తాడేపల్లి: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతుభరోసా నిధులు నేడు విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి.. నిధుల్ని జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. సాంకేతిక కారణాలతో నిన్న జరగాల్సిన కార్యక్రమం.. నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో.. 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం పంపిణీ చేస్తోంది. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇది. ఇప్పటివరకు.. రాష్ట్రంలో భూ యజమానులకు వైయస్ఆర్ రైతు భరోసా కింద ఏటా.. రూ.13,500 చొప్పున(6వేలు కేంద్రం, 7,500 రాష్ట్ర ప్రభుత్వం) పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది. ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది(నేటి సాయంతో కలిపి). ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించినట్లు అవుతుంది.