అతిగొప్ప బాధ్యత మీ భుజాలపై పెడుతున్నా

ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలి

సొంత మండలంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం

మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం

సమర్థవంతంగా పనిచేయండి మీ వెంట నేనున్నా..

వివక్ష, అవినీతి లేని పారదర్శకమైన సేవలు అందించండి

నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డు

ఉద్యోగాల విప్లవం ఇంతటితో ఆగిపోదు

ప్రతి జనవరి మాసంలో ఉద్యోగాల భర్తీ చేపడతాం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడాలి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 500 సేవలు అందిస్తున్నాం. దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కవ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఏపీదే. దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం ఓ చరిత్ర. దేశ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా సొంత మండలంలో పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టమన్నారు. ఆ అవకాశాన్ని దక్కించుకున్న మీరంతా మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. విజయవాడ ఏప్లస్‌ కన్వెన్షన్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగులు సాధించిన వారికి నియామకపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం వైయస్‌ జగన్‌ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ..

గ్రామ సచివాలయాల్లో  వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు  అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
 రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, బహుశా దేశ చరిత్రలోనే అత్యంత∙తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా  ఏకంగా ఇరవైలక్షలమందికి పై చిలుకుగా ఉద్యోగాలకోసం అటెండ్‌ కావడం  ఎనిమిది రోజుల పాటు ఈ పరీక్షలు జరగడం అత్యంత పారదర్శకంగా జరగడం దాని తర్వాత దాదాపుగా  లక్షా నలభై వేల మందికి  శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం  ఇది నిజంగా ఒక రికార్డు. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డు అని గర్వంగా ఈ వేదిక మీద గర్వంగా చెబుతున్నాను. ప్రతి రెండువేల జనాభాకు  ఒక సచివాలయం పెట్టడం, తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెబుతున్నా. ఇది కాక ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలెంటర్‌ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగాల చరిత్రలో ఒక సరికొత్త రికార్డు అని చెప్పి సగర్వంగా నేను చెబుతున్నాను. నాలుగు నెలలు తిరగకముందే అక్షరాల నాలుగులక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాను. ఈ రికార్డు మరింత గొప్పగా, మరింత గర్వపడేలా ఉండాలంటే మీలో ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఉద్యోగంగా తీసుకోకూడదు. ఒక ఉద్యమంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తున్నాను. స్వంత మండలంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం కొందరికే దక్కుతుంది. అలాంటి గొప్ప అదష్టవంతులు మీరని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అక్కడి ప్రజల కోసం ఆలోచన చేయండి .అక్కడి ప్రజలకోసం చిత్తశుద్దితో, నిజాయితీగా, లంచాలు లేని, వివక్షలేని పారదర్శకపాలన అందించమని చెప్పి సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను.  
ప్రతి యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరును నియమించాం.  ఆ నియమించిన ఆ గ్రామవాలంటీర్లతో మీరందరూ కూడా అనుసంధానం కావాలని కోరుతున్నాను.   వారు మీరు కలిసి ప్రతి పేదవాడి మొహం మీద చిరునవ్వు తీసుకురావాలని కోరుతున్నాను.

మీ అందరికీ కూడా ఒకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోమని కోరుతున్నాను. మనం అధికారం చెలాయించడం కోసం ఈ పని మనం చేయడం లేదు. మనం ప్రజలకు చేరువగా ఉంటూ, వారికి సేవలు అందించడం కోసమే మేమీ ఉద్యోగాలు చేస్తున్నామన్నది ఎప్పుడూ గుర్తు పెట్టుకోమని మీ అందరినీ కోరుతూ వున్నాను. పారదర్శకతతో వివక్ష లేని అవినీతి లేని ఆ పాలన కోసం గ్రామాల్లో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ పాలన  మీ భుజస్కందాలపైన పెడుతున్నాను... మీరు తీసుకొస్తారన్న నమ్మకంతో.ఉద్యోగమంటే ఒక బాధ్యత.  నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూశా..13 జిల్లాల్లో కూడా తిరిగా. అక్కడ పరిస్థితులు కూడా చూశా. గ్రామమంటే నిజంగా ఎవరికైనా ప్రేమే. మక్కువే. ఆ మక్కువ, ఆ ప్రేమా చివరికి  అమెరికాకు వెళ్లినా కూడా , యూరోప్‌ వెళ్లినా కూడా అక్కడ వాళ్లు కూడా స్వంత ఊరిని మరిచిపోరు. స్వంత తల్లిని మరిచిపోరు. అక్కడి వాళ్లు కూడా ఆ ఊరికేదో మేలు చేయాలి అని ఆలోచన చేస్తుంటారు.  అటువంటి బహత్తర బాధ్యత మీ అందరి భుజస్కందాలపైన ఉందని చెబుతున్నా.  మరిచిపోవద్దని కోరుతున్నా.  

