రైతు సంక్షేమమే మా లక్ష్యం 

రైతుభరోసా ద్వారా రూ.10,209 కోట్లు రైతులకు ఇవ్వగలిగాం

రైతుభరోసా కేంద్రాల ప్రారంభంతో విప్లవాత్మక మార్పు మొదలు

పంట వేసే సమయం నుంచి కోత కోసే సమయం వరకు తోడుగా ఉంటాం

ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

పోలవరం పనులు పరుగులు పెట్టిస్తాం.. 2021 చివరికల్లా పూర్తిచేస్తాం

కోవిడ్‌ టైమ్‌లో పంటల కొనుగోళ్లకు రూ.1100 కోట్లు ఖర్చు చేశాం

8 నెలల్లో రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు

గత ప్రభుత్వ బకాయిలు కూడా తీర్చుతూ రైతులకు తోడుగా ఉన్నాం

అగ్రికల్చర్‌పై మేధోమథన సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘రైతులు, రైతు కూలీలు సంతోషంగా ఉండాలని నమ్మిన వ్యక్తిని నేను. అన్నదాతల బాధలను నా పాదయాత్రలో కళ్లారా చూశా. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే అప్పుడే నిర్ణయించుకున్నా.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా.’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది కాలంలో మన ప్రభుత్వ పనితీరు చూస్తే ఎవరికైనా ఇది రైతు రాజ్యమని అర్థం అవుతుందన్నారు. మేనిఫెస్టోను కూడా రైతును దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశాం. రైతుకు పంట వేసే సమయంలో ఖర్చును తగ్గించగలిగితే.. ఆ రైతు లాభాలబాట పడతాడని గట్టిగా విశ్వసించి వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతకు తోడుగా నిలిచాం.. అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. పంట వేసే సమయం నుంచి పంట కోతకు వచ్చే వరకు అన్ని విధాలుగా ఆ రైతన్నకు తోడుగా నిలబడేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఈ నెల 30వ తేదీన ప్రారంభించబోయే రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు మొదలవుతుందన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్‌పై సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన మేధోమథన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘాల ప్రతినిధులు, నిపుణులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు.. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం మున్ముందు చేయబోయే కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

నా 3648 సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి జిల్లా తిరిగా.. దాదాపు 134 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రైతులు పడుతున్న ఇబ్బందులు నా కళ్లతో నేను చూశా.. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఏమేమి చేయాలనే దృక్పథం, మనసు నిండా ఆ ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం.. మేనిఫెస్టో కూడా రైతును మనసులో పెట్టుకొని రూపొందించాం. 
రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలంటే.. రైతు నష్టపోకూడదు. ఇది ప్రధానమైన అంశం. రైతు లాభపడేలా వ్యవసాయాన్ని ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. రైతుకు ప్రధానంగా మూడు సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటాడు. 

రైతు పంట వేసేటప్పుడు ఖర్చు మనం తగ్గించగలుగుతే.. ఆ రైతు లాభాలబాట పడుతాడని గట్టిగా విశ్వసించి రైతు ఖర్చును ఎలా తగ్గించాలనే ఆలోచనతో మొదట అన్ని ప్రణాళికలు చేశాం. 

రైతుకు అనుకోనిది జరిగితే.. ఏదైనా వరదలు, కరువు వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో రైతుకు నష్టం జరగకుండా ఎలా కాపాడాలని రెండవ ఘట్టంగా ఆలోచన సాగింది. అన్ని కష్టాలను రైతు దిగమింగుకొని, పంట వేసిన తరువాత పంట చేతికి వచ్చిన తరువాత ఆ పంటను రైతు అమ్ముకోలేని పరిస్థితిలో.. గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుందని మనందరికీ తెలుసు. 

ఈ మూడు అంశాలను అధిగమిస్తేనే వ్యవసాయం ఒక పండుగగా.. రైతు లాభాల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు అంశాలను ఎలా అధిగమించాలనే ఆలోచనలతోనే మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి కదళిక సాగింది. 

