పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌కు సీఎం వైయస్‌ జగన్‌ భూమి పూజ

రూ.270 కోట్లతో అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు

ప్లాంట్‌ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు

బ్రోకెన్‌ రైస్‌తో ప్లాంట్‌లో ఇథనాల్‌ తయారీ 

ప్లాంట్‌తో పాటు బైప్రొడక్ట్‌ కింద పశువుల దాణా అందుబాటులోకి వస్తుంది

తూర్పు గోదావరి జిల్లా: ప‌రిశ్ర‌మ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు నెల‌ల్లో ఒక ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అన్ని ర‌కాల అనుమ‌తులు ఇప్పించ‌గ‌లిగామంటే ఈజ్ ఆఫ్  డూయింగ్ బిజినెస్ ఎంత వేగంగా జ‌రుగుతుందో అర్థం చేసుకోవాల‌న్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్‌.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. 

 ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

దేవుడి దయతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మంచి చేసే ఇథనాల్‌ ప్లాంట్‌ ఇక్కడ రాబోతుంది. ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అసాగో ఇండస్ట్రీస్‌ ఎండీ, సీఈఓ ఆశీష్‌ గుర్నాని గారికి, ఆయనికి అన్నిరకాలుగా మార్గదర్శకత్వం, సహకారం అందిస్తున్న ఆయన తండ్రి, టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ గారికి, కంపెనీకి సంబంధించిన ఇతర ప్రముఖులకు, నా మంత్రివర్గ సహచరులకు, అధికారులకు, ఇక్కడకు హాజరైన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు.. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో రూ.270 కోట్లతో ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరగబోతుంది. టెక్‌ మహీంద్రా అనే పారిశ్రామిక దిగ్గజం మనందరికీ తెలిసిన పెద్ద సాప్ట్‌వేర్‌ కంపెనీ. ఈ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ గారి కుమారుడి ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ఇక్కడ రాబోతుంది.

6 నెలల కాలంలోనే అనుమతుల నుంచి భూమిపూజ వరకూ...
నేను ఒక ఆరునెలలు క్రితం దావోస్‌ వెళ్లినప్పుడు అక్కడ నన్ను గుర్నానీ గారు కలిశారు. అప్పుడు ఆంధ్రరాష్ట్రానికి రావాల్సిన ఆవసరం, ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న మంచి, ఏపీ ఏ రకంగా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తుందో చెప్పాం. అప్పుడు తను మాట్లాడుతూ... ఎలాగూ టెక్నాలజీ వైపు వేస్తున్న అడుగులకు ఊతమందిస్తున్నాం... మరోవైపు తన కొడుకును కూడా ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఆలోచన చేస్తున్నారు.. మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దావోస్‌లో తనను ఏపీకి రమ్మని ఆహ్వానం పలికాం. అప్పటి నుంచి ఇప్పటికి కేవలం ఆరు నెలలు కాలంలోనే ఒక పరిశ్రమకు సంబంధించి భూములివ్వడం దగ్గర నుంచి... పరిశ్రమకు కావాల్సిన అనుమతులన్నీ మంజూరు చేసి ఈ రోజు భూమిపూజ చేశాం. కేవలం ఆరునెలల్లోనే ఇవన్నీ జరిగాయంటే ఏస్ధాయిలో మన రాష్ట్రంలో ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు.

రైతులకు మేలు జరిగేలా...
ఈ రోజు ఒక మంచి ప్లాంట్‌ ఇక్కడికి రాబోతుంది. దాదాపు 2 లక్షల లీటర్ల కెపాసిటీతో ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. దీనివల్ల 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వాటిలో కూడా స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని  చట్టం చేసినందువల్ల... మన పిల్లలకు మంచి జరుగుతుంది. దీంతోపాటు తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా చాలా మేలు చేస్తుంది. మనం ఎప్పుడూ తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడమే కాకుండా.. ముక్కిపోవడం, చివరకు బియ్యం విరిగిపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇటువంటి సమస్యలకు కూడా ఈ ప్లాంట్‌ పరిష్కారం ఇస్తుంది. బ్రోకెన్‌ రైస్, మేస్‌ ఈ రెండింటి ఆధారంగా ఈ ప్లాంట్‌ పనిచేయగలుగుతుంది. దానివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది. తద్వారా రంగుమారిన ధాన్యం, విరిగిపోయిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పంచగలిగే గొప్ప అవకాశం వస్తుంది. దీనివల్ల రైతులకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ పద్ధతిలో కట్టడం వల్ల కాలుష్యానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్లాంటుతో పాటు బైప్రొడక్ట్‌ కింద హైక్వాలిటీ ప్రోటీన్‌ పశువుల దాణా, చేపల మేత, కోళ్ల దాణా వంటి ఫీడ్‌ అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి మేళ్లు జరుగుతాయి. 

రాష్ట్రానికి మరో గొప్ప మేలు ఏంటంటే...
మన రాష్ట్రానికి మరీ ముఖ్యంగా జరిగే మరో గొప్ప మేలు ఏమిటి అంటే.. సీపీ గుర్నానీ గారికి  కేవలం ఆరునెలల కాలంలోనే ఇంత వేగంగా, సానుకూలంగా భూములు కేటాయించడంతో పాటు ఇంత వేగంగా అన్ని అనుమతులు ఇప్పించాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీ ఒక ఉదాహరణగా ఉంది అన్న మాట ఆయన మనసుకి ఇప్పుడు తెలిసింది.  కాబట్టి ఆయన రక రకాల పెద్దల దగ్గర, రకరకాల ఫోరమ్‌ల దగ్గర మన రాష్ట్రంలో జరుగుతున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి ప్రస్తావించే అవకాశం, పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ పరిశ్రమలు గుర్నానీ గారి ద్వారా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ  పరిస్థితులు నన్ను ఇక్కడికి రావడానికి ప్రేరేపించాయి.

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో.... 
గుర్నానీ గారికి  నా విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి అంశంలోనూ మేం మీకు తోడుగా ఉంటాం. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటామన్న విషయాన్ని మనసులో పెట్టుకొండి. మరీ ముఖ్యమంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, తద్వారా మా పిల్లలకు మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి మీరు అంబాసిడర్‌లా ఉండండి.  మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. 

 కాసేపటి కిందట ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ ఏలూరు కుడికాలువ నిర్మాణానికి సంబంధించి దాదాపు రూ.50 కోట్లు అవుతుందన్నారు. ఈ పనులకు అనుమతులను ఈ వేదిక మీద నుంచే మంజూరు చేస్తున్నాను. తద్వారా 15వేల ఎకరాల ఆయుకట్టుకు నీళ్లంది రైతులకు మంచి జరుగుతుంది. రైతులు, ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రహదారులు మరియు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top