ‌:  అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ప‌లువురికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పి ఆర్థిక స‌హాయం అందించి అండ‌గా నిలిచారు. శుక్రవారం నగరంలోని విద్యాధరపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ వైయ‌స్ఆర్ వాహన మిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమానికి హాజరై తిరిగి క్యాంప్ కార్యాలయానికి వెళ్లే సమయంలో పొందుగుల చిన్నారెడ్డి, నాగోజి చంద్ర శేఖర్ల ఆనారోగ్య సమస్యలను శాసనభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ కి వివరించారు.

నగరంలోని భవానిపురంకి చెందిన పొందుగుల చిన్నారెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలో తన వెన్నుపూస పూర్తిగా విరిగి పోయిందన్నారు. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చలించి మానవతాదృక్పదంతో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించగా తక్షణమే శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు లు 10 లక్షల రూపాయల చెక్కును పొందుగల చిన్నారెడ్డి కుటుంబానికి ఇంటివద్దే అందజేశారు.

నగరంలోని భవానిపురంకి చెందిన నాగోజి చంద్ర శేఖర్ తన రెండు కిడ్నీలు పాడైపోయిన కారణంగా ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.  వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆదేశించగా తక్షణమే జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావులు లక్ష రూపాయల చెక్కును నాగోజి చంద్రశేఖర్ కుటుంబానికి ఇంటి వద్దే అందజేశారు.
 

Back to Top