మీ బిడ్డగా.. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటా

రూ.515 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధికి శ్రీకారం చుట్టాం

30 నెలల పాలనలో ప్రొద్దుటూరు ప్రజలకు రూ.326 కోట్లు అందించాం

22,212 మందికి ఇంటి స్థలాల సేకరణ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశాం

నూతన ఉర్దూ డిగ్రీ కాలేజీ, వెల్లాల ఆంజనేయస్వామి టెంపుల్‌ అభివృద్ధి చేస్తాం

వర్షాలు, వరదలతో చనిపోయినవారి కుటుంబాలకు తోడుగా ఉంటా

ప్రొద్దుటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రొద్దుటూరు: ’’నాన్న చనిపోయిన నాటి నుంచి ఈరోజు వరకూ కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. ప్రతి ఇంట్లోని అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా దీవించారు, ఆశీర్వదించారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడన్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయగలుగుతున్నాడన్నా.. దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే.. మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సువంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ప్రొద్దుటూరుకు రావడం, ప్రజలందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చెప్పారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
ప్రొద్దుటూరు నియోజకవర్గ అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ముళ్లకు ఈ 30 నెలల  నవరత్నాల పాలనలో డీబీటీ పద్ధతిలో ఎటువంటి రాజకీయ ప్రమేయం, లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్షరాల రూ.326 కోట్లు బదిలీ చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ప్రొద్దుటూరు నగరం పెద్దది అవుతుంది.. ఇళ్లు లేనివారు చాలామంది ఉన్నారు.. ఇంటి స్థలాల కోసం ఇక్కట్లు పడుతున్నవారికి స్థలాలు ఇవ్వడానికి దాదాపు 500 ఎకరాలు కావాల్సిన పరిస్థితి. 22 వేల పైచిలుకు మంది ఇంటిస్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి స్థలాల సేకరణ కోసం రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పినా.. వెనకడుగు వేయకుండా చిరునవ్వుతోనే మంజూరు చేశాను. అక్షరాల 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. వీరిలో మొదటి దఫా కింద 10,820 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం మరో పది రోజుల్లో ప్రారంభమవుతుంది. 

రకరకాల కోర్టు కేసుల మధ్య అన్నీ పరిష్కరించుకొని ప్రొద్దుటూరు, పులివెందులలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నాం. రాష్ట్రంలోని అందరికీ సంక్షేమ పథకాలు, ఫలాలు ఇవ్వడమే కాకుండా.. మీ అన్నగా ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈరోజు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాం. 

ప్రొద్దుటూరులో తాగునీటి సరఫరా కోసం 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా పైపులైన్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మైలవరం నుంచి నీరు తీసుకురావడమే కాకుండా.. ఆ నీటిని పైపులైన్‌ల ద్వారా నగరంలోని ప్రతి కుటుంబానికి సరఫరా చేయాలని అక్షరాల రూ.119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పైపులైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 171 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ల ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయవచ్చు. 

డ్రైనేజీ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరిస్తున్నాం. దీని కోసం అక్షరాల మరో రూ.163 కోట్ల వ్యయంతో ఈరోజు పనులు చేపడుతున్నాం. 8.87 కిలోమీటర్ల పొడవైన సిమెంట్‌ కాంక్రీట్‌డ్రైన్లు, రోజుకు 24 వేల ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా నిర్మిస్తున్నాం. సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా ఏకంగా థర్డ్‌ స్టేజ్‌ ట్రీట్‌మెంట్‌ చేసి నీరు వేస్టుకాకుండా.. తిరిగి ఉపయోగించుకునే విధంగా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రొద్దుటూరుకు మంజూరు చేస్తూ ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  

ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఆర్‌టీపీపీ, స్టీల్‌ప్లాంట్, కొత్తగా నిర్మించిన హౌసింగ్‌ కాలనీలను వేగంగా చేరుకునేందుకు పెన్నా నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి అక్షరాల రూ.53 కోట్లతో శంకుస్థాపన చేశాం. వంతెన వల్ల 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఉపయోగపడుతుంది. 

ప్రొద్దుటూరు బస్‌స్టేషన్‌ అభివృద్ధి కోసం రూ.4.5 కోట్ల వ్యయంతో కొత్తగా 9 ప్లాట్‌ఫామ్‌లు, భవన నిర్మాణం, ప్రయాణికులు రాత్రివేళ బస చేసేందుకు వీలుగా డామెట్రీలు, మంచి బాత్‌రూంలు, బస్టాండ్‌ ప్రాంతంలో లైటింగ్, డిజిటల్‌ అడ్వటైజ్‌మెంట్‌ బోర్డులు, పక్కా డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈరోజు శంకుస్థాపన చేశాం. 

