144 ఆక్సిజన్‌ ప్లాంట్లు జాతికి అంకితం

రూ.426 కోట్ల వ్యయంతో 144 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాం

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేర్పిన పాఠాలతో మెరుగైన అడుగులు వేశాం

50 పడకల ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం

100 పడకలు ఉన్న 71 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ

రాష్ట్ర వ్యాప్తంగా 176 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశాం

రూ.90 కోట్ల వ్యయంతో 24,419 బెడ్స్‌కు సంబంధించి ఆక్సిజన్‌ పైపులైన్లు ఏర్పాటు

183 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ సపోర్టు బెడ్స్‌తో కూడిన 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్స్‌

ఒమిక్రాన్‌ వైరస్‌ నిర్దారణ కోసం జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం

దేశంలో కేరళ తరువాత మన రాష్ట్రంలోని విజయవాడలోనే ఈ ల్యాబ్‌ ఏర్పాటైంది

 మొత్తం 74 ఎల్‌ఎంఓ ట్యాంకులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాం

33 సార్లు డోర్‌ టు డోర్‌ సర్వేలు పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం

వ్యాక్సినేషన్‌లోనూ అగ్రగామిగా నిలిచినందుకు సంతోషంగా ఉంది

ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ ట్యాంకులను విమానాల్లో, షిప్పుల్లో తెచ్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితిని చూశాం. అటువంటి పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆక్సిజన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ల కొరత రాకుండా మెరుగ్గా అడుగులు వేశాం. రూ.426 కోట్లు ఖర్చు చేసి నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 పీఎస్‌ఏ ప్లాంట్లను నెలకొల్పాం. ఈరోజు వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం, హెల్త్, ఎడ్యుకేషన్‌ ఈ మూడింటిలో అభివృద్ధి ప్రస్పుటంగా కనిపించేలా అడుగులు వేశామన్నారు. 144 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లతో సహా క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్‌ పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

‘‘రాష్ట్ర వ్యాప్తంగా 144 పీఎస్‌ఏ సొంతంగా ఆక్సిజన్‌ తయారు చేసుకునే ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో 32 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేయడం జరిగింది. 144 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పి జాతికి అంకితం చేస్తున్నాం. 

దాదాపుగా ప్రతి 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా జగనన్న ప్రాణవాయువు కార్యక్రమం ద్వారా ఆక్సిజన్‌ జనరేట్‌ చేసే పరిస్థితిలోకి మనం తీసుకున్న చర్యలు ఫలాలు ఇస్తున్నాయి. ఇవేకాకుండా 100 పడకలుపై చిలుకు ఉన్న 71 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ సొంతంగా జనరేట్‌ చేసే పీఎస్‌ఏ ప్లాంట్లను నెలకొల్పడానికి 30 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ చేయూతనిస్తున్నాం. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.. ఇవి కూడా పూర్తయితే అక్షరాల 247 చోట్ల ఆక్సిజన్‌ సొంతంగా జనరేట్‌ చేసే కెపాసిటీ ఉంటుంది. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

కోవిడ్‌ సమయంలో మనమంతా గమనించాం. ఆక్సిజన్‌ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో సెకండ్‌ వేవ్‌లో చూశాం. కోవిడ్‌ కారణంగా వైరస్‌ ప్రభావం నేరుగా శ్వాస, ఊపిరితిత్తుల మీద ఏరకంగా చూపిందో.. ఆ పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్‌ కొరత వచ్చినప్పుడు ఏరకమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో గమనించాం. 

సెకండ్‌ వేవ్‌లో నేర్చుకున్న పాఠాల నుంచి అటువంటి పరిస్థితి మనకు రాకూడదని చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు మెరుగైన పరిస్థితికి అడుగుపెట్టాం. సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ ట్యాంకులను విమానాల్లో తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. క్రయోజనిక్‌ ట్యాంకుల్లో ఆక్సిజన్‌ను విదేశాల నుంచి విమానాలు, షిప్పుల్లో తెచ్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితిని చూశాం. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం  అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంచేందుకు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని ఆస్థాయికి తీసుకెళ్లేందుకు, ఆక్సిజన్‌ కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. 

రూ.426 కోట్లు ఖర్చు చేసి నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 పీఎస్‌ఏ ప్లాంట్లను ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాం. ఇటీవల ప్రారంభించిన 32 ప్లాంట్లకు అదనంగా 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో కలిసి మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 176 పీఎస్‌ఏ ప్లాంట్లను ప్రారంభించుకున్నట్లు అవుతుంది. రెండు సంవత్సరాల కాలంలో ఒకవైపు కోవిడ్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నప్పటికీ.. మరోపక్క ప్రజలు ఇబ్బందులు పడకూడదని సంక్షేమ పథకాలు అందిస్తూ.. నాడు–నేడు అనే బృహత్తర కార్యక్రమంతో మన ఆస్పత్రులు, స్కూళ్లు, వ్యవసాయ రంగంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలు స్థాపించడం దగ్గర నుంచి.. వ్యవసాయం, హెల్త్, ఎడ్యుకేషన్‌ ఈ మూడింటిలో అభివృద్ధి ప్రస్పుటంగా కనిపించేలా అడుగులు వేశాం. 

