వీలైనంత త్వరగా ప్రజలకు పోల‌వ‌రం ఫ‌లాలు 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు పెరుగుతుంది

సవరించిన వ్యయ అంచనాల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వండి

భారీగా నిర్వాసిత కుటుంబాలు, ముంపు ఇళ్ల సంఖ్య 

భూ సేకరణ, పునరావాసం వ్యయం భారీగా పెరిగింది

కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియను ప్రారంభించండి

వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేలా చర్యలు తీసుకోండి

ఏపీ సమగ్రాభివృద్ధికే 3 రాజధానుల నిర్ణయం

న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు పెరిగిపోతుందని తెలిపారు. సవరించిన అంచనా వ్యయం మేరకు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సీఎం వినతిపత్రం అందచేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ రాత్రి 8.35 నుంచి 9.40 గంటల వరకు అమిత్‌ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వైయ‌స్సార్‌ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైయ‌స్‌ అవినాష్రెడ్డి, మార్గాని భరత్‌ ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి నివాసానికి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చర్చించిన అంశాలు ఇవీ..   

పోలవరం వ్యయాన్ని ఆమోదించాలి
సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని, ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు సూచించాలని ముఖ్యమంత్రి కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనుల ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. నిర్వాసిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని, ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. భూసేకరణ, పునరావాసం ఖర్చు గణనీయంగా పెరిగిందని వివరించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.   

కోవిడ్‌ కట్టడిపై.. 
కోవిడ్‌ సమయంలో వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూనే జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సమతుల్యత పాటిస్తూ ముందుకుసాగామన్నారు. వివిధ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న తీరును వివరించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయడానికి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, అత్యంత కీలకమైన కోల్డ్‌చైన్ల ఏర్పాటు చేసి సమాయత్తంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు.  కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చిందని, దీనికోసం నిర్దేశించిన మార్గదర్శకాల అమల్లో భాగంగా కేంద్ర విద్యుత్‌ శాఖ సర్టిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉందని, ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేసేలా సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.  

ప్రత్యేక హోదా ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర హోంమంత్రిని కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.   

బకాయిల చెల్లింపులపై.. 
2013–14 నుంచి 2018–19 వరకు సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం చెల్లించాల్సిన రూ. 1,600 కోట్లు వెంటనే విడుదయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. 2020 ఏప్రిల్‌ నుంచి సెపె్టంబరు వరకూ రాష్ట్రానికి రూ.4,308.46 కోట్ల మేర జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు బకాయిపడ్డ రూ.1,111.53 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. 15వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన గ్రాంట్ల బకాయిలు రూ.1,954.5 కోట్లను కూడా విడుదల చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఉపాధి హామీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.3,801.98 కోట్లను విడుదల చేయాలని కోరారు.   

వైద్య కళాశాలలకు అనుమతులివ్వాలి
రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 వైద్య కళాశాలల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ కళాశాలలు చాలా కీలకమని వివరించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  

బిల్లుల ప్రక్రియ పూర్తి చేయండి
మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు తెచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులు ఆమోదం పొందేలా ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సీఎం కోరారు. ఈ బిల్లులను ఇప్పటికే పంపామని వివరించారు. సమగ్ర భూ సర్వేకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించే ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌ 21న రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతోందని తెలియచేశారు.   

నివర్‌ తుపాను నష్టాలపై.. 
రాష్ట్రంలో భారీ వర్షాలు, తుపాన్ల వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి నివేదించారు. తగిన విధంగా సహాయం అందించాలని కోరారు. పంట నష్టంపై కేంద్ర బృందం ఇప్పటికే పరిశీలన చేసిందని, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.   

మూడు రాజధానులకు మద్దతు ఇవ్వండి
పాలనా వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ ఆగస్టులో చట్టం కూడా చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.  

Back to Top