పంట వేసేటప్పుడు రైతుకు ఎలా తోడుగా ఉండాలని మొదటి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో చూస్తే దాదాపు 50 శాతం మంది రైతులు అర హెక్టార్‌ భూమి ఉన్నవారే. 50 శాతం మంది రైతులు 1.25 ఎకరాలలోపే భూమి విస్తీర్ణం కలిగినవారే ఉన్నారు. ఒక హెక్టార్‌ వరకు ఎంత మంది ఉన్నారని గమనిస్తే ఆ సంఖ్య 70 శాతానికి పోతుంది. అంటే 70 శాతం మంది కేవలం ఒక హెక్టార్‌లోపే భూమి కలిగిన వారు ఉన్నారు.  

రైతు పంట వేసేటప్పుడు ఆ రైతుకు అయ్యే పంట ఖర్చు ఎంత..? ఆ ఖర్చును ఏమేరకు రైతుకు మనం ఇవ్వగలిగితే అన్నదాత నష్టపోయే అవకాశాలు తగ్గుతాయనే ఆలోచనతోనే అడుగులు ముందుకుపడ్డాయి. దాదాపుగా1.25 ఎకరాలలోపు ఉన్న 50 శాతం మంది రైతులను గమనిస్తే.. మనం ఇచ్చే వైయస్‌ఆర్‌ రైతు భరోసా సొమ్ము రూ.13,500 దాదాపు 80 శాతం పంటలకు మేలు జరుగుతుంది. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో రూ.12,500 నగదు 4 ఏళ్ల పాటు కలిపి రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. 

అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఏం మేలు చేయాలనే ఆలోచనతోనే అడుగులు ముందుకువేశాం. నాలుగేళ్ల అని చెప్పాం కదా.. మొదటి సంవత్సరం కాదు కదా అని వదిలివేయలేదు.. రూ.12,500 అని చెప్పాం కదా అని అదీ వదిలేయలేదు. చెప్పినదానికంటే ముందుగా నాలుగేళ్లు చెబితే ఐదేళ్లు ఇచ్చేట్లుగా.. మాటిచ్చింది రూ.12,500 అయితే ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా.. ఐదేళ్ల పాటు రూ.67,500 రైతుల చేతుల పెట్టే కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నాం. 

రైతుకు ఇచ్చే సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడేలా ఉండాలి. పంట వేసే సమమానికి ఆ రైతు విత్తనం కొనుగోలు చేసేందుకు, వ్యవసాయ ఖర్చుల కోసం రూ.7500 మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖరీఫ్‌ పంట కోయడం కోసం, రబీ పంట వేసేందుకు ఏరకంగానైనా రైతుకు మళ్లీ ఉపయోగపడేలా ఉండేందుకు మళ్లీ అక్టోబర్‌ మాసంలో రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ధాన్యం ఇంటికి చేరేవేళ సంక్రాంతి సందర్భంగా మరో రూ. 2 వేలు రైతులకు ఇచ్చే విధంగా కార్యాచరణ చేశాం. రైతుకు ఇచ్చే సొమ్ము రూ.13500 ఇవ్వాల్సిన సమయంలో ఇస్తే.. పెట్టుబడి ఖర్చు తగ్గి.. రైతు లాభాలబాట పడుతాడు.. అప్పులపాలు అయ్యే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

జూన్‌లో అధికారం చేపట్టాం.. అప్పటికే మే మాసంలో అయిపోయింది కాబట్టి రబీ పంటకైనా ఇవ్వాలని అక్టోబర్‌లోనే రైతుభరోసా సాయం అందించాం. దాదాపు 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019–20 సంవత్సరంలో రైతు భరోసా కింద రూ.13500 రైతులకు ఇచ్చాం. రూ.6,534 కోట్లను రైతు అకౌంట్లలో జమ చేయగలిగాం. ఆ డబ్బు బ్యాంకులు రైతుకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోకుండా బ్యాంకర్స్‌తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాలో వేశాం.

