ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా

అగ్రిగోల్డ్‌ బాధితులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు చెల్లింపు

అక్షరాల 10.40 లక్షల కుటుంబాల ఖాతాల్లో రూ.905.57 కోట్లు జమ 

రూ.10 వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు 2019 నవంబర్‌లో చెల్లించాం

నేడు 7 లక్షల 370 మంది కుటుంబాలకు రూ.666.84 కోట్లు చెల్లింపు 

ప్రైవేట్‌ సంస్థ మోసానికి గురైన కష్టజీవులను మానవత్వంతో ఆదుకున్నాం

అగ్రిగోల్డ్‌ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వమే..

జీఓ నంబర్‌ 31తో గతప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసింది

రాబోయే రోజుల్లోనూ బాధితుల పక్షాన న్యాయపరంగా ముందడుగులు వేస్తాం

తాడేపల్లి: ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని, సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. నేడు దాదాపు 7 లక్షల 370 మంది అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాల ఖాతాల్లో రూ.666.84 కోట్లు జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించి మొదటి, రెండో విడత కలుపుకుంటే అక్షరాల 10.40 లక్షల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు వేయడం జరిగిందన్నారు. ప్రైవేట్‌ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని కష్టజీవులను మానవత్వంతో ఆదుకుందన్నారు. రూ.20 వేలలోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దార్లకు నగదు చెల్లింపు ప్రక్రియను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 

అంతకు ముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. రెండు విడతల్లో చెల్లించిన నగదు, గత ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

గత ప్రభుత్వం 2014–15లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని మోసం చేసిన పరిస్థితులను మనం చూశాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన కుటుంబాలకు తిరిగి ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ప్రైవేట్‌ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని మానవత్వాన్ని చూపుతూ చెల్లించిన దాఖలాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండవేమో.. 

ఒక్కసారి గతంలోకి వెళ్లిచూస్తే అగ్రిగోల్డ్‌ స్కామ్‌ అనేది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలోని మనుషుల కోసం జరిగిన స్కామ్‌గా తేటతెల్లంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నవారే అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏరకంగా కొట్టేసే కార్యక్రమం జరుగుతుందో అసెంబ్లీలో కూడా సాక్షాధారాలు చూపించాం. గత ప్రభుత్వ హయాంలోని నాయకులే కర్త, కర్మ, క్రియగా జరిగిన స్కామ్‌ అని మనందరికీ ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇప్పటికే ఈ మల్టీస్టేట్‌ స్కామ్‌ విచారణలో, కోర్టుల పరిధిలో ఉంది. ఈ స్కామ్‌ వల్ల మన రాష్ట్రంలో ఎవరు నష్టపోయారనేది, ఎంత నష్టపోయారనే అంశంపై ఇప్పటివరకు ధ్యాసపెట్టడం జరిగింది. 

రూపాయి రూపాయి దాచుకొని ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో కష్టజీవులు డబ్బు డిపాజిట్‌ చేశారు. కూలి పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు, తోపుడుబండ్ల మీద బతికేవారు, రిక్షా కార్మికులు ఇలాంటి కష్టజీవులందరినీ గత ప్రభుత్వం ఆదుకుంటామని మోసం చేసి గాలికి వదిలేసింది. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా అడగడం, నిలదీయడం నుంచి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబర్‌లోనే రూ.10 వేలలోపు డబ్బు డిపాజిట్‌ చేసిన 3.40 లక్షల బాధితులకు కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించడం జరిగింది. 

ఇంతమందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఆలోచనతో గతంలో డిస్ట్రిక్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జాబితాలో అర్హులై మిగిలిపోయినవారిని గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తించి మరో 3,86,275 మంది రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేలా చెల్లింపులు చేస్తున్నాం. ఇందుకు మరో రూ.207.61 కోట్లు వారికి విడుదల చేస్తున్నాం. 

ఈడబ్బుతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదాపు 3,14,095 మంది బాధితులకు మరో రూ.459 కోట్లు కూడా ఈరోజు విడుదల చేస్తున్నాం. గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగానే అర్హులైన అగ్రిగోల్డ్‌ బాధితులకు పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి మొత్తం రూ.666.84 కోట్లను అక్షరాల 7లక్షల 370 కుటుంబాలకు నేడు జమ చేయడం జరుగుతుంది. 

గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన బాధితుల సంఖ్య 8.79 లక్షల మందిగా, చెల్లించే డబ్బు రూ.785 కోట్లుగా అప్పట్లో తేల్చింది. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ప్రజలను మోసం చేయడానికి గత ప్రభుత్వం 07 ఫిబ్రవరి 2019న జీఓ నంబర్‌ 31 కూడా ఇచ్చింది.  జీఓ ఇచ్చి కూడా అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేసింది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఐదేళ్ల పాటు మోసాలు చేస్తూ వచ్చిన అప్పటి ప్రభుత్వం.. కష్టజీవులను గాలికివదిలేసింది. వారి కష్టాలను చూసి.. వారికి మంచి జరగాలని మనసారా కోరుకొని అర్హులైన అక్షరాల 10.40 లక్షల మంది బాధితులకు చెప్పిన మాట ప్రకారం రూ.905.57 కోట్లు ఈరోజుతో చెల్లించాం. 

రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టులో ఒక కొలిక్కి రాగానే.. అగ్రిగోల్డ్‌ భూములను, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును జమ చేసుకొని మిగిలిన డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా అడుగులు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతాయని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ సోదరుడు ఈపని చేయగలుగుతున్నాడని సవినయంగా మనవిచేస్తూ.. దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మనందరి ప్రభుత్వంపై కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top