గురుపూజోత్స‌వంలో పాల్గొన‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నేడు విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపూజోత్సవం

176 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం

విజ‌య‌వాడ‌:  భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించి సన్మానిస్తారు.

పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ తెలిపారు.

   
మంత్రి బొత్స గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తారని, అటువంటి వారిని గురుపూజోత్సవం రోజు సన్మానించుకోవడం ముదావహమని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు.    

తాజా వీడియోలు

Back to Top