గ్రామాల పరిస్థితి ఒక్కసారి గమనించండి. కనీససదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు.  మంచినీరు ఉండాలి ..మంచినీరు తాగాలని  ఎవరైనా కూడా ఆశిస్తారు.  పిల్లల చదువుకోసం మంచి బడి ఉండాలని ఆలోచన చేస్తారు. చిన్నా చితకా అనారోగ్యాలకు అందుబాటులో వైద్యం ఉండాలని ఆలోచన చేసారు. ఇవేవీ కూడా గ్రామాల్లో అందుబాటులో లేనప్పుడు, చివరకు బియ్యం కూడా  నాసిరకం ఇస్తూ, అవి కూడా సరిగ్గా  ఇవ్వని పరిస్థితుల్లో ఇవాళ మన గ్రామాలు కనిపించే పరిస్థితి.  ఒక రేషను కార్డు కావాలన్న లంచం, ఒక పెన్షన్‌ కావాలన్నా లంచం, ఇల్లు లేక, ఇంటి స్థలం అడగాలన్నా కూడా ...ఎవరిని అడగాలన్న అర్థం కాని పరిస్థితిలో మన గ్రామాల్లో ప్రజలున్నారు.   ఎక్కడికి పోవాలో తెలీదు. ఎవరి చుట్టూ తిరగాలో తెలీదు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వకుండా పనులు జరగని పరిస్థితిలో ఇవాళ మన వ్యవస్థ ఉంది. మండల ఆఫీసు కేంద్రాల చుట్టూ తిరుగుతూ, కలెక్టర్లకు అర్జీలు పెడుతూ,  ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతూ, చివరకు ఎవడికి పడితే వాడికి లంచాలు ఇచ్చుకుంటూ పోతున్న వ్యవస్థలో బతుకుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన గ్రామాలను మనం చూశాం. జన్మభూమి కమిటీల పేరుమీద, ఏరకంగా పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, పనిముట్లు కొనుగోలు చేయాలన్నా లంచం లేనిదే ఎక్కడా కూడా పని జరగని పరిస్థితి మన కళ్ల ఎదుటే చూశాం. గ్రామాల్లో పాలనా వ్యవస్థ వెంటిలేటర్ల మీద ఉందని నేను వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక సచివాలయం తీసుకొచ్చాం.  ఎవరికైనా ఏదైనా కావాలంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా,72 గంటల్లోనే అది అందుబాటులోకి తీసుకురాగలిగే మెకానిజమ్‌ కోసం ఈ వ్యవస్థ ఉందీ అన్నది మరిచిపోవద్దు అని మీ అందరినీ కోరుతున్నాను.  
50 ఇళ్లకే ఒక వాలంటీరును కూడా తీసుకొచ్చాం. వారు మీరు అందరూ సమర్ధంగా పనిచేయాలి. మన గ్రామాల్లో చదువుకున్న పిల్లలను నడిపించే మంచి ప్రభుత్వం తోడుంటే ఈ వ్యవస్థ ద్వారా ఆశిస్తున్నవన్నీ చేయగలమన్న నమ్మకంతోనే ఈ వ్యవస్థ ఏర్పడిందని... మరిచిపోవద్దని కోరుతున్నాను.

ఈ గ్రామసెక్రటేరియట్‌లు  దాదాపుగా 34 డిపార్టుమెంట్లకు సంబంధించిన పనులు జరుగుతాయి. 500 పై చిలుకు సేవలు అందించే  పనులు ఈ గ్రామ సెక్రటేరియట్ల నుంచి జరుగుతాయి.   ఆ యాభై ఇళ్లకు ఒక వాలెంటీరు బాధ్యత తీసుకుని వారిలో ఎవరికైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వుంటే,  వారిని గ్రామసెక్రటేరియట్‌ దగ్గరకు తీసుకురాగలగాలి.  అలా తీసుకొచ్చిన వ్యక్తులను మీరు చిరునవ్వుతో పలకరించి, వారికి కావాల్సిన ఫార్మాలటీస్‌ అన్నీ కూడా   పూర్తి చేసి, 72 గంటల్లోనే వారి చేతుల్లో   పెన్షన్‌ కార్డు పెట్టగలిగితే,  ఒక రేషన్‌ కార్డు పెట్టగలిగితే, వారికి ఇంటిస్థలం ఇవ్వగలిగితే, కనీసం ఎప్పుడు ఇస్తామో చెప్పే ధ్రువపత్రం వారి చేతిలో పెట్టగలిగితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ వచ్చిన వాళ్ల మొహంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నాను.
ఇవాళ ఇదే గ్రామసచివాలయంలో పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు... ఇళ్లస్థలాలు, తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, సివిల్‌సప్లయ్‌పనులు, వైద్యసేవలు, రెవెన్యూ, భూముల సర్వే పనులు, మహిళా పోలీసింగ్, శిశుసంక్షేమం, వ్యవసాయం,  ఉద్యానవనాలు, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ, డెయిరీ, పౌల్ట్రీరంగాలకు సంబంధించిన సేవలు,  ప్రభుత్వధృవీకరించిన తర్వాతనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా గ్రామసెక్రటేరియట్‌ పక్కనే ఒక షాపు పెట్టి, ఆ షాపుపక్కనే బెస్ట్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ కోసం, ఒక వర్క్‌షాపు కూడా పెట్టి ...ఇవన్నీ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరగబోతోందని సగర్వంగా చెబుతున్నాను. ఇవన్నీ మీ అందరి భుజాలపై పెట్టి నడపబోతున్నాం.