మరీ ముఖ్యంగా వైద్యరంగంలో ఏరకంగా అడుగులు వేశామో ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొత్తగా నెలకొల్పే పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు ఆస్పత్రుల్లో సివిల్, ఎలక్ట్రికల్‌ పనులతో పాటు అవసరమైన ఇతర మరమ్మతులు అన్నీ కూడా కోవిడ్‌ సమయంలో జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) రవాణా, నిల్వ కోసం రూ.15 కోట్లతో 20కేఎల్‌ సామర్థ్యం గల 25 క్రయోజనిక్‌ కంటైనర్లు కొనుగోలు చేశాం. అవసరమైనప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో 24,419 బెడ్స్‌కు సంబంధించి ఆక్సిజన్‌ పైపులైన్లు ఏర్పాటు చేశాం. రూ.31 కోట్ల వ్యయంతో 399 కిలోలీటర్ల సామర్థ్యం గల 35 ఎల్‌ఎంఓ ట్యాంకులు, 390 కిలోలీటర్ల సామర్థ్యం గల 39 ఎల్‌ఎంఓ ట్యాంకులు కలిపి మొత్తం 74 ఎల్‌ఎంఓ ట్యాంకులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాం. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో, సెకండ్‌ వేవ్‌ నుంచి నేర్చుకున్న గుణపాఠంతో వైరస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. 

మరో రూ.64 కోట్లతో 183 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మౌలిక సదుపాయలు మెరుగుపరుస్తూ ఆక్సిజన్‌ సపోర్టు బెడ్స్‌తో కూడిన 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఇంకా అవసరం ఏదైనా వస్తుందేమోనని మరో రూ.8 కోట్లు మంజూరు చేశాం. 230కిలోలీటర్ల సామర్థ్యం గల 23 ఎల్‌ఎంఓలకు అనుమతులిచ్చాం. 74 ఎల్‌ఎంఓ ట్యాంకులకు అదనంగా 23 అందుబాటులోకి వస్తాయి. 

గతంలో రాష్ట్రంలో కనీసం ఒక్క వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ లేని దుస్థితి ఉండేది. కోవిడ్‌ మొదలైనప్పుడు శాంపిల్స్‌ హైదరాబాద్, పూణె పంపించే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు సైతం చేయగల 20 ఆధునిక వైరల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోగలిగాం. వీటికి అదనంగా మరో 19 ల్యాబ్‌లు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్రమంతటా ట్రూనాట్‌ ల్యాబ్‌లతో సహా కలుపుకుంటే మొత్తం 150 ల్యాబ్‌లు సేవలు అందిస్తున్నాయి. వీటి ఆధారంగా లక్ష మందికి టెస్టు చేసే పరిస్థితి ఉంది. ఇందులో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు దాదాపు 70 వేల మందికి చేయగలిగే స్థితిలో ఉన్నాం. 

ఒమిక్రాన్‌ వైరస్‌ నిర్దారణ కోసం జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. ఆ ల్యాబ్‌ అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో కేరళ తరువాత మన రాష్ట్రంలోని విజయవాడలోనే ఈ ల్యాబ్‌ ఏర్పాటైంది. ఇది చరిత్రాత్మక అడుగు. కోవిడ్‌ వేరియంట్లను గుర్తించే గొప్ప ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. 

18 ఏళ్లకు పైబడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,21,13,722 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇందులో రెండు డోసులు 3,14,01,740 మంది అంటే 80 శాతం మందికి వేయగలిగాం. 15–18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు తెలియజేసిన తరువాత 24.41 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంటే.. ఇప్పటికే మన రాష్ట్రంలో 20,02,281 మందికి అంటే 82 శాతం మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తిచేశాం. దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. 

విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోవడంతో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలన్నీ కూడా మన రాష్ట్రంలో లేకుండాపోయాయి. చాలా ఇబ్బందులుపడే పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో బ్రహ్మాండమైన గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్లు, విలేజ్‌ క్లినిక్స్‌ వ్యవస్థలు క్రియేట్‌ చేయడం వల్ల దాదాపుగా డోర్‌ టు డోర్‌ సర్వేలు 33 సార్లు పూర్తిచేసి.. ఏ ఒక్కరికీ సిమ్‌టమ్స్‌ ఉన్నా.. ఎర్లీ ట్రేసింగ్, ఎర్లీ టెస్టింగ్, ఎర్లీ ట్రీట్‌మెంట్‌తో కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో దేశానికి ఆదర్శంగా మన ఆరోగ్య శాఖ ఉంది. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు. 

గ్రామస్థాయిలో వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం అవుతున్నాయి. 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నాం. కొత్తగా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు అన్నీ నాడు–నేడుతో మార్పు చెందుతున్నాయి. 104, 108 వాహనాలు మన కళ్లముందే తిరుగుతున్నాయి. మరో 16 నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలు నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని పూర్తిగా పెంచి.. 2,434 వ్యాధులకు వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. వైద్యం కారణంగా పేదవారు అప్పులపాలు కాకుండా చూస్తున్నాం. వైయస్‌ఆర్‌ఆరోగ్యశ్రీ కాకుండా.. వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కూడా తీసుకువచ్చి వైద్యం అనంతరం విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చి తోడుగా నిలబడుతున్నాం. వైద్య, ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకువస్తున్నాం. 

ప్రతి ఆస్పత్రిలో ఎంతమంది డాక్టర్లు, నర్సులు ఉండాలో వారంతా అందుబాటులో ఉండాలని చెప్పి ఫిబ్రవరి నాటికి 39 వేల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 23 వేల మందిని భర్తీ చేశాం. 15 వేల ఏఎన్‌ఎంలు గ్రామసచివాలయాల్లోనే కనిపిస్తున్నారు. 10 వేల డాక్టర్లు, నర్సులు ఇప్పటికే రిక్రూట్‌ అయ్యారు. మిగిలిన పోస్టులను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిగా భర్తీ చేస్తాం. వైద్య, ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వాలని, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ.. అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు, అవ్వాతాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను''. 
 

తాజా వీడియోలు

Back to Top