స్టీల్ ప్లాంట్‌పై విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీతో కలిసిరావాలి

ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను
 

విజ‌య‌వాడ‌:  విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీతో కలిసిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. 

  స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top