2020–21లో మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద రూ.7,500 జమ చేశాం. దాదాపు మరో రూ.3,670 రైతుల ఖాతాల్లో జమ చేశాం. సంవత్సరం కూడా పూర్తికాక ముందే రైతులకు మనం ఇచ్చింది రూ.10,209 కోట్లు రైతుభరోసా ద్వారా రైతులకు ఇవ్వగలిగాం. రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా పెట్టుబడి సాయంగా అందేలా బ్యాంకర్స్‌తో మాట్లాడి రైతులకు ఈ సొమ్ము ఇవ్వగలిగాం..
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏకంగా రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆ ప్రభుత్వం.. ఐదు సంవత్సరాల్లో రైతులకు ఎంత ఇచ్చిందని చూస్తే.. రైతులకు రూ.15 వేల కోట్లు కూడా చెల్లించలేదు. అలాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తికాలేదు.. అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లో రూ.10,209 కోట్లను దేవుడి దయతో జమ చేయగలిగాం. 

రైతు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా తీసుకువచ్చాం. 2012–13 సంవత్సరంలో శనగలకు సంబంధించిన పంట బీమా మనం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 112 కోట్లు రైతులకు అందజేయగలిగాం. 

ఇన్సూరెన్స్‌ కంపెనీలు డబ్బులు తీసుకోవడంలో ముందుంటున్నాయి.. డబ్బులు ఇచ్చేటప్పుడు వారి చేయ్యి  ముందుకురాని పరిస్థితి. దీన్ని పూర్తిగా అధిగమించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం నడిపేట్లుగా అడుగులు ముందుకువేశాం. ఈ సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తున్నాం. రైతు కేవలం ఈక్రాపింగ్‌ చేసి రూపాయి కడితే చాలు రైతుల తరుఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లించింది. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దాదాపుగా రూ.1270 కోట్లు ప్రభుత్వం తరుఫున ప్రీమియం చెల్లిస్తున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ప్రభుత్వమే నడిపే విధంగా అడుగులు వేస్తున్నాం.

పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు సాయం అందాలి. ఖరీఫ్‌లో నష్టపోయిన సొమ్ము రబీ వరకు ఇవ్వగలిగితే.. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ రూపంలో ఇచ్చి రైతును ఆదుకోగలిగితే.. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ అనే పదానికి అర్థం ఉంటుంది. రైతు పెట్టుబడి ఖర్చు తగ్గించడంలో భాగంగా పంట రుణాలకు సంబంధించిన వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకువచ్చాం. గత ప్రభుత్వంలో రైతుల తరుఫున సున్నావడ్డీ కట్టే ఆలోచన ఎప్పుడూ లేదు. 

సున్నావడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతుల తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 2 వేల కోట్లు ఈ జూలైలో కట్టబోతున్నాం. 

రైతులకు ఉచితంగా బోర్డుల వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఖరీఫ్‌ నుంచి ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు టెండర్లు పిలవమని అధికారులకు చెప్పాం. ఈ ఖరీఫ్‌లో ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్‌వెల్‌ అందుబాటులోకి తీసుకువచ్చి.. ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

ఇంకా ఏం చేస్తే రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని ఆలోచన చేస్తూనే ఉన్నాం. అప్పుట్లో నాన్నగారి హయాంలో ఉచితంగా రైతులకు విద్యుత్‌ ఇచ్చి తోడుగా ఉండాలని ఆలోచన చేశారు. ఆ తరువాత అది నీరుగారిపోతూ వచ్చింది. రైతుకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్‌ ఇస్తే ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తే ఆశ్చర్యకరమైన సంఖ్య కనిపిస్తుంది. మన రాష్ట్రంలో 18.30 లక్షల మోటర్లు ఉన్నాయి. యావరేజ్‌ హార్స్‌పవర్‌ ఎంతా అని చూస్తే.. సుమారు ఏడున్నర హార్స్‌పవర్‌ మోటర్లు యావరేజ్‌గా కనిపిస్తాయి. ఏడున్నర హార్స్‌పవర్‌ కలిగిన మోటర్‌ గంట ఆన్‌ చేస్తే.. 5 యూనిట్లు కాలుతుంది. తొమ్మిది గంటలు పనిచేస్తే 45 యూనిట్లు విద్యుత్‌ కాలుతుంది. సంవత్సరంలో ఎన్ని రోజులు వాడుతారని లెక్కలు చూస్తే దాదాపుగా 150 లేదా 160 రోజులు కనిపిస్తుంది. 160 రోజులు x 45 యూనిట్లు వేసుకుంటే సంవత్సరానికి 7200 యూనిట్లు. కరెంట్‌ కాస్ట్‌ పర్‌ యూనిట్‌ గవర్నమెంట్‌కు అయ్యే ఖర్చు ఎంత అని చూస్తే..(ఏపీఈఆర్‌సీ అప్రూవ్‌ చేసిన రేట్‌ ట్రాన్స్‌కోకు) 6 రూపాయల 87 పైసలు మాత్రమే. సంవత్సరానికి 7200 యూనిట్ల ఖర్చు అంటే అక్షరాల రూ.49 వేలు ప్రతి రైతు చేతుల్లో పెడుతున్నాం. 