అక్టోబర్‌ 2వ తేదీ నుంచి మీరంతా మీ విధుల్లో చేరబోతున్నారు. నాలుగు నెలల్లో ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి, ఇంకా చాలా గ్రామాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కానర్లు, ల్యామినేషన్‌ మెషిన్లు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సాగుతోంది. ఇంకా మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేసి 45 రోజుల్లో డిసెంబర్‌ మొదటి వారం, నవంబర్‌ చివరి కల్లా గ్రామ సెక్రటేరియట్‌లలోకి అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామ వలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్‌ అందిస్తాం. వీటన్నింటికీ సంబంధించిన టెండర్లు పిలిచాం. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రక్రియ పూర్తిచేసి 45 రోజుల్లో అందజేస్తాం. ఇవన్నీ పూర్తిచేసుకొని డిసెంబర్‌ మొదటి వారం కల్లా పూర్తిగా గ్రామ సెక్రటేరియట్‌లో ఉండాల్సినవన్నీ ఉండేట్లుగా స్మార్ట్‌ఫోన్‌తో సహా అందుబాటులోకి వస్తాయి. చిన్నా, చితకా సమస్యలు ఉంటే.. డిసెంబర్‌ మాసం అంతా అధిగమించేందుకు కృషిచేస్తాం. జనవరి 1వ తేదీ నుంచి పూర్తిగా మీ ఆధ్వర్యంలో గ్రామ సెక్రటేరియట్లు, వలంటీర్లు ద్వారా 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. 

జనవరి 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులు ఇవన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి. పారదర్శకంగా చేయండి అని చెబుతున్నాను. ప్రభుత్వ పథకం ఏదైనా సరే ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా పూర్తిగా పారదర్శకంగా మీ గ్రామ సచివాలయంలో డిస్‌ప్లే బోర్డులలో ఉంటాయి. దాని వల్ల ఎవరెవరు లబ్ధిదారులనేది గ్రామంలోని వారందరికీ తెలుస్తుంది. దాని వల్ల సోషల్‌ ఆడిట్‌ జరుగుతుంది. ఆ సోషల్‌ ఆడిట్‌ ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందుతాయి. ఎక్కడా కూడా కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, పార్టీలు కూడా చూడొద్దు అని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మనకు ఓటు వేయనివారు కూడా మనం చేసే మంచిని చూసి మళ్లీ ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా చేయాలని కోరుతున్నాను. వ్యవస్థలోకి ఆ రకమైన పారదర్శకత, మార్పు తీసుకురావాలి. అది జరిగిచ్చే కార్యక్రమం మీ అందరి భుజాలపై పెడుతున్నాను. 

అవినీతి జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి రాకూడదు. దాని కోసం 1902 అనే కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పెట్టాం. సీఎం కార్యాలయానికి ఈ నంబర్‌ అనుసంధానం చేశాం. ఎవరైనా, ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదు చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నా. సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు, మీ పనితీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలంటే మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలనేది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాను. గొప్ప బాధ్యతను మీ భుజాలపై పెట్టాను. మీ అందరిపై నాకు నమ్మకం ఉంది. ఈ వయస్సులో మీరు ఉద్యోగాలు చేపడితే లంచాలు, వివక్ష లేకుండా వ్యవస్థలోకి మార్పు తీసుకువస్తారనే సంపూర్ణ నమ్మకం నాకు ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అన్నగా ఆల్‌ ది వెరీ బెస్టు అని గర్వంగా చెబుతున్నాను. 

20 లక్షల మందిపైచిలుకు పోటీ పడి రాసిన ఈ పరీక్షల్లో 1,35 లక్షల మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సాధించిన మీ అందరికీ కంగ్రాట్స్‌. ఇంత గొప్ప పరీక్షలను పంచాయతీ రాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులు గొప్ప బాధ్యతగా తీసుకొని చేసిన కృషి అంతా.. ఇంతా కాదు. మార్పు తీసుకుని రావాలంటే మన దగ్గర ఉన్న ఐఏఎస్‌లు, అధికారులు ఎంత గొప్పగా పనిచేస్తారనేది ఈ ఫలితాలే దిక్సూచి. అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అధికారులకు సెల్యూట్‌ చేస్తున్నాను. 

ఈ ఉద్యోగాల విప్లవం ఇంతటితో ఆగిపోదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి చివరి వరకు ఎగ్జామినేషన్‌ మంత్‌ అని ఈ వేదిక నుంచి చెబుతున్నాను. ప్రతి డిపార్టుమెంట్‌లో ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. వాటన్నింటినీ భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని మీ అందరి సమక్షంలో గర్వంగా చెబుతున్నానని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 
 

Back to Top