ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల‌న్నీ భర్తీచేయాలి

డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు

డాక్ట‌ర్లు గిరిజన ప్రాంతాల్లోనే ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు స్పష్టంగా కనిపించాలి

వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: ఈనెల చివ‌రి నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ‌లో `నాడు – నేడు` కింద చేపట్టిన పనులను సమీక్షించిన సీఎం.. వైయ‌స్ఆర్ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతి గురించి ఆరా తీశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని అధికారుల‌ను మ‌రోసారి ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ చ‌ర్య‌లు, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.  

కోవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితులు కేవలం 2301 మందేనని అధికారులు వివ‌రించారు. ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది, వీరుకూడా దాదాపుగా కోలుకుంటున్నారని అధికారులు చెప్పారు. 2144 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న కాల్స్‌ గణనీయంగా తగ్గాయని, నిన్న వచ్చిన కాల్స్‌ కేవలం 246, ఇందులో ఆస్పత్రిలో జాయిన్‌ అయినవారు 18 మంది మాత్రమేనని ముఖ్య‌మంత్రికి అధికారులు తెలిపారు. 

వ్యాక్సినేషన్‌ 
వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. రెండు డోసులు వేసుకున్నవారు 3,73,71,243 కాగా, ఒక డోసు వేసుకున్నవారు 55,38,556. ప్రికాషనరీ డోస్‌ టార్గెట్‌ 12,60,047 కాగా ఇప్పటికే 9,79,723 మందికి వాక్సినేషన్‌ పూర్తి చేశామ‌న్నారు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన​ ఏమన్నారంటే..
``గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలి. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాను. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే.. దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తాను. గిరిజన ప్రాంతాల్లోనే కాదు.. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో  స్పష్టంగా మార్పులు కనిపించాలి`` అని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

Back to Top