గత ప్రభుత్వం రూ.8,640 కోట్లు బకాయిలు పెట్టేసింది. రైతుల తరుఫున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది. ఆ బకాయిలు మనం కడుతున్నాం. ప్రతి సంవత్సరం రైతులకు దాదాపుగా రూ.8,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఉచిత కరెంట్‌ భారం పడుతున్నా.. ఎట్టిపరిస్థితుల్లో 9 గంటల పాటు ఉచితంగా రైతుల కరెంట్‌ ఇస్తున్నాం. రాత్రిపూట రైతులు పొలానికి వెళ్తే పాములు, తేల్లు కరిచి ఇబ్బందులు పడతారేమోనని రైతులు ఇబ్బందులు పడకూడదని చెప్పి 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 9 గంటల పాటు రైతులకు కరెంటు ఇచ్చే వ్యవస్థ మనకు లేదని ట్రాన్స్‌కోవారు చెప్పారు. పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇవ్వాలంటే ఏకంగా రూ.1700 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఖర్చుపెడితేనే మనకు ఉన్న ఫీడర్లతో కరెంటు ఇవ్వొచ్చని ట్రాన్స్‌కో చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1700 కోట్లు వారికి ఇచ్చి ఉచితంగా 9 గంటలు పగటిపూట కరెంట్‌ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాలని ట్రన్స్‌కోవారిని ఆదేశించాం. 

మొదటి సంవత్సరం 60 శాతం ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగాం. ఎందుకంటే రూ.1700 కోట్లు మనం ఇచ్చాం కాబట్టి. ఈ సంవత్సరం రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఖరీఫ్‌ నాటికి 82 శాతానికి తీసుకుపోతున్నాం. 82 శాతం ఫీడర్లలో ఈ ఖరీఫ్‌లో 9 గంటలు పగటిపూట ఉచితంగా కరెంట్‌ ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 18 శాతం రబీ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కరోనా టైమ్‌లో పనులు చేయలేకపోయామని చెప్పారు. 

ఆక్వారైతులకు మంచి చేయడం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1.50కే యూనిట్‌ కరెంట్‌ ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేశాం. దీని వల్ల 1.02 లక్షల సర్వీసులకు దాదాపు రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 

ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా రైతులకు తోడుగా ఉంటున్నాం. ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేశాం. రూ.2 వేల కోట్లతో మనం సిద్ధంగా ఉంటే.. మరో రూ.2 వేల కోట్లు కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు కట్టుబడ్డాం. అందుకే సెప్టెంబర్‌ 2019 నుంచి జనవరి 2020 వరకు అంటే కేవలం నాలుగు నెలల్లోనే 67,874 మంది రైతులకు పంట నష్టం జరిగితే వాటికి సంబంధించిన సొమ్ము దాదాపు రూ. 55 కోట్లు వెంటనే ఇచ్చేశాం. పంట నష్టం జరిగితే ప్రభుత్వం తోడుగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. 

పండించిన పంటకు కనీస గిట్టుబాటు రాకపోతే రైతు నష్టపోతాడు. ఆ పరిస్థితి రాకూడదని రైతన్నకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉందని భరోసా కల్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జమ్మలమడుగు నియోజకవర్గంలో శనగ రైతులు ఇబ్బందులు పడుతుంటే క్వింటాల్‌కు రూ. 15 వందల చొప్పున ఒక్కో రైతు దగ్గర 30 క్వింటాల్‌ కొనుగోలు చేసే విధంగా ఆ శనగ రైతుల చేతిలో రూ.45 వేలు ఇచ్చేందుకు రూ.300 కోట్లు విడుదల చేశాం. 