ఇంతకు ముందున్న కూరగాయల మార్కెట్‌ ఇప్పటి ప్రొద్దుటూరు అవసరాలకు సరిపడా లేనందున కొత్తగా కూరగాయల మార్కెట్‌ కోసం అక్షరాల రూ.50.90 కోట్ల వ్యయంతో 2.34 ఎకరాల సువిశాల స్థలంలో 40 రూములతో కూరగాయల మార్కెట్‌ చేపడుతున్నాం. కనీసం 252 మంది చిన్న తరహా వ్యాపారులు, 30 మంది టోకు వ్యాపారులు, మరో 30 కిరాణాషాపులలతో పాటు 35 మంది చిరువ్యాపారుల కార్యక్రమాల కోసం అనువుగా మార్కెట్‌ను నిర్మిస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థతో కూడా మెరుగుపరుస్తూ కొత్త కూరగాయల మార్కెట్‌తో అన్ని రకాలుగా ప్రజలకు మంచి జరుగుతుంది. 

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రూపురేఖలు మార్చేందుకు రూ.24 కోట్లను మంజూరు చేశాం. మంచి టాయిలెట్లు, మంచి డ్రింకింగ్‌ వాటర్, మంచి ప్రహరీ, మంచి ఫర్నిచర్, సెమినార్‌ హాల్స్, డిజిటల్‌ లైబ్రరీలు, మంచి ల్యాబులు, అదనంగా తరగతి గదులు కూడా రాబోతున్నాయి. 

యోగి వేమన యూనివర్సిటీకి చందిన వైయస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని ఇంతకుముందు ఎవరూ పట్టించుకోలేదు. పేరుకు గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ.. కానీ అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ రూ.66 కోట్లు ఇంజినీరింగ్‌ కాలేజీ అభివృద్ధి మంజూరు చేశాం. మంచి టాయిలెట్లు, ల్యాబ్స్, డ్రింకింగ్‌ వాటర్, గ్రీన్‌బోర్డులు, ఫర్నిచర్, సెంట్రల్‌ లైబ్రరీలు రాబోతున్నాయి. 

ప్రొద్దుటూరు నగరంలో మరో రూ.15 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. సీసీ రోడ్లు, డ్రైన్‌ల నిర్మాణం, కల్వర్ట్‌ల నిర్వహణ, ఆర్‌ఓ ప్లాంట్‌ షెడ్లు, పార్కుల అభివృద్ధి, వాణిజ్య సముదాయ నిర్మాణం, మెరుగైన నీటి సరఫరా వంటి పనులతో పాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆదాయం పెంచుకోవడం కోసం పెట్రోల్‌ బంకు కూడా మంజూరు చేశాం. 

ప్రొద్దుటూరులో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.20.50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తం రూ.515 కోట్లతో ప్రొద్దుటూరు నగరంలో పనులకు శంకుస్థాపన చేశామని మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 

ఉర్దూ డిగ్రీ కాలేజీ, వెల్లాలలో ఆంజనేయస్వామి టెంపుల్‌ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అడిగారు. ఈ రెండూ మంజూరు చేస్తున్నామని మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనసు పెట్టి చేస్తున్నాం. మీ బిడ్డను, ఇక్కడున్న సమస్యలు, పరిస్థితులు పూర్తిగా తెలిసిన వ్యక్తిని, అన్ని రకాలుగా మీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని మాటిస్తున్నా. 

గత నెలలో అన్నమయ్య సాగర్, పించా రిజర్వాయర్లు తెగిపోయినందు వలన ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఎంతో బాధ అనిపించింది. జిల్లా వాసిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక్కమాట చెబుతున్నా.. చనిపోయిన కుటుంబాలకు మనుషులను అయితే తెప్పించలేను కానీ, ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాను. ఆ కుటుంబసభ్యుడిగా ఉంటానని వారికి భరోసా ఇస్తున్నా. 

మంచి పనులకు శ్రీకారం చుడుతున్నందుకు దేవుడు నాకిచ్చిన ఈ అవకాశానికి సదా కృతజ్ఞుడిగా ఉంటాను. ఇంకా మంచిచేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు శిరస్సువంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top