రాష్ట్రంలో ఉల్లిధర పెరిగిపోతున్నప్పుడు రైతు బజార్ల ద్వారా ఉల్లిని తక్కువ రేటుకు సప్లయ్‌ చేశాం. దాదాపు 80,522 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి సరఫరా చేశాం. ఒకవైపు కోవిడ్‌ సమస్య.. మరోవైపు పంటలు దేవుడి దయతో విపరీతంగా పండాయి. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్‌లు మూతపడ్డాయి... లారీలు వెళ్లలేని పరిస్థితి... రైతులు పంటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి.. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం నడుం బిగించి కోవిడ్‌ టైమ్‌లో మాత్రమే పంటల కొనుగోలు కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేశాం. కోవిడ్‌ సమయంలోనే దాదాపు 773 మెట్రిక్‌ టన్నుల ఉల్లి, 12 వేల మెట్రిక్‌ టన్నుల అరటి, 1425 మెట్రిక్‌ టన్నుల టమాట, 3,600 మెట్రిక్‌ టన్నుల బత్తాయి కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలిచాం. ఇవే కాకుండా 2,36,136 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశాం. ఇంత వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అరటి, మొక్కజొన్న, అరటి, టమాట, చీనీపండు కొనుగోలు చేశాం. 

దాదాపు రూ.416 కోట్లతో మొక్కజొన్న 2,36,136 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నాం. 50,672 మెట్రిక్‌ టన్నుల కందులను రూ.294 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశాం. ఎన్నడూ లేని విధంగా 1,40,548 మెట్రిక్‌ టన్నుల శనగలను రూ.685 కోట్లతో కొనుగోలు చేశాం. ఒక్క రబీలోనే ఇప్పటి వరకు 19.94 లక్షల మెట్రిక్‌ టన్నుల  ధాన్యం రూ.3,634 కోట్లతో కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన వారం పదిరోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. 64,405 టన్నుల జొన్నలు రూ.164 కోట్లతో కొనుగోలు చేశాం. 6,706 మెట్రిక్‌ టన్నుల పసుపును కూడా చివరకు రూ.46 కోట్లు పెట్టి కొనుగోలు చేశాం. మొత్తంగా 5.60 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాం. 

అధికారంలోకి జూన్‌లో వచ్చాం.. అప్పుడే ఖరీఫ్‌ పంటలు పడ్డాయి.. ఖరీఫ్‌పంట కోతకు వచ్చిన తరువాత ఇప్పటికి 8 నెలల కాలంలో మొత్తంగా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో జరగలేదు. 

ధాన్యం దాదాపు 70 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి దాదాపు రూ.12,677 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల బకాయిలు కూడా మనం ఇచ్చాం. రైతు ఇబ్బందులు పడకుండా ఉండాలని మనం ఇచ్చేశాం. 

గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలు రూ.384 కోట్లు.. మనం చెల్లించాం. 
ఆయిల్‌ఫామ్‌ పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేట్‌ బెటర్‌గా వస్తుంది. మన దగ్గర రేట్‌ తక్కువగా ఉంది. ఆయిల్‌ఫామ్‌ రైతులను ఆదుకునేందుకు రూ.80 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి అడుగులోనూ మార్కెటింగ్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ (ధరల స్థిరీకరణ నిధి) ద్వారా రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేశాం. రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ ఏడాది నిలబడిపోతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా.. 

రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి.. కనీసం రైతు బతికే పరిస్థితిలోకి రావాలనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం. ఇందుకు రాష్ట్రంలోని 191 మార్కెట్‌ యార్డులను 216కు పెంచాం. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవుల్లో కూడా సామాజిక న్యాయం తీసుకువచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. ఈ పదవుల్లో 50 శాతం మహిళలే ఉండేలా మార్పులు తీసుకువచ్చాం. 

వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేశాం. గిట్టుబాటు ధరలు పంట వేసే ముందే ప్రకటిస్తామని మాట నిలబెట్టుకున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద కనీస గిట్టుబాటు ధరలు ఏ పంటకు ఎంత అని ముందుగానే ప్రకటిస్తున్నాం. ఆ ధరలు ఇప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తుంది. 

కోవిడ్‌ సమయంలో అరటిపంట కొనుగోలు చేసేవారు లేకపోవడంతో అరటి కొనుగోలు చేసి రాష్ట్రం అంతా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం అవస్థలు పడకూడదు అని ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 417 మంది రైతులు చనిపోతే వాళ్లను పట్టించుకోకుండా వదిలేశారు. ఆ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం చెప్పిన రూ. 5 లక్షలు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఇచ్చాం. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత 229 మంది చనిపోతే.. ఆ రైతులకు తోడుగా ఉండేందుకు వెంటనే కలెక్టర్లను వెళ్లమని ఆదేశించా. కలెక్టర్‌ రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.7లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించాం. ప్రతి అడుగు రైతులను కాపాడుకునేందుకు, వ్యవసాయానికి తోడుగా నిలబడేందుకు వేస్తున్నాం. 

ఆవులు, గేదెలకు కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. ఆవు చనిపోతే రూ. 15 నుంచి రూ.30 వేలు ఇస్తున్నాం. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల పరిహారం ఇచ్చేలా పశునష్ట పరిహార పథకాన్ని కూడా మన ప్రభుత్వం అమలు చేస్తోంది. 

రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసివేసే ప్రయత్నం చేస్తున్నాం. రైతు పంట పండించే చోటే పంట కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇందుకు చేసిన గొప్ప ఆలోచన  ఈ నెల 30వ తేదీన ప్రారంభించబోయే రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు గ్రామ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయి. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభించబోతున్నాం. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల ముందులు రైతుకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే కార్యక్రమం ఆర్‌బీకేల ద్వారా చేస్తాం. 

రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ ఉంటుంది. ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆర్‌బీకేలో టీవీ.. చిత్రాలు అన్నీ ఉంటాయి. ప్రతి రైతుకు సూచనలు, సలహాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆర్‌బీకే విజ్ఞాన, శిక్షణ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్పించేందుకు ఆర్‌బీకేల ద్వారా నాంది పలుకుతున్నాం. 

ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉంటాడు. అతని వద్ద ట్యాబ్‌ ఉంటుంది. గ్రామ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు. వీరిద్దరూ కలిసి పంట వేసేటప్పుడే ఈక్రాపింగ్‌ చేస్తారు. రైతుకు పంట రుణాలు ఇప్పిస్తారు. ఈ క్రాపింగ్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ కూడా ఆర్‌బీకే కేంద్రం చేస్తుంది. ఆర్‌బీకేలోనే పూర్తిగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అని బోర్డు ప్రదర్శిస్తాం. ఆ గ్రామంలో ఏ రైతుకయినా గిట్టుబాటు ధర రాకపోతే ఆర్‌బీకేలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ దగ్గర ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఉంటుంది. ప్రతి రోజు ఏ పంట పరిస్థితి ఏమిటీ.. ఎన్ని పంటలు వేశారు..ఆ పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా.. లేదా..? ఆ పంటల్లో మనం ఇంటర్వీన్‌ కావాల్సిన అవసరం ఉందా..? రైతు నష్టపోకుండా పంట అమ్ముకుంటున్నాడా..? అని ప్రతి రోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సమాచారం పంపించాలి. ఆ సమాచారం పంపించేందుకు సీఎం (కాంప్రిహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైసెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌) యాప్‌ అని పేరు పెట్టాం. ప్రతి రోజూ అగ్రికల్చర్‌ రైతుల పరిస్థితి మీద సమాచారం పంపించాలి. 

ఆర్‌బీకే కేంద్రాల మానిటరింగ్‌ కోసమే జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించాం. రైతుకు గిట్టుబాటు ధర రానిపరిస్థితి ఉంటే వెంటనే ఇంటర్వీన్‌ అయ్యి రైతుకు గిట్టుబాటు ధరను ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఇప్పిస్తాడు. 

గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు జరబోతున్నాయి. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకింగ్‌ యూనిట్లు రేపు సంవత్సరకాలంలో వస్తాయి. రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటే.. 30 శాతం పంటలు ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే సాధ్యమవుతుందని ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నాం. రైతులు పండించే పంటలు, చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు జనతా బజార్లలో ఉంటాయి. ప్రభుత్వం 30 శాతం కొనుగోలు చేస్తే.. వెంటనే మార్కెట్‌లో పోటీతత్వం మొదలవుతుంది. ఏ దళారీ అయినా గవర్నమెంట్‌ కొనుగోలు చేసే రేట్‌ కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తాడు. వచ్చే సంవత్సరం చివరికల్లా జనతా బజార్లు వస్తాయి. రాబోయే రోజుల్లో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి.
 
నాణ్యతను పరిరక్షించేందుకు 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు తీసుకువస్తున్నాం. పంటలు పండించే నియోజకవర్గాలు 147గా గుర్తించడం జరిగింది. అక్కడ మొత్తం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్‌బీకే స్థాయిలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. భూసార పరీక్షలు చేయిస్తాం. వ్యవసాయ శాఖ సలహా బోర్డులను ఏర్పాటు చేయడానికి జీఓ కూడా విడుదల చేశాం. రాష్ట్రస్థాయిలో ఒక వ్యవసాయ సలహా బోర్డు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. సలహా బోర్డులోని సమస్యలు గ్రామాల్లోని రైతులను ఏ పంట వేస్తే ఎంత లాభం అని వివరించి అవగాహన కల్పిస్తారు. మార్కెట్‌లో ఏ పంటకు ధర అధికం వస్తుందని చెబుతూ.. ఎడ్యుకేట్‌ చేస్తారు. 

ఆర్‌బీకేలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం అవుతాయి. అక్కడి నుంచి విప్లవాత్మక మార్పు ప్రారంభం అవుతుంది. 

రైతులకు మంచి జరగాలంటే.. వ్యవసాయం బతకాలంటే నీటి అవసరం ముఖ్యం. ప్రాజెక్టులు పూర్తికావాలి. మంచి ప్రాజెక్టులు తీసుకురావాలి. మనం అధికారంలోకి జూన్‌లో వచ్చాం. ఏయే ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది.. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని తీసుకువచ్చి.. ప్రాజెక్టుల ప్రాముఖ్యతను బట్టి పూర్తి చేసేందుకు ప్రణాళికకు ఈ సంవత్సరం పట్టింది. ఈ ఏడాది వ్యవసాయం మీద రూ.4,160 కోట్లు ఖర్చు చేశాం. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా వ్యవసాయానికి సంబంధించి జలవనరుల శాఖలో రూ.1095 కోట్లు ఆదా చేశాం. గత ప్రభుత్వం టెండర్లు పిలిచి వర్కులు ఇచ్చేసిన తరువాత వాటిని మనం రద్దు చేసి రివర్స్‌టెండరింగ్‌కు పిలిస్తే రూ.1095 కోట్లు మిగిలింది. పట్టించుకోకపోతే ఈ డబ్బంతా నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.1095 ప్రభుత్వానికి మిగిలింది. 

ఏయే ప్రాజెక్టులు చేపట్టాలని నా మనసులో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉంది. ప్రాముఖ్యత ప్రకారం ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే పూర్తి క్లారిటీతో ఉన్నాం. ఇక మీద నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతాయి. ఈ సంవత్సరం వంశధార ఫేజ్‌ –2, వంశధార, నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్‌–1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవకు టన్నల్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఈ ఏడాది టార్గెట్‌ పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం.

పోలవరం ప్రాజెక్టు కోవిడ్‌ వల్ల పనులు జాప్యం జరిగింది. అయినా కూడా వేగవంతం చేసే కార్యక్రమం చేస్తాం. పోలవరం 2021కి పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాం. ఈ సంవత్సరం ఎండ్‌ వరకు కంప్లీట్‌ చేసేందుకు అన్ని విధాలుగా పరుగులు పెట్టిస్తాం. 

రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టులు తీసుకువస్తున్నామో.. వాటిపై ఎంత ఆరోపణలు చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. మనం యుద్ధం చేస్తుంది.. చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. యుద్ధం చేస్తుంది.. ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌తో, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని మీ అందరికీ చెప్పాల్సిన పనిలేదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాగుపడాలంటే.. నీరు రాని పరిస్థితి. 

శ్రీశైలంలో 885 అడుగులు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్, కానీ పోతిరెడ్డిపాడు 44 వేల క్యూసెక్కులు డ్రా చేసే పరిస్థితి.. నీరు 881 అడుగులు ఉంటే మాత్రమే డ్రా చేయగలం. శ్రీశైలం 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు పడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రాయలసీమలో కరువు ఎప్పుడు తీరుతుంది. 

ఆల్‌మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు కర్ణాటకలో పెంచుతున్నారు. పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే వరద నీరు ఎన్ని రోజులు ఉంటాయని చూస్తే కేవలం 10 రోజులు మాత్రమే. 881 అడుగులు పది రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. అన్ని ప్రాజెక్టులు 800 అడుగుల్లోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి వారు పవర్‌ జనరేషన్‌ 796 అడుగులకు రాగానే పవర్‌ జనరేషన్‌ మొదలుపెడుతున్నారు. ఏరకంగా ప్రాజెక్టులు బతుకుతాయి. ఏరకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు వస్తాయని ఆలోచన చేస్తేనే మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకనే పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 800 అడుగుల్లో వారు ఆపరేట్‌ చేస్తున్న పంపులతో.. మనం కూడా 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో పంపులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఉంటాం. మన నీళ్లు మనం.. వారి నీరు వాళ్లు తీసుకుంటారు. ఎవరికీ అన్యాయం జరగదు. 

రాయలసీమ డ్రౌట్‌మెట్రిగేషన్‌ 800 అడుగులకే నీళ్లను తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల రూ.27 వేల కోట్లతో డ్రౌట్‌మెట్రిగేషన్‌ ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు సంబంధించి చేస్తున్నాం. పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి 50 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతున్నాం. గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఆ నీళ్లను పోలవరం కెనాల్‌ 17500 క్యూసెక్కులు.. దాన్ని 50 వేల క్యూసెక్కులు చేసి ప్రకాశం బ్యారేజ్‌ వరకు నీరు తీసుకువస్తే నాగార్జునసాగర్‌ అంతా సస్యశ్యామలం అయిపోతుంది. ఇక్కడి నుంచి 25 వేల క్యూసెక్కులు మళ్లీ శ్రీశైలంలోకి కలిపే పరిస్థితిలోకి తీసుకెళ్తాం. రైతు ఇబ్బంది పడకుండా.. అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు టెండర్లు ఈ ఏడాదిలోని పిలుస్తాం. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరో 17 వేల కోట్లు అయ్యే ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చుతుంది. ఈ ప్రాజెక్టు టెండర్లను కూడా ఈ సంవత్సరమే పిలుస్తాం. ఇంతకు ముందే ఒక ప్యాకేజీ పిలిచాం.. మిగిలిన ప్యాకేజీలను కూడా పిలుస్తాం. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు గొప్పగా నిండాయి. 2019–20లో 12 ఏళ్ల తరువాత కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. రాయలసీమ ప్రాజెక్టులకు చరిత్రలో లేని విధంగా ఈ సంవత్సరం నీరు పంపించాం. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థామర్థ్యంతో 45.77 టీఎంసీలతో నింపగలిగాం. సోమశిలను కూడా గరిష్ట స్థాయిలో 78 టీఎంసీల వరకు నింపాం. కండలేరు ప్రాజెక్టును 59.75 టీఎంసీలతో నింపగలిగాం. 

గత దశాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కాలంలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయి స్థాపించాం. 2018–19లో 150 లక్షల మెట్రిక్‌ టన్నులు అయితే మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటి ఏడాది దేవుడి దయతో 172 లక్షల మెట్రిక్‌ తన్నులు నమోదైందని గవరగా చెబుతున్నా. ఇదంతా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాం. 
 

